ముస్లిమేతర శరణార్థులకు దేశ పౌరసత్వం!

Thu,December 5, 2019 03:12 AM

-పౌరసత్వ సవరణ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం.. రెండ్రోజుల్లో పార్లమెంట్‌కు
-బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు ధ్వజం
-చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పదేండ్లు పొడిగింపు
-వ్యక్తిగత సమాచార భద్రత బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
-నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.15 కోట్ల వరకు జరిమానా, మూడేండ్ల జైలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు(సీఏబీ)కు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. వచ్చే రెండ్రోజుల్లో దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నది. మతపరమైన హింస కారణంగా పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్‌కు శరణు వచ్చిన ముస్లిమేతరులకు (ఆరు వర్గాలు- హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు) దేశ పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించినదే పౌరసత్వ సవరణ బిల్లు. దీనిని ఈశాన్య రాష్ర్టాలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాగా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్‌లోని ఇన్నర్‌లైన్ పర్మిట్ ఏరియాలు (ఐఎల్‌పీ), రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో పొందుపరిచిన ప్రాంతాలను పౌరసత్వ బిల్లు పరిధి నుంచి తప్పించినట్లు తెలిసింది.

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం తదితర విపక్షాలు పౌరసత్వ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పౌరసత్వానికి మతం ప్రాతిపదిక కాకూడదన్న దేశ మౌలిక భావనను ఈ బిల్లు ఉల్లంఘిస్తున్నదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మండిపడ్డారు. ఈ బిల్లు విచ్ఛిన్నకరమని, రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత, అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ మండిపడ్డారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. మరోవైపు, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. కేంద్రం నిర్ణయం మహమ్మద్ అలీ జిన్నా ద్వి-జాతి సిద్ధాంతానికి మళ్లీ జీవం పోయడమే అని విమర్శించారు. పౌరసత్వ బిల్లును తీసుకురావడం మన స్వాతంత్య్ర సమరయోధులను అగౌరవపరచడమే. ఎందుకంటే మీరు ద్వి-జాతి సిద్ధాంతానికి పునరుజ్జీవనం పోస్తున్నారు. భారతీయ ముస్లింగా, జిన్నా సిద్ధాంతాన్ని నేను వ్యతిరేకించా. కానీ ప్రస్తుతం మీరు దేశానికి మళ్లీ ద్వి-జాతి సిద్ధాంతాన్ని గుర్తుకుతెస్తున్నారు అని విమర్శించారు.
taroor

అందరి ప్రయోజనాలు పరిరక్షిస్తాం

విపక్షాల ఆందోళనలను కేంద్ర తోసిపుచ్చింది. ప్రతి ఒక్కరి ప్రయోజనాలను, జాతి ప్రయోజనాలను పరిరక్షిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈశాన్య రాష్ర్టాల్లో పౌరసత్వ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంపై విలేకరులు ప్రశ్నించగా.. ఇది దేశ ప్రయోజనాలకు ఉద్దేశించిన బిల్లు అని, ప్రజలు దీన్ని స్వాగతిస్తారని బదులిచ్చారు. మరోవైపు, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. అక్రమ వలసదారుల ఓటుబ్యాంకు కోసం విపక్షాలు బిల్లును వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తికి, తమ ప్రభుత్వ ఇండియా ఫస్ట్ నినాదానికి అనుగుణంగా ఈ బిల్లును తెచ్చినట్లు చెప్పారు. గతేడాది కేంద్రం పౌరసత్వ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో గట్టెక్కలేకపోయింది.

సీనియర్ సిటిజన్ల సంక్షేమ బిల్లుకు ఆమోదం

సీనియర్ సిటిజన్లకు కనీస అవసరాలు, రక్షణ, భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన మెయింటెనెన్స్, వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ (అమెండ్‌మెంట్) బిల్లు-2019కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. సీనియర్ సిటిజన్ల సంరక్షణ గృహాలు, హోం కేర్ సర్వీసెస్ ఏజెన్సీలు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు కనీస ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. మరోవైపు, కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

వ్యక్తిగత సమాచార భద్రత బిల్లుకు ఓకే

వ్యక్తిగత సమాచార భద్రత బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.15 కోట్ల వరకు జరిమానా, మూడేండ్ల జైలు శిక్ష విధించేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపరిచారు. అలాగే ఇంటర్నెట్ సంస్థలు తమ వినియోగదారులకు చెందిన కీలక సమాచారాన్ని దేశంలోనే భద్రపరిచేలా ప్రతిపాదనలు ఉన్నాయి. సున్నితమైన సమాచారాన్ని విదేశాలకు పంపించాలంటే ముందుగా ఆ డేటా యజమాని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని నిబంధన విధించినట్లు సమాచారం. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని 2017లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.
NirmalaSitharaman1

సామాజిక భద్రత కోడ్ బిల్లుకు ఆమోదం

సామాజిక భద్రతా కోడ్ బిల్లు-2019కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది నాలుగో లేబర్‌కోడ్. కార్మికుల సామాజిక భద్రతకు సంబంధించిన చట్టాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ, ఎనిమిది కేంద్ర చట్టాలను విలీనం చేస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. గత నెలలో ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ బిల్లుకు (మూడోది) క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వేతన కోడ్ బిల్లు ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆక్యుపేషనల్ సేఫ్టీ,హెల్త్, వర్కింగ్ కండీషన్స్ కోడ్ బిల్లు (రెండోది)ను లోక్‌సభలో ప్రవేశపెట్టగా, దానిని స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపారు.

2030 వరకు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పొడిగింపు

లోక్‌సభతోపాటు ఆయా రాష్ర్టాల అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను మరో పదేండ్లు పొడిగించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ఆంగ్లో ఇండియన్ల కోటాను మాత్రం నిలిపివేయనున్నట్లు తెలిసింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో ఈ క్యాటగిరీల రిజర్వేషన్ల గడువు వచ్చే ఏడాది జనవరి 25తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లను 2030 జనవరి 25వరకు పొడిగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఏమిటీ పౌరసత్వ బిల్లు?

1. మతపరమైన హింస వల్ల పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వలసవచ్చిన ముస్లిమేతరులకు (ఆరు వర్గాలు- హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, పార్శీ లు, జైనులు, బౌద్ధులు) భారత పౌరస త్వం ఇచ్చేందుకు ఉద్దేశించినదే పౌరసత్వ సవరణ బిల్లు. ఇందుకు 2014 డిసెంబర్ 31వతేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ఇందుకనుగుణంగా, పౌరసత్వ చట్టం-1955కి సవరణలు చేయనున్నారు.
2. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం మాట్లాడుతూ.. ఈ బిల్లుకు ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదన్నారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు ఎంత ప్రాధాన్యం ఉందో దీనికి అంతే ప్రాధాన్యం ఉందని, ఎంపీలందరూ తప్పక పార్లమెంట్‌కు హాజరుకావాలన్నారు. నిరంతర మత హింస కు గురై పొరుగుదేశాల నుంచి భారత్‌కు శరణు వచ్చిన వారికి సర్వ ధర్మ సంభవ్ స్ఫూర్తితో అక్కున చేర్చుకునేందుకు మోదీ సర్కార్ నిర్ణయించిందని చెప్పారు.
3. ముస్లింలను పౌరసత్వం నుంచి మినహాయించడంపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మత విశ్వాసాలతో పౌరులను విభజించవద్దన్న రాజ్యాంగ మౌలిక స్ఫూర్తి కి ఇది విరుద్ధమని మండిపడుతున్నాయి.
4. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, వామపక్షాలు, బీజేడీ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షం అసోం గణపరిషత్ (ఏజీపీ) సైతం దీన్ని వ్యతిరేకిస్తున్న ది. అకాలీదళ్, జేడీయూ నుంచి బీజేపీకి మద్దతు లభించవచ్చు. అన్నాడీఎంకే ఆచితూచి వ్యవహరిస్తున్నది.
5. లోక్‌సభలో బీజేపీకి ఆధిక్యం ఉన్నందున బిల్లుకు సులభంగా ఆమోదం లభించవచ్చు. తగిన సంఖ్యాబలం లేని రాజ్యసభలో జేడీయూ, అకాలీదళ్ వంటి పార్టీలపై ఆధారపడాల్సి ఉంటుంది. బీజేపీ మిత్రపక్షాలు సైతం బిల్లు పట్ల సుముఖంగా లేవని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
6. పౌరసత్వ బిల్లుకు ఈశాన్య రాష్ర్టాల నుంచి ఎక్కువగా ప్రతిఘటన ఎదురవుతున్నది. ఇక్కడ అధికంగా నివసిస్తున్న విదేశీయులకు పౌరసత్వం కల్పిస్తే అది తమ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని స్థానిక తెగల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై కేంద్రం దృష్టిసారించినట్లు సమాచారం. పౌరసత్వం అనేది నివాస హోదా కాదని నిబంధనల్లో చేర్చనున్నట్లు తెలిసింది.
7. గతేడాది జనవరిలో పౌరసత్వ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలుపడాన్ని నిరసిస్తూ బీజేపీ మిత్రపక్షం ఏజీపీ.. ఎన్డీయే నుంచి బయటకొచ్చింది. ఆ బిల్లు మురిగిపోవడంతో తిరిగి ఎన్డీయే గూటికి చేరింది. ప్రతిపాదిత బిల్లుపై యూటర్న్ తీసుకున్నట్లు ఏజీపీ సంకేతాలు ఇచ్చింది. వాస్తవ దృక్పథంతో మనం ముందుకు సాగాలి. లక్షల మంది అక్రమ వలసదారులను మనం గుర్తించలేం. వారిని బంగ్లాదేశ్ వెనక్కి తీసుకోదు. గతంలో రెండుసార్లు మా ప్రభుత్వం ఏర్పడినా అక్రమ వలసదారులను గుర్తించలేకపోయాం. దురదృష్టవశాత్త్తు, అసోం ఒప్పందం 34 ఏండ్లుగా దుమ్ముపట్టిపోయింది అని ఏజీపీ సభ్యుడు అతుల్ బోరా అన్నారు.

1681
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles