శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసు

Sat,January 12, 2019 02:04 AM

-నళిని చిదంబరంపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ, జనవరి 11: శారదా చిట్ ఫండ్ కుంభకోణానికి సంబంధించి మనీ ల్యాండరింగ్ కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం భార్య నళిని చిదంబరానికి వ్యతిరేకంగా సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. కోల్‌కతాలోని బరాసత్ కోర్టులో శుక్రవారం ఈ చార్జిషీట్ సమర్పించింది. శారదా చిట్ ఫండ్ స్కామ్‌లో నళిని రూ.1.4 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. శారదా గ్రూప్ వ్యవస్థాపకులు సుదీప్తాసేన్‌తో కలిసి నళిని నిధుల దుర్వినియోగం చేయడంతోపాటు మోసపూరిత కుట్రకు పాల్పడ్డారని పేర్కొంది. 2016లో తొలిసారి ఈ కేసులో సాక్షిగా నళినికి దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేశాయి. టీవీ చానల్ ఒప్పందానికి సంబంధించి శారదా గ్రూప్ తరఫున వాదనలు వినిపించేందుకు ఆమె రూ.1.26 కోట్లు ఫీజుగా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ తాజాగా దాఖలు చేసిన ఆరో అనుబంధ చార్జిషీటులో నళినితోపాటు అరుంధతీ ప్రింటర్స్ అండ్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుదీప్తా సేన్ నిందితులుగా ఉన్నారు. 2013లో పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసిన శారద చిట్‌ఫండ్ కుంభకోణం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అధిక మొత్తంలో చెల్లిస్తామని ఇన్వెస్టర్లు, ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన శారదా గ్రూప్ అనంతరం బోర్డు తిప్పేసింది. దీనిపై బెంగాల్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా, 2014లో సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఈ కుంభకోణంలో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు మంత్రులు, నేతలు అరెస్టయ్యారు.

775
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles