ఎవరికి లాభం.. ఎవరికి నష్టం

Fri,February 2, 2018 07:03 AM

jaitly
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది చివరిలోనే దూసుకొస్తాయన్న సంకేతాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018 19 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను గురువారం పార్లమెంట్‌కు సమర్పించారు. నిరాశానిస్పృహల్లో చిక్కుకున్న అన్నదాతను ఆదుకునేందుకు, గ్రామీణులకు చేయూతనిచ్చేందుకు పెద్దపీట వేశారు. వృద్ధిరేటు పెంచడానికి, ఉద్యోగాల కల్పన, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ బడ్జెట్‌లో రైతులు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, హెల్త్‌కేర్ సంస్థలు భారీ లబ్ధిదారులు. బాండ్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయిన వారిలో ఉన్నారు.


రైతులు

రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పిస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ల నిర్మాణానికి భారీగా పెట్టుబడులు పెడుతామని వాగ్దానం చేశారు. దీనివల్ల నీటి పారుదల, ఆక్వాకల్చర్ ప్రాజెక్టులతోపాటు వివిధ గ్రామీణ పథకాలకు భారీగా నిధులు సమకూరుతాయి. వ్యవసాయ పంప్‌సెట్ల కోసం రైతులు ఏర్పాటు చేసుకున్న సౌర విద్యుత్ యూనిట్ల నుంచి ఉత్పత్తిచేసే అదనపు విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దీని వల్ల వ్యవసాయ అనుబంధ కంపెనీలు లబ్ధి పొందవచ్చు.
Farmers

హెల్త్‌కేర్ ప్రొవైడర్లు

కేంద్ర ప్రభుత్వం నూతనంగా జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రతిపాదించింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం లభిస్తుంది. 50 కోట్ల మందికి లబ్ది చేకూరనున్నది. తద్వారా దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్ కంపెనీ అపొలో హాస్పిటల్స్‌తోపాటు ఫొర్టిస్ హెల్త్‌కేర్‌లకు ప్రయోజనం చేకూరవచ్చు.

వినియోగ ఉత్పత్తుల సంస్థలు

మారుమూల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు పెరుగనుండటంతో ప్రజల వినియోగ సామర్థ్యం ఎక్కువవుతుంది. దీనివల్ల ఎఫ్‌ఎంసీజీ వస్తువుల తయారీ సంస్థలు, ఆటోమొబైల్, ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు లబ్ధి పొందనున్నాయి.

ఆభరణాలు

గ్రామీణ భారతం నుంచే పసిడికి 60 శాతం డిమాండ్ ఉంటుంది. బడ్జెట్‌లో గ్రామీణ, వ్యవసాయ ఆదాయాభివృద్ధిపై దృష్టి పెట్టిన నేపథ్యంలో రైతులకు లభించే ఆదాయం వల్ల దేశంలోని ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థలకు లబ్ధి చేకూరనున్నది.

విమానాశ్రయాలు

దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమానాశ్రయాల నిర్మాణాన్ని విస్తరిస్తామని ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి సంస్థలకు ప్రయోజనం లభిస్తుంది.

మొబైల్ ఫోన్ సంస్థలు

దేశీయ పారిశ్రామిక ఉత్పత్తిని పెంపొందించేందుకు ఆర్థిక మంత్రి జైట్లీ ఊతమిచ్చే చర్యలు చేపట్టారు. ఇందులో మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని 15 నుంచి 20 శాతానికి పెంచారు. దీనివల్ల యాపిల్, సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థల లాభాలు తగ్గుముఖం పట్టనున్నాయి. ప్రపంచంలోనే శరవేగంగా పెరుగుతున్న మొబైల్ ఫోన్ల మార్కెట్ గల భారత్‌లో లాభాలు పొందాలంటే స్థానికంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలి.

బాండ్ ఇన్వెస్టర్లు

ఊహించిన దానికంటే ప్రభుత్వ వ్యయ పరిమితి తక్కువగా ఉన్న నేపథ్యంలో బాండ్ ఇన్వెస్టర్లకు ఈసారి బడ్జెట్‌లో స్వల్ప ఊరటే లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యం 3.2 శాతాన్ని అందుకోవడం కష్టతరంగా మారిన నేపథ్యంలో బాండ్ల ఇన్వెస్టర్లకు ఆశించిన స్థాయిలో లాభాలు చేకూరే అవకాశాలు లేవు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల వంటి భారీ బాండ్ ఇన్వెస్టర్ల ఆదాయం ప్రభావితం కానున్నది.
Feature

ఆర్థిక రంగం

ఈక్విటి ఇన్వెస్ట్‌మెంట్లలో దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను (క్యాపిటల్ గెయిన్స్ టాక్స్) విధించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్థిక సేవల సంస్థల్లో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బ తినే అవకాశం ఉన్నది. దీనివల్ల ఐడీఎఫ్‌సీ లిమిటెడ్, రిలయన్స్ క్యాపిటల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి మ్యూచువల్ ఫండ్ సంస్థలు.. ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండ్డర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలపై ప్రతికూల ప్రభావం పడనున్నది.

రక్షణ రంగం

ఆర్థిక మంత్రి జైట్లీ సైనిక బలగాలను ప్రశంసించారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కోసం పారిశ్రామిక స్నేహపూర్వక విధానాన్ని అమలులోకి తెస్తామని హామీ ఇచ్చారు. కానీ రక్షణ రంగ వ్యయం కోసం భారీగా నిధులు కేటాయిస్తున్న సంకేతాలేమీ లేవు. దీనివల్ల భరత్ ఫొర్జ్ వంటి సంస్థలు లబ్ది పొందే
అవకాశం లేదు.

1291
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles