మహిళల సారథ్యంలో!


Mon,July 22, 2019 12:36 PM

Chandrayaan 2 Indias 1st space mission being led by women scientists

-చంద్రయాన్-2 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వనిత, మిషన్ డైరెక్టర్‌గా రీతూ
-ప్రాజెక్టు భాగస్వాముల్లో 30 శాతం మంది మహిళలే

న్యూఢిల్లీ, జూలై 14: చంద్రయాన్-2 ప్రాజెక్టుకు మహిళలే నేతృత్వం వహిస్తున్నారు. ఇస్రో పూర్తిగా మహిళల సారథ్యంలో చేపట్టిన తొలి మిషన్ ఇదే కావడం విశేషం. అంతేకాదు.. ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన శాస్త్రవేత్తల్లో దాదాపు 30 శాతం మంది మహిళలే ఉన్నారట. చంద్రయాన్-2 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వనిత ముత్తయ్య, మిషన్ డైరెక్టర్‌గా రీతూ కరిదాల్ వ్యవహరిస్తున్నారు.
-వనిత ముత్తయ్య డాటా నిర్వహణలో నిపుణురాలు. సమస్యలను పరిష్కరించడంలో, బృందానికి నాయకత్వం వహించడంలో ఆమెకు మంచి నేర్పు ఉన్నది. వనిత ఇంతకుముందు చంద్రయాన్-1, కార్టోశాట్-1, ఓషన్‌శాట్ తదితర ప్రాజెక్టుల్లో భాగస్వామి అయ్యారు. రోదసి నుంచి ఉపగ్రహాలు, స్పేస్‌క్రాఫ్ట్‌లు పంపిన సమాచారాన్ని విశ్లేషించారు. చంద్రయాన్-2లో టెలిమెట్రీ, టెలీకమాండ్ డివిజన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. 2006లో ఉత్తమ మహిళా శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు.
-లక్నోకు చెందిన రీతూ కరిదాల్.. 1997 నుంచి ఇస్రోలో పనిచేస్తున్నారు. గతంలో అనేక ప్రాజెక్టుల్లో కీలకపాత్ర పోషించారు. ఉపగ్రహాలు, స్పేస్‌క్రాఫ్ట్‌లను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే బృందంలో ఆమె సభ్యురాలు. అంగారకుడిపై పరిశోధనల కోసం 2013లో పంపిన మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్)కు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2007లో అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్రో ఉత్తమ యువ శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు.

మహిళల కీలకపాత్ర

చంద్రయాన్-2 మిషన్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి బృందం లేదని.. ఇస్రోలోని 17వేల మంది సిబ్బంది ఈ మిషన్ కోసం కష్టపడ్డారని సంస్థ చైర్మన్ కే శివన్ చెప్తున్నారు. మిషన్ విజయం సాధిస్తే ఆ ఘనత ప్రతి ఒక్కరికీ దక్కుతుందని చెప్పారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చంద్రయాన్-2 కోసం ప్రత్యేకంగా 300 మంది శాస్త్రవేత్తలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 20-30 శాతం వరకు మహిళలు ఉన్నట్టు అంచనా. గతంలోనూ మహిళలు అనేక ప్రాజెక్టుల్లో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా మామ్ ప్రాజెక్టు కోసం ఒక యువ బృందం అహోరాత్రాలు శ్రమించింది. మామ్ కోసం 18 నెలలు నిరంతరాయంగా శ్రమించడానికి సిద్ధమయ్యాం. అంగారకుడి కక్ష్యలోకి వెళ్లిన తర్వాత భూమి నుంచి సంకేతాలు అందని సమయంలో స్పేస్‌క్రాఫ్ట్ స్వతంత్రంగా పనిచేసేలా సాఫ్ట్‌వేర్ రూపొందించే బాధ్యత తీసుకున్నాం. ఇది ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అయినా.. సమిష్టి కృషితో 10 నెలల్లోనే సాఫ్ట్‌వేర్‌ను సిద్ధంచేశాం అని రీతూ కరిదాల్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.
-ఇస్రో త్వరలో చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌లో సైతం మహిళా శాస్త్రవేత్తలకు ప్రాధాన్యం కల్పించారు. రోదసిలోకి పంపనున్న ముగ్గురు వ్యోమగాముల్లో ఒక మహిళ ఉన్నారు. ఈ ప్రాజెక్టులోని హ్యూమన్ స్పేస్ ప్రోగ్రామ్ ఆఫీస్‌కు వీఆర్ లలితాంబిక నాయకత్వం వహిస్తున్నారు.
-వీరితోపాటు టీకే అనురాధ, ఎన్ వలర్మతి, సీతా సోమసుందరం, నందిని హరినాథ్, మినాల్ రోహిత్, మౌమితా దత్తా వంటి మహిళా శాస్త్రవేత్తలు అనేక ప్రాజెక్టుల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

akshaye-sonakshi

చంద్రయాన్-2లో భాగమైన మహిళలకు అక్షయ్, సోనాక్షి విషెస్

భారతదేశ అంతరిక్ష చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబోయే అద్భుత ఘట్టం చంద్రయాన్-2 ప్రయోగంపై సర్వత్రా ఉత్కంఠ రేగుతున్నది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-2 మిషన్‌లో పాలుపంచుకున్న మహిళా శాస్త్రవేత్తలకు బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్, నటి సోనాక్షి సిన్హా శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు మహిళల నేతృత్వంలో చంద్రయాన్-2 లాంటి ఇంత పెద్ద ప్రయోగం రూపొందటం భారత చరిత్రలో తొలిసారని అక్షయ్ ప్రశంసించారు. చంద్రయాన్-2లో పాలుపంచుకున్న ఇద్దరు మహిళలను చూస్తే గర్వకారణంగా ఉన్నదని సోనాక్షి ట్వీట్ చేసింది. కాగా చంద్రయాన్-2కి రీతూ కారిదాల్ మిషన్ డైరెక్టర్‌గా, ముత్తయ్య వనిత ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటం తెలిసిందే.

Chandrayaan-2-desh

నాయకత్వం వహించడమే లక్ష్యం..

చంద్రునిపై స్వచ్ఛమైన హీలియం-3 ఛాయలను గుర్తించేందుకు చంద్రయాన్-2 ప్రయోగం విశ్లేషణలు చేయనున్నది. జాబిల్లిపై ఉన్న హీలియం-3ని సమర్థంగా వాడుకోగలిగితే భూమి మొత్తానికి అవసరమైన విద్యుత్‌ను ఏకంగా 500 ఏండ్ల పాటు తయారు చేసుకోవచ్చు. ప్రస్తుత విపణిలో ఒక టన్ను హీలియం ఖరీదు 500 కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా. చంద్రునిపై మొత్తం 10 లక్షల మెట్రిక్ టన్నుల హీలియం-3 ఉండొచ్చని భావిస్తున్నారు. దీని ఖరీదు ట్రిలియన్ల డాలర్లు (కోటి కోట్ల డాలర్లు)కు మించి ఉంటుంది. అయితే, చంద్రునిపై ఉన్న మొత్తం హీలియంలో కేవలం పావు శాతం వరకే భూమిపైకి తీసుకురాగలమని నిపుణులు చెబుతున్నారు. చంద్రునిపై ఉన్న ఇంధనాన్ని తీసుకొచ్చే దేశాలకు నాయకత్వం వహించడమే తమ లక్ష్యమని ఇస్రో చైర్మన్ శివన్ ఓ సందర్భంలో అన్నారు..

Apollo16

అప్పుడు అపోలో 11.. ఇప్పుడు చంద్రయాన్ -2

చంద్రునిపై వ్యోమగాములను పంపే ఉద్దేశంతో 1969 జూలై 16వ తేదీన అపోలో 11 మిషన్‌ను ప్రయోగించారు. అపోలో 11 స్వర్ణోత్సవ(యాభై ఏండ్లు) వసంతంలోనే చంద్రయాన్-2ని భారత్ పంపుతున్నది. అపోలో 11 మిషన్ ద్వారా చంద్రుడి ఉపరితలం మీద మొదటిసారిగా అడుగుపెట్టి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్‌డ్రీన్ చరిత్రకెక్కారు. ఇప్పుడు చంద్రయాన్-2 ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువం రహస్యాలను కనిపెట్టి భారత్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నది.

శ్రీహరికోట చేరుకున్న రాంనాథ్ కోవింద్

రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట చేరుకున్నారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఆయన ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో శ్రీహరికోట వెళ్లారు. సోమవారం వేకువజామున సరిగ్గా 2.51 గంటలకు జీఎస్‌ఎల్వీ మాక్-3 రాకెట్ నిప్పులు చిమ్ము కుంటూ నింగిలోకి దూసుకెళ్లనుంది.

1145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles