సీవీసీతో సీబీఐ డైరెక్టర్ భేటీ


Fri,November 9, 2018 02:14 AM

CBI special director Rakesh Asthana meet CVC

-తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిరాధారమని వివరణ
-సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్తానా కూడా సీవీసీతో సమావేశం

న్యూఢిల్లీ, నవంబర్ 8: తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిరాధారమని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ చెప్పారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని సీవీసీ కార్యాలయానికి వచ్చిన ఆయన సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ) కేవీ చౌదరి, మరో కమిషనర్ శరద్‌కుమార్‌తో భేటీ అయ్యారు. అలోక్ వర్మ మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై రెండు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు సీవీసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలోక్ వర్మ సీవీసీ ఉన్నతాధికారులతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. మరోవైపు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా కూడా కేవీ చౌదరి, శరద్‌కుమార్‌లతో భేటీ అయ్యారు. అయితే వీరి సమావేశం వివరాలు ఇంకా బయటికి వెల్లడికాలేదు. కాగా, సీబీఐలో పలు కీలక కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులు, ఇన్‌స్పెక్టర్ హోదా నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదా వరకు ఉన్న ఉన్నతాధికారులను ఇటీవల సీవీసీ ప్రశ్నించింది. వారి వాంగ్మూలాలను రికార్డు చేసింది. మాంసం ఎగుమతిదారుడు మొయిన్ ఖురేషీకి సంబంధించిన కేసును, ఐఆర్‌సీటీసీ కుంభకోణం తదితర కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులు వాంగ్మూలాలను ఇచ్చిన వారిలో ఉన్నారు. అలోక్ వర్మ, రాకేశ్ ఆస్తానా ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం, దీంతో ఈ ఇద్దరిని ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపడం తెలిసిందే.

319
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles