‘అవెంజర్స్’ కన్నా అగ్గువ


Mon,July 22, 2019 12:36 PM

Chandrayaan 2 cheaper than Avengers Endgame

-ఎండ్‌గేమ్ బడ్జెట్ కన్నా చంద్రయాన్-2 వ్యయమే తక్కువ
-ఇస్రో మిషన్‌పై ప్రశంసలు కురిపిస్తున్న విదేశీ మీడియా

న్యూఢిల్లీ, జూలై 14: చంద్రయాన్-2 మిషన్‌పై ప్రపంచ దేశాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొన్నది. వివిధ దేశాలకు చెందిన పత్రికలు, సైంటిఫిక్ జర్నల్స్ ఈ ప్రాజెక్టును ప్రశంసిస్తూ కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇస్రో అతి తక్కువ ఖర్చులో క్లిష్టమైన ప్రయోగాన్ని చేపడుతున్నదంటూ అభినందిస్తున్నాయి. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ అవెంజర్స్ ఎండ్‌గేమ్ బడ్జెట్‌తో పోల్చితే ఇస్రో సగంకంటే తక్కువ వ్యయంతో చంద్రుడిపై పరిశోధనలకు రోవర్‌ను పంపుతున్నదంటూ అమెరికా, రష్యా, చైనా తదితర దేశాల మీడియా పొగడ్తల వర్షం కురిపిస్తున్నది.

-అపోలో-11 మిషన్ ద్వారా వ్యోమగాములు చంద్రుడిపై అడుగుపెట్టిన 50 ఏండ్ల తర్వాత సరిగ్గా అదే రోజున.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చారిత్రాత్మక ఘటన ఆవిష్కృతం కానున్నది. ఇక్కడ చంద్రుడి బిలాల నీడలో చిక్కుకుపోయిన మంచుపై పరిశోధనలు జరుపనున్నది.
- సైంటిఫిక్ అమెరికన్

-చంద్రయాన్-2 మొత్తం వ్యయం 124 మిలియన్ డాలర్లు. ఇది హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా అవెంజర్స్ ఎండ్‌గేమ్ బడ్జెట్‌లో సగంకన్నా తక్కువే.
-స్పుత్నిక్ (రష్యా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ)

-ప్రతి ఒక్కరూ చంద్రమండలం మీదికి వెళ్లాలనుకుంటున్నారు. ఎందుకు? అనే శీర్షికన ద గార్డియన్ పత్రికలో రాసిన కథనంలో చంద్రయాన్-2 గురించి ప్రస్తావించారు. జూలై 15న తెల్లవారుజామున 2:51 గంటలకు శ్రీహరికోట నుంచి చంద్రయాన్-2ను ప్రయోగించనున్నారు. భారత్ చేపట్టనున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఇది అని పేర్కొన్నారు.
-భారత్ తన శాస్త్రసాంకేతిక శక్తిని ప్రపంచానికి చాటడానికి ప్రయోగాలు చేస్తున్నది. చైనా అగ్రరాజ్యంగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నది. అమెరికా అంగారకుడిపై పరిశోధనలకు చంద్రుడిని ఓ మజిలీగా ఎంచుకున్నది.
- న్యూయార్క్ టైమ్స్

-చైనా, భారత్‌తోపాటు ఇజ్రాయెల్, దక్షిణ కొరియా వంటి దేశాలు చంద్రుడిపైకి పోటాపోటీగా రోవర్లను పంపుతున్నాయి. వారి సాంకేతిక శక్తిని పరీక్షించుకోవడంతోపాటు జాతీయవాదాన్ని పెంపొందించడానికి ఈ ప్రయోగాలు ఉపయోగపడుతున్నాయి.
- నేషనల్ రిపబ్లిక్ రేడియో (అమెరికా)

-భారత్‌లో 1960ల్లోనే అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టినా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో కొత్త పుంతలు తొక్కుతున్నది. అంతరిక్ష రంగంలో సాధిస్తున్న విజయాలను భారత్ ప్రపంచశక్తిగా ఎదుగడంతోపాటు దేశ రక్షణ సామర్థ్యాలను పెంచేవిగా ప్రచారం చేయడంలో మోదీ విజయం సాధించారు.
- ద వాషింగ్టన్ పోస్ట్

-హాలీవుడ్ సినిమా గ్రావిటీ బడ్జెట్ కన్నా తక్కువ వ్యయంతో భారత్ అంగారకుడి దగ్గరికి ఉపగ్రహాన్ని పంపింది. ఇప్పుడు 141 మిలియన్ డాలర్ల బడ్జెట్‌లో (రూ.966 కోట్లు) చంద్రుడిపైకి రోవర్‌ను పంపుతున్నది. ఇది అమెరికా అపోలో మిషన్ బడ్జెట్ (25 బిలియన్ డాలర్లు-రూ.1.71 లక్షల కోట్లు) కన్నా చాలా తక్కువ.
- ద పోస్ట్

-చంద్రుడిపైకి రోవర్‌ను పంపిన నాలుగో దేశంగా భారత్ నిలువనున్నది. చంద్రయాన్-2లోని ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ వంటివన్నీ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినవే.
- ఫిస్.ఆర్గ్ (సైన్స్ న్యూస్ పోర్టల్)

-చంద్రుడిపై మిస్టరీగా మారిన నీటి జాడను ఈ మిషన్ వెలుగులోకి తెచ్చే అవకాశం ఉన్నది. చందమామ పుట్టుపూర్వోత్తరాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి, భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు, రాకెట్ ఇంధనం తయారీకి ఈ మిషన్ అందించే సమాచారం కీలకం కానున్నది.
- సైంటిఫిక్ అమెరికన్ వెబ్‌సైట్
Endgame2

1550
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles