ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఆర్డినెన్స్!Mon,April 16, 2018 02:20 AM

-సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్న కేంద్రం
-తీర్పు అనుకూలంగా రాకపోతే ఆర్డినెన్స్‌కే మొగ్గు
-పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు తెచ్చే అవకాశం
supreme-court
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఎస్టీ ఎస్టీ (అట్రాసిటీ నిరోధక )చట్టం-1989లో తక్షణ అరెస్టుకు సంబంధించిన మార్గదర్శకాలను సడలిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి సారించింది. చట్టంలో పూర్వపు మార్గదర్శకాలనే అమలు జరిపేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని భావిస్తున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఎస్సీ ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు కేంద్రం నష్టనివారణ చర్యలను ప్రారంభించింది. చట్టం పునరుద్ధరణపై అన్ని అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెట్టేందుకు వీలుగా ఆర్డినెన్స్ తేవాలన్న ప్రతిపాదన కూడా ఇందులో ఉంది. ఒకవేళ అదే జరిగితే వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే చట్టంలోని మార్గదర్శకాలను పునరుద్ధరిస్తూ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. ఆర్డినెన్స్ గనుక జారీచేస్తే, దానిని బిల్లుగా సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది. తద్వారా పాత నిబంధనలనే తిరిగి పునరుద్ధరించడానికి, ఉద్రిక్తతలను చల్లార్చడానికి తక్షణచర్యగా ఇది ఉపకరిస్తుంది అని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలహీనపరుస్తున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాలు ఏప్రిల్ 2న భారత్ బంద్ చేపట్టాయి. పలు రాష్ర్టా ల్లో ఆ నిరసన హింసాత్మకంగా మారగా, వేర్వేరు చోట్ల 9 మంది మరణించారు. మరోవైపు విపక్ష పార్టీలు కూడా ప్రభుత్వం దళితుల హక్కుల్ని కాపాడలేకపోయిందంటూ విమర్శలు ప్రారంభించాయి. అయితే ఎస్టీ, ఎస్టీలపై దాడుల్ని నిరోధించే చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనపర్చనివ్వబోమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రకటించారు. మనం రూపొందించిన బలమైన చట్టం ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభావితం కాదని నేను జాతికి హామీ ఇస్తున్నాను అని ఆయన స్పష్టంచేశారు. తన తీర్పుపై స్టే విధించడంతోపాటు చట్ట సడలింపులను పునఃపరిశీలించాలని కోరుతూ కేంద్ర సామాజిక న్యాయశాఖ సుప్రీంకోర్టులో రివ్యూపిటిషన్ వేసింది. చట్టంలోని మార్గదర్శకాల తీవ్రతను తగ్గిస్తే, దేశానికి భారీగా నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం వాదించింది. కొందరు తమ ప్రయోజనాల కోసం లొసుగులను ఉపయోగించుకుని చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశముందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. గతనెలలో ఇచ్చిన తీర్పును నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాజా పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పులో జాప్యం జరిగినా.. అనుకూల తీర్పు రాకపోయినా ప్రభుత్వం తదుపరి కార్యాచరణను ప్రారంభించనున్నట్టు తెలుస్తున్నది.

331

More News

VIRAL NEWS