కేరళలో మళ్లీ జలవిలయం


Thu,August 16, 2018 12:44 PM

Centre announces additional relief worth Rs 100 crores flood loss estimated at Rs 8316 crores

-కొద్దిసేపు తెరిపినిచ్చి దంచికొడుతున్న వానలు
-సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం
-హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఏరియల్ సర్వే
-రాష్ర్టానికి రూ.100 కోట్లు తక్షణ సాయం

తిరువనంతపురం, ఆగస్టు 12: కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలు కేరళ రాష్ర్టాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం ఉదయం కొద్దిసేపు తెరిపిన్చిన వాన.. మళ్లీ దంచికొడుతున్నది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ సంస్థలు చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఇడుక్కి, ఇడమలయార్ రిజర్వాయర్లలోని నీటిని కిందికి వదిలి నీటిమట్టాలను తగ్గించడం కొద్దిమేర ఊరట కలిగిస్తున్నది. ఈ రిజర్వాయర్ల దిగువ భాగంలో ఉన్న ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ఈనెల 8 నుంచి అతిభారీ వర్షాల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 37కు చేరుకోగా.. శనివారం నుంచి ఇప్పటివరకు ఎటువంటి మరణాలు చోటుచేసుకోలేదు. కేరళలో పరిస్థితిపై కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. కొచ్చిలో సీఎం విజయన్‌తో భేటీ అయి రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా కేరళకు రూ.100 కోట్ల తక్షణసాయాన్ని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన వరద సహాయ శిబిరాల్లో దాదాపు 60వేల మంది ప్రజలు తలదాచుకుంటున్నారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వరద ప్రభావిత జిల్లాలైన కొజికోడ్, ఇడుక్కి, మళప్పురం, కన్నూర్, వాయనాడ్ జిల్లాల్లో సహాయ చర్యలు అందిస్తున్నాయి. ఇడుక్కి రిజర్వాయర్ పూర్తిగా నిండటంతో 26 ఏండ్ల తర్వాత గేట్లను తెరిచి నీటిని దిగువకు వదిలారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ వాతావరణ విభాగం రెడ్‌అలర్ట్ జారీచేసింది.

పరిస్థితి తీవ్రంగా ఉన్నది: హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్

కేరళలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయని, రాష్ర్టానికి తక్షణసాయంగా రూ.100 కోట్లు ఇస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఆదివారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదల కారణంగా రాష్ట్రంలో రూ.8316 కోట్లమేర నష్టం జరిగిందని కేరళ సీఎం విజయన్ తెలిపారు. కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో వర్షాల కారణంగా 24 గంటల వ్యవధిలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు.

ప్రాణాలకు తెగించి.. చిన్నారిని కాపాడి..

ఇడుక్కి: కేరళ వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ ఎన్డీఆర్‌ఎఫ్ అధికారి సాహసంపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇడుక్కి డ్యాం వద్ద ఉన్న ఓ వంతెనపై ప్రమాదంలో ఉన్న ఓ చిన్నారిని కన్హయ్యకుమార్ అత్యంత సాహసంతో రక్షించారు. ఇడుక్కి డ్యాం గేట్లుఎత్తడంతో భారీగా పోటెత్తిన వరద వంతెనను ముంచెత్తింది. వంతెన మునిగిపోవడానికి ముందు చిన్నారితో ఉన్న ఓ వ్యక్తి అవతల వైపు ఉన్న కుమార్ సహాయం కోరాడు. తన భద్రత గురించి పట్టించుకోకుండా పరుగెత్తిన కుమార్.. బాలికను తన చేతుల్లోకి తీసుకుని వంతెన మునిగిపోవడానికి కొద్ది సెకండ్ల ముందు ఇవతలి ఒడ్డుకు చేరుకున్నారు.

యజమాని కుటుంబాన్ని కాపాడిన కుక్క!

ఇడుక్కి: కేరళలో కొండచరియల ప్రమాదం నుంచి ఓ పెంపుడు కుక్క తన యజమాని కుటుంబాన్ని రక్షించింది. ఇడుక్కి జిల్లాలోని కీరితోడ్ గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన మోహనన్ తన పెంపుడు కుక్క మొరుగుతుండటంతో తెల్లవారుజామున భార్యతో సహా బయటకు వచ్చారు. కొద్దిసేపటికే పెద్దపెద్ద బండరాళ్లు ఇంటిని ముంచెత్తాయి.

682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS