
-ప్రియాంక, జ్యోతిరాదిత్య ఈ బాధ్యతలు చూస్తారు-లక్నో రోడ్‌షోలో రాహుల్ వ్యాఖ్యలు
లక్నో, ఫిబ్రవరి 11: ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేవరకూ విశ్రమించేదిలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఈ బాధ్యతను కాంగ్రెస్ యువనేతలైన ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్యలకు అప్పగించానని చెప్పారు. సోమవారం లక్నోలో ప్రియాంక రోడ్‌షోలో రాహుల్ ప్రసంగిస్తూ.. యూపీలో కాంగ్రెస్ ఫ్రంట్ ఫుట్ (ముందు వరుస)లోనే పోరాడుతుంది. ఈ బాధ్యతల్ని ప్రియాంక, జ్యోతిరాదిత్య చూస్తారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకే కాదు.. భవిష్యత్తులో యూపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేవరకూ ఈ పోరాటం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. దేశానికి యూపీ కేంద్ర స్థానం. దశాబ్దాలుగా రాష్ట్రంలో నిరాదరణకు గురైన వర్గాలకు చేయూతనందించాలని ప్రియాంక, జ్యోతిరాదిత్యలకు సూచించా. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించి, అన్ని వర్గాల సంక్షేమాన్ని ఆశించే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం వారి కర్తవ్యం అని రాహుల్ పేర్కొన్నారు. ఒక్కసారి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వస్తే రైతులు, యువత, మహిళలు, నిరుపేదల సంక్షేమమే అజెండాగా తాము పనిచేస్తామని చెప్పారు. మరోవైపు ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ బిగ్గరగా నినదించారు. రాఫెల్ ఒప్పందంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని రాహుల్ ఆరోపించారు.