నేడే చంద్రయాన్‌-2


Mon,July 22, 2019 12:31 PM

Chandrayaan 2 launch Countdown for rocket take off going smoothly

-ప్రయోగానికి సర్వం సిద్ధం
-మధ్యాహ్నం 2.43 గంటలకు నింగిలోకి జీఎస్‌ఎల్వీ మాక్‌-3
-ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్‌
-వాహకనౌక: జీఎస్‌ఎల్వీ మాక్‌-3
-ఏమేం ఉంటాయి: ఆర్బిటార్‌, ల్యాండర్‌, రోవర్‌
-బరువు: 3.8 టన్నులు
-ఎత్తు: 43.43 మీటర్లు
-ప్రయోగ వ్యయం: రూ.978 కోట్లు
-ప్రధాన లక్ష్యం: చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌,
-నీరు, హీలియం-3 జాడలను గుర్తించడం
-చంద్రుడు, భూమి మధ్య దూరం: 3.844 లక్షల కి.మీ.
-ప్రయోగానికి సర్వం సిద్ధం
-మధ్యాహ్నం 2.43 గంటలకు నింగిలోకి జీఎస్‌ఎల్వీ మాక్‌-3
-ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్‌

న్యూఢిల్లీ, జూలై 21:చంద్రయాన్‌-2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నెల్లూరు జిల్లా సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని (షార్‌లోని) రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం మధ్యా హ్నం 2.43 గంటలకు చంద్రయాన్‌-2ను ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇస్రో ‘బాహుబలి’గా పిలిచే జీఎస్‌ఎల్వీ మాక్‌-3 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపడతారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రం 6:43 గంటలకు 20 గంటల కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని ఇస్రో తెలిపింది. ఈ నెల 15వ తేదీ వేకువజామునే చంద్రయాన్‌-2ను ప్రయోగించాలని భావించినా, చివరి నిమిషంలో సాంకేతిక సమస్యను గుర్తించడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్యను సరిచేశామని, ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ ఆదివారం చెప్పారు. లాంచింగ్‌ రిహార్సల్స్‌నూ విజయవంతంగా పూర్తిచేసినట్లు చెప్పారు. 43.43 మీటర్ల ఎత్తైన జీఎస్‌ఎల్వీ మాక్‌-3 రాకెట్‌.. ప్రయోగించిన 16 నిమిషాల తర్వాత స్పేస్‌ క్రాఫ్ట్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెడుతుందన్నారు. పైకెగసిన తర్వాత చంద్రయాన్‌-2కు 15 కీలక దశలను చేపట్టాలని, సెప్టెంబర్‌ మొదటి వారంలో ల్యాండర్‌ చంద్రుడిపై దిగే అవకాశం ఉందన్నా రు. ఇంతకుముందెన్నడూ ఏ దేశమూ చేరని చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండర్‌ను మృదువుగా దింపనున్నట్లు చెప్పారు.

చంద్రయాన్ 2 పై ప్రత్యేక వీడియో





దక్షిణ ధ్రువ ప్రాంతంలో పరిశోధనలు..

ఇస్రో రూ.978 కోట్ల వ్యయంతో చంద్రయాన్‌-2 మిషన్‌ను చేపడుతున్నది. 2008 లో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్‌-1కు ఇది కొనసాగింపు. చంద్రయాన్‌-1 ద్వారా జాబిల్లిపై నీటి జాడలను గుర్తించిన సంగతి తెలిసిందే. చంద్రయాన్‌-2 బరువు సుమారు 3.8 టన్నులు. ఇందులో ఆర్బిటార్‌, ల్యాండర్‌, రోవర్‌ ఉంటాయి. ఇంతకుముందు ఏ దేశమూ చేరని చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఇస్రో ల్యాండర్‌, రోవర్‌ను దించబోతున్నది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సాగించిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనున్నది. ఇంతకుముందు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయి. చంద్రయాన్‌లోని ఆర్బిటార్‌ ఏడాది పనిచేస్తుంది. చం ద్రుడి ఉపరితలంపై దిగే ల్యాండర్‌ (విక్రమ్‌), రోవర్‌ (ప్రజ్ఞ) 14 రోజులు పనిచేస్తాయి.

చం ద్రుడి దక్షిణ ద్రువంలో దిగి.. నీరు, హీలి యం-3 జాడను గుర్తించడం చంద్రయాన్‌-2 ప్రధాన లక్ష్యాలు. ప్రయోగించిన 16.20 నిమిషాల తర్వాత జీఎస్‌ఎల్వీ రాకెట్‌ చంద్రయాన్‌-2ను భూమికి 170 కి.మీ ఎత్తులోని కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. తదుపరి 48 రోజులు శాస్త్రవేత్తలు వివిధ దశలను నిర్వహించనున్నారు. లాంచింగ్‌ను రీషెడ్యూల్‌ను చేసిన ఇస్రో.. ఎర్త్‌ బౌండ్‌ ఫేజ్‌ను తొలుత నిర్ణయించిన 17 రోజులకు బదులుగా 23 రోజులకు పెంచింది. ఈ ఫేజ్‌ చివరిలో చంద్రయాన్‌-2 కక్ష్యను 1.05 లక్షల కి.మీ.లకు పెంచుతారు. అనంతరం క్రమంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెడుతారు. ఆ తర్వాత కొద్ది రోజులకు చంద్రుడికి 100 కి.మీ. ఎత్తున వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. పలుమార్లు పరిభ్రమించిన అనంతరం సరైన సమయంలో చంద్రయాన్‌-2 ల్యాండర్‌ను చంద్రుడిపైకి జారవిడుస్తుంది. మిషన్‌లో ఈ దశే అత్యంత సంక్లిష్టమైనది. దీనికి 15 నిమిషాలు సమయం పడుతుంది. సెప్టెంబర్‌ 6-8 మధ్యలో ఈ దశను చేపట్టే అవకాశం ఉంది.

ఇస్రోకూ రాహుకాలం!

ఇతర గ్రహాలపైకి రాకెట్లను, ఉపగ్రహాలను పంపే ఇస్రో శాస్త్రవేత్తలూ తమ విశ్వాసాలు, మూఢనమ్మకాలను అనుసరిస్తుంటారని ఇస్రో విశ్రాంత అధికారి ఒకరు తెలిపారు. రాకెట్‌ ప్రయోగానికి రాహు కాలంలో ఎన్నడూ కౌంట్‌డౌన్‌ ప్రారంభించరన్నారు. ఏదైనా పని ప్రారంభించడానికి రాహు కాలాన్ని అశుభప్రదంగా పరిగణించడం తెలిసిందే. ‘గ్రహాంతర ప్రయోగాల విషయమై రాకెట్‌ లాంచింగ్‌ సమయానికి శుభ సమయం కూడా తోడవ్వడం కుదరని పని. వ్యోమనౌక.. లక్షిత గ్రహ కక్ష్యలోకి చేరబోయే సమయానికి ఆ గ్రహం ఉండే స్థితిని బట్టి ప్రయోగ సమయాన్ని నిర్ణయిస్తారు. కాబట్టి, కౌంట్‌డౌన్‌ను మాత్రం శుభ సమయంలో ప్రారంభిస్తారు’ అని ఆ అధికారి వివరించారు.

అలాగే ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్‌ నమూనాను తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉంచి, స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. మరోవైపు రాకెట్‌ లాంచింగ్‌ నాడు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కొత్త షర్ట్‌ను ధరిస్తుంటారని రిటైర్డ్‌ రాకెట్‌ సైంటిస్ట్‌ ఒకరు తెలిపారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఇస్రో కూడా 13వ నంబర్‌ను అశుభంగా భావించడం. పీఎస్‌ఎల్వీ సీ-12 తర్వాత తదుపరి ప్రయోగానికి పీఎస్‌ఎల్వీ సీ-13 అని కాక పీఎస్‌ఎల్వీ సీ-14 అని ఇస్రో పేరు పెట్టడం గమనార్హం. మరోవైపు, చంద్రుడిపైకి ప్రయోగించిన అపోల్‌-13 మిషన్‌ విఫలం కావడంతో.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా మరే మిషన్‌కూ ఆ నంబర్‌తో పేరు పెట్టలేదు. గతంలో మంగళవారం ఎలాంటి ప్రయోగాలు చేపట్టని ఇస్రో, మంగళయాన్‌ ప్రయోగంతో ఆ సంప్రదాయం బ్రేక్‌ చేసింది. ‘ఇస్రో చరిత్రలో మంగళవారం ప్రయోగం చేపట్టడం అదే తొలిసారి. సాధారణంగా మంగళవారాన్ని అశుభదినంగా భావిస్తారు’ అని ఓ ఇస్రో అధికారి పేర్కొన్నారు.

చంద్రయాన్‌ వీక్షణకు భారీ గ్యాలరీ..

చంద్రయాన్‌-2 ప్రయోగం వీక్షించేందుకు సందర్శకుల కోసం భారీ గ్యాలరీ సిద్ధం చేశారు. ప్రయోగ వేదికకు సమీప శబరి గిరిజన కాలనీలో సుమారు 60 ఎకరాల అట వీ భూమిలో దీన్ని నిర్మించారు. సుమారు 5 వేల మంది రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించవచ్చు. ఈ నెల 15న ప్రయోగం వాయిదా పడడంతో రాకెట్‌ లాంచింగ్‌ను చూడాలనుకున్న వారికి నిరాశే మిగిలింది. గతంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారు తమ సీరియల్‌ నంబర్లతో పాసులు తీసుకుని ప్రయోగాన్ని వీక్షించొచ్చని ఇస్రో తెలిపింది.

1466
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles