నెలాఖరున చంద్రయాన్!


Tue,July 16, 2019 02:59 AM

Chandrayaan 2 launch may be around the new moon on July 29 30

-29న లేదా 30న ప్రయోగించే అవకాశం
-సాంకేతిక సమస్యతో సోమవారం ప్రయోగం వాయిదా
-ప్రయోగానికి 56.24 నిమిషాల ముందు కౌంట్‌డౌన్ నిలిపివేత
-రాకెట్, ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ సురక్షితం

శ్రీహరికోట, జూలై 15:ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగానికి సోమవారం అనూహ్యంగా బ్రేక్ పడిన నేపథ్యంలో.. ఈ నెలాఖరున మళ్లీ ఈ ప్రయోగం చేపట్టాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భావిస్తున్నది. ప్రయోగానికి అవసరమైన లాంచ్ విండోకు ఈ నెలలోనే అనువైన సమయం ఉన్నట్లు ఇస్రో అధికారులు చెప్తున్నారు. జూలై 1-15, జూలై 16, జూలై 29, జూలై 30 తేదీల్లో ప్రయోగానికి అనువైన లాంచ్ పీరియడ్‌లు ఉన్నట్లు ఇదివరకే గుర్తించారు. ఈ క్రమంలో ఈ నెలాఖరున 29 లేదా 30వ తేదీల్లో చంద్రయాన్-2ను ప్రయోగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాహుబలిగా పిలుస్తున్న జీఎస్‌ఎల్వీ మాక్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2ను సోమవారం వేకువజామున 2.51 గంటలకు ప్రయోగించాలని తొలుత నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే జీఎస్‌ఎల్వీలో సాంకేతిక లోపం ఏర్పడటాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగ సమయానికి 56 నిమిషాల, 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు. ఆ వెంటనే శ్రీహరికోట నుంచి ప్రత్యక్ష ప్రసారాలను కూడా నిలిపివేయడంతో అంతటా గందరగోళం ఏర్పడింది. కొద్ది నిమిషాల తరువాత ఇస్రో ఒక ప్రకటన విడుదల చేస్తూ చంద్రయాన్-2 ప్రయోగం రద్దయినట్టు తెలిపింది. వ్యోమనౌకలో సాంకేతిక సమస్యను గుర్తించామని, అందువల్ల ప్రస్తుతానికి చంద్రయాన్-2ను రద్దు చేశామని ఇస్రో అసోసియేట్ డైరెక్టర్ బీఆర్ గురుప్రసాద్ తెలిపారు.

మళ్లీ ఎప్పుడు చేపట్టేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. అయితే సమస్యకు కారణం ఏమై ఉంటుందనే దానిపై ఇస్రో నోరుమెదపడం లేదు. చంద్రయాన్-2ను వాస్తవానికి ఈ ఏడాది జనవరి చివరి వారంలో ప్రయోగించాలని తొలుత భావించారు. ఆ తరువాత జూలై 15వ తేదీని ఖరారు చేశారు. ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌తో కూడిన 3,850 కిలోల అంతరిక్ష నౌకను శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రునిపైకి పంపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆదివారం రాత్రే శ్రీహరికోటకు చేరుకున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి గత వారమే పూర్తిస్థాయిలో రిహార్సల్స్ చేశారు. అనంతరం ఆదివారం ఉదయం 6.51 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. ప్రయోగానికి ముందు అవసరమైన ఇంధనాన్ని రాకెట్‌లో నింపారు. అంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉంటే శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్వీ మాక్-3 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లి ఉండేది. ఆపై కేవలం 16.13 నిమిషాల వ్యవధిలో చంద్రయాన్-2ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టి ఉండేది. చంద్రునిపై సురక్షితంగా ఓ రోవర్‌ను దింపిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర పుటల్లోకి ఎక్కేది. ఇంతకుముందు రష్యా, అమెరికా, చైనా మాత్రమే తమ రోవర్‌లను చంద్రునిపై దింపాయి.

GSLV-Mk-III

రాకెట్, ఉపగ్రహం సురక్షితం

లాంచ్‌ప్యాడ్‌పైకి ప్రయోగ వాహనాన్ని (జీఎస్‌ఎల్వీ-మాక్3)ని చేర్చి, కౌంట్‌డౌన్ ప్రారంభించి, రాకెట్‌లో ఇంధనాన్ని నింపిన తరువాత చంద్రయాన్-2ను రద్దు చేసినప్పటికీ ఎటువంటి నష్టం జరుగలేదని ఇస్రో అధికారులు తెలిపారు. రాకెట్‌లో ముందుగానే లోపాన్ని పసిగట్టడం అదృష్టమని వారు పేర్కొన్నారు. రాకెట్ క్రయోజనిక్ ఇంజిన్‌లో ఇంధనం లీకవుతుండటాన్ని అధికారులు కొద్ది నిమిషాల ముందు గుర్తించినట్టు తెలుస్తున్నది. రాకెట్ పనితీరు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం లేదు. ప్రయోగానికి ముందే దీన్ని మేం గుర్తించాము. అప్పటికి అన్నీ మా నియంత్రణలోనే ఉన్నాయి. రాకెట్, అందులోని ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ సురక్షితంగా ఉన్నాయి అని ఓ అధికారి చెప్పారు. వ్యోమనౌకలో తలెత్తిన సాంకేతిక సమస్యలను నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించి, దానిని సరిచేయడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. ఇందుకోసం కనీసం వారం రోజుల సమయం అవసరమని వారు పేర్కొన్నారు. ప్రయోగం నిలిపివేసిన అనంతరం తీవ్రంగా మండే స్వభావం ఉన్న ద్రవరూపంలోని హైడ్రోజన్, ఆక్సిజన్‌ను వ్యోమనౌక నుంచి వేరు చేశామని ఒక అధికారి వెల్లడించారు. సాంకేతిక సమస్యను తెలుసుకోవడానికి రాకెట్‌ను పూర్తిగా విడదీయాల్సి ఉంటుందని మరో అధికారి తెలిపారు.

అప్రమత్తత అపార నష్టాన్ని నివారించింది


-ఇస్రోపై శాస్త్రవేత్తల ప్రశంసలు
న్యూడిల్లీ: ఇస్రో అప్రమత్తత అపార నష్టాన్ని నివారించిందని పలువురు అంతరిక్ష శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిలిపివేయడం ద్వారా ఇస్రో నిపుణులు ముప్పును కొనితెచ్చుకోకుండా ముందుజాగ్రత్తగా వ్యవహరించారని అన్నారు. ఎంతో సంక్లిష్టమైన, ప్రతిష్ఠాత్మకమైన ప్రయోగంగా భావించిన చంద్రయాన్-2ను సాంకేతిక లోపం కారణంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఇస్రోకు అసాధారణమైన సక్సెస్ రేటుంది. సంక్లిష్టమైన వ్యవస్థను చివరి నిమిషం వరకు పరిశీలించి, లోపాలు గుర్తించడం ఓ ప్రత్యేకమైన కళ. ఈ కళలో ఇస్రో నిపుణులు ఆరితేరారు అని కోల్‌కతాలోని భారత శాస్త్రీయ విద్య, పరిశోధన సంస్థ (ఐఐఎస్‌ఈఆర్)లో అంతరిక్ష శాస్ర్తాల కేంద్ర అధిపతిగా ఉన్న రాజేశ్ కుంబ్లే నాయక్ పేర్కొన్నారు. ముప్పును కొని తెచ్చుకోవడానికి బదులుగా ప్రయోగాన్ని నిలిపివేయాలని ఇస్రో నిర్ణయించడం హర్షించదగిన విషయం అని అన్నారు. కొద్ది వారాల తరువాత ఈ ప్రయోగాన్ని మళ్లీ చేపడుతారని ఆయన చెప్పారు. సాంకేతిక సమస్యలను ఇస్రో పరిష్కరిస్తుందని, త్వరలోనే చంద్రయాన్‌ను విజయవంతంగా ప్రయోగిస్తుందని ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అసొసియేట్ ప్రొఫెసర్ సుదీప్ భట్టాచార్య పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం మంచిది కాదు. చివరి క్షణం వరకు అప్రమత్తంగా ఉండాలి. అత్యంత అప్రమత్తంగా ఉండ టం వల్లనే ఈ ప్రయోగాన్ని నిలిపివేశారు. ఎంతో విలువైన సంపదను కాపాడారు. ఈ గొప్పదనం అంతా ఇస్రో బృందానిదే అని అన్నారు. ఐఐఎస్‌ఈఆర్‌కు చెందిన ప్రొఫెసర్ దిబ్యేందు నంది కూడా ఇస్రోపై ప్రశంసలు కురిపించారు.

గతంలోనూ సాంకేతిక సమస్యలు

ఇస్రోకు సాంకేతిక సమస్యలు కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనప్పటికీ, వివిధ రకాల ఉపగ్రహ వాహక నౌకలను విజయవంతంగా ప్రయోగించింది. జీఎస్‌ఎల్వీ-మాక్3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2ను ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. అయితే చివరి నిమిషంలో జీఎస్‌ఎల్వీలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో ఆ ప్రయోగాన్ని రద్దు చేశారు. చిన్న ఉపగ్రహాల ప్రయోగానికి ఇస్రో ఇదివరకు జీఎస్‌ఎల్వీ-మాక్-2ను వినియోగించింది. 2001 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 13సార్లు జీఎస్‌ఎల్వీ-మాక్2ను ఉపయోగించారు. అయితే మూడుసార్లు జీశాట్-5పీ, జీశాట్-4, ఇన్‌శాట్-4సీ ప్రయోగాలు మాత్రం విఫలమయ్యాయి. బాహుబలిగా పేరొందిన జీఎస్‌ఎల్వీ మాక్-3రాకెట్ 4 టన్నుల బరువు వరకు అంతరిక్షానికి మోసుకెళ్లగలదు. ఈ రాకెట్‌ను ఉపయోగించి ఇంతకుముందు జీశాట్-29, జీశాట్-19 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. ఇదే రాకెట్‌ను ఉపయోగించి క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియరిక్ రీ ఎంట్రీ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. గగన్‌యాన్ మిషన్‌కు కూడా జీఎస్‌ఎల్వీ మాక్-3నే ఉపయోగిస్తామని ఇస్రో చైర్మన్ శివన్ ఇటీవల చెప్పారు.

సందర్శకుల నిరుత్సాహం


gslv
అర్ధరాత్రి అయినప్పటికీ అనేకమంది ఔత్సాహికులు చంద్రయాన్-2 ప్రయోగాన్ని వీక్షించేందుకు శ్రీహరికోట పరిసరాల్లోకి చేరుకున్నారు. కొందరు తమ పిల్లలతోపాటు దూర ప్రాంతాల నుంచి వాహనాలపై వచ్చారు. ఇస్రో ఇటీవల ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలో వేచి ఉన్న వారంతా ప్రయోగం వాయిదా పడిందని తెలియడంతో నిరుత్సాహంగా తిరిగి వెళ్లిపోయారు. చంద్రయాన్ ప్రయోగాన్ని చూడాలనుకున్న వారి పేర్లను ఇస్రో అధికారులు వారం రోజుల ముందుగానే నమోదు చేసుకున్నారు. రాకెట్ ఇంకా భూమిపై ఉన్నప్పుడే శాస్త్రవేత్తలు దానిని నిలిపివేయడం మంచిదైంది. ఒకవేళ రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లిన తరువాత సాంకేతిక లోపం ఏర్పడి ప్రయోగం విఫలమై ఉంటే వందల కోట్ల రూపాయలు వృథా అయిపోయేవి అన్న వ్యాఖ్యలు వినిపించాయి.

1076
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles