మహిళలకు వరాలు

Fri,February 2, 2018 07:03 AM

ముద్రా యోజన రుణాల మొత్తం రూ.3 లక్షల కోట్లు
ఉచిత వంటగ్యాస్ కనెక్షన్ల సంఖ్య 5 కోట్ల నుంచి 8 కోట్లకు పెంపు
మహిళా ఉద్యోగులకు మూడేండ్లపాటు ఈపీఎఫ్ చందా తగ్గింపు

woman
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: అరుణ్‌జైట్లీ ఈ బడ్జెట్‌లో ఆదాయపన్ను స్లాబుల్లో మార్పులు చేయకుండా వేతన జీవులను నిరాశపర్చినా.. మహిళా ఉద్యోగులు, సాధారణ మహిళలకు ఒక మేరకు సంతోషం కలిగించే ప్రకటనలు చేశారు. గ్రామీణ, పట్టణ, పేదవర్గాల మహిళలకు, ఉద్యోగినులకు ముద్రా యోజన కింద దాదాపు రూ.3 లక్షల కోట్ల రుణాలు పొందే అవకాశం కల్పించారు. ఈ రుణాలతో మహిళలు కొత్త వ్యాపారాలు, పనులు ప్రారంభించవచ్చు. రుణఖాతాలలో దాదాపు 76 శాతం మహిళలకు చెందినవే. అందులోనూ 50 శాతం ఖాతాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారివి ఉన్నాయి. ఉద్యోగాలు చేసే మహిళల ఈపీఎఫ్ చందాను జైట్లీ తగ్గించారు. ఉద్యోగినులు 12 శాతానికి బదులు 8 శాతం మొత్తం చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించారు. ప్రభుత్వం 12శాతం మొత్తాన్ని ఈపీఎఫ్‌కు చెల్లిస్తుందని ఆయన తెలిపారు. అన్ని రంగాల్లోని మహిళా ఉద్యోగులకు రానున్న మూడేండ్లపాటు ఈ సౌకర్యం వర్తిస్తుందని పేర్కొన్నారు. యాజమాన్య సంస్థలు మాత్రం తమవంతుగా 10 లేదా 12 శాతం ఈపీఎఫ్ చందాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ విధంగా ఈపీఎఫ్ చందా శాతం తగ్గించడం వల్ల వివిధ సంస్థలు ఎక్కువ సంఖ్యలో మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
whoman
ఉద్యోగాల్లో మహిళల శాతం బాగా తగ్గిపోతున్నది. 2005-06లో 36 శాతంగా ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య 2015-16 నాటికి 24శాతానికి పడిపోయినట్లు కొద్దిరోజుల క్రితం ఆర్థిక సర్వే వెల్లడించింది. దీంతో కేంద్రం ఈ ప్రకటన చేసింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాలశాతాన్ని కూడా ఆర్థిక మంత్రి జైట్లీ 37 శాతానికి పెంచారు. ఇంతేగాక ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద పేదవర్గాల మహిళలకు ఉచితంగా ఇచ్చే వంటగ్యాస్ కనెక్షన్ల సంఖ్యను బడ్జెట్‌లో ఇప్పుడున్న 5 కోట్ల నుంచి 8 కోట్లకు పెంచారు. ఇది చారిత్రక నిర్ణయమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. మహిళా సాధికారతకు, పేద, గ్రామీణ, పట్టణ మహిళల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేయడంలో ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

741
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles