ప్రజారోగ్యానికి రక్ష

Fri,February 2, 2018 07:02 AM

1200 కోట్లు కేటాయింపు.. పదికోట్ల కుటుంబాలకు ఏటా ఐదు లక్షల బీమా
లక్షన్నర వెల్‌నెస్ సెంటర్లు.. ఉచిత పరీక్షలు.. మందులు
భారీ ఆరోగ్య పరిరక్షణ పథకం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
సార్వత్రిక ఆరోగ్య రక్షణ దిశగా వెళ్తున్నామన్న జైట్లీ

Union--Budget
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేక చర్యలను ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద రూ.1200 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ప్రధానమైన జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం కింద పదికోట్ల కుటుంబాలకు ఏటా రూ.5లక్షల ఆరోగ్య బీమా లభిస్తుంది. దీనివల్ల దాదాపు 50కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం 2018-19 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ దిశగా కదులుతున్నామని, ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమం అవుతుందని ఆయన చెప్పారు. ప్రజలకు చేరువలో ఆరోగ్యసేవలు అందించాలన్న లక్ష్యంతో లక్షన్నర వెల్‌నెస్ సెంటర్లను నెలకొల్పనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కేంద్రాలు అత్యవసరమైన రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందజేస్తాయని తెలిపారు. ఆరోగ్య భారత్‌తోనే సమృద్ధ భారత్ సాధ్యమవుతుందని, దేశ పౌరులు ఆరోగ్యవంతంగా లేనప్పుడు జనాభాపరంగా చేకూరాల్సిన లబ్ధి సాధ్యం కాదని అన్నారు.

మేము పదికోట్ల మంది పేద బలహీనవర్గాల కుటుంబాలకు వర్తించేలా కీలకమైన జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం ప్రారంభిస్తాం. దీనివల్ల ఏటా రూ.5లక్షల ఆరోగ్య బీమా లభిస్తుంది. దాదాపు 50కోట్ల మందికి ప్రయోజనం కలిగించే ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య రక్షణ కార్యక్రమం అవుతుంది అని జైట్లీ చెప్పారు. దేశ జనాభాలో దాదాపు 40శాతానికి వర్తించే ఈ కార్యక్రమం సజావుగా కొనసాగేందుకు తగిన నిధులు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఆరోగ్యసేవలను మరింత చేరువ చేసేందుకు లక్షన్నర వెల్‌నెస్ సెంటర్లు దోహదపడుతాయని చెప్పారు. ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం రూ.1200 కోట్లు కేటాయిస్తున్నదని, ప్రైవేటురంగం కూడా తమ వంతుగా తోడ్పడాలని కోరారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) ద్వారా ప్రైవేటు సంస్థలు, ఇతర దాతృత్వ సంస్థలు ముందుకురావాలన్నారు. రోగనిరోధం, ఆరోగ్య పరిరక్షణ అన్ని స్థాయిల్లో సత్పలితాలనిచ్చేలా ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నదని చెప్పారు. ప్రభు త్వం చేపడుతున్న చర్య లు 2022నాటికి నూతన భారతాన్ని నిర్మిస్తాయని జైట్లీ పేర్కొన్నారు. అంటు వ్యాధులు, అంటు వ్యాధులుకాని వాటికి కూడా వెల్‌నెస్ సెంటర్లలో చికిత్సలందుతాయని చెప్పారు.

టీబీ నివారణకు 600 కోట్లు

క్షయవ్యాధిగ్రస్థులకు పోషకాహారం అందించేందుకు రూ.600 కోట్లను కేటాయిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. నెలకు రూ.500 మేర లెక్కగట్టి ఈ కేటాయింపులు చేశారు. అంటు వ్యాధుల్లో అన్నింటికన్నా ఎక్కువగా టీబీ కారణంగా ప్రతి ఏటా ఎక్కువమంది మరణిస్తున్నారని మంత్రి చెప్పారు. ప్రధానంగా పేదలు, పోషకాహారలోపమున్నవారే ఈ వ్యాధిబారిన పడుతున్నందున ప్రభుత్వం అదనంగా రూ.600కోట్లను కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న జిల్లా వైద్యశాలలను మెరుగుపరిచి కొత్తగా 24 ప్రభుత్వ వైద్య కళాశాలలు, దవాఖానలను నెలకొల్పనున్నట్లు మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక వైద్య కళాశాల ఉంటుందని మంత్రి చెప్పారు. సమర్థ, ఉత్పాదక నూతన భారతాన్ని నిర్మించడంలో ఈ చర్యలు కీలకమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా అదనపు ఉద్యోగాలు లభిస్తాయని, ప్రత్యేకించి మహిళలకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు కొనసాగుతున్న ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి పథకాలను సమాజంలోని దిగువ వర్గాన్ని చేరేలా విస్తరిస్తామని తెలిపారు.

సమూల మార్పు తెచ్చే పథకమిది

ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం ఆరోగ్యరంగంలో సమూల మార్పు తెస్తుందని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్యరక్షణను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పెద్ద అడుగు అని ఎండీ సునీతారెడ్డి అభిప్రాయపడ్డారు.

1281
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles