సాదాసీదా బడ్జెట్


Fri,February 2, 2018 07:02 AM

Budget 2018 Highlights Arun Jaitley booster dose for rural India bitter pill for investors

ఆరోగ్య బీమా, రైతుకు ఊరట మాత్రమే మినహాయింపు
మార్పులేని ఆదాయంపన్ను శ్లాబులు
-వేతన ఉద్యోగులకు లభించని ఊరట నాలుగు శాతానికి పెరిగిన విద్య, వైద్య సెస్సు
-సామాజిక సంక్షేమ సర్‌చార్జి పది శాతం ఆదాయ వనరులపై అస్పష్టత; ద్రవ్యలోటు పరిమితి పెంపు
-మరింత ప్రియం కానున్న దిగుమతి వస్తువులు లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 14 ఏండ్ల తర్వాత మళ్లీ పన్ను
-ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆదాయంపై 10 శాతం పన్నుఎన్నికల పులి ప్రసన్నం కోసం జైట్లీ యత్నం

ArunJaitley
పెద్ద నోట్ల రద్దు సృష్టించిన సమస్యలతో సామాన్యుల్లో పేరుకుపోయిన ఆగ్రహం.. జీఎస్టీ కారణంగా వ్యాపారవర్గాల్లో నెలకొన్న అసంతృప్తి.. పంటలకు ధరలు లేక రోడ్లమీదికొచ్చిన రైతన్నల కోపం.. మధ్యతరగతిలో, పట్టణప్రాంతాల్లో వీస్తున్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలు.. మరోవైపు, తరుముకొస్తున్న ఎన్నికలు.. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల పులి మీద స్వారీచేస్తూ ఒకింత ఆగ్రహంగా దూసుకొస్తున్న భారతీయ ఓటరును ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. కానీ, అంకెల ఘనమే తప్ప ఆచరణపై స్పష్టత లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యబీమా పథకాన్ని పేదల కోసం తీసుకొస్తామన్నారు. వానకాలం పంటలకు ఉత్పత్తి వ్యయం కన్నా 150 శాతం అధికంగా మద్దతుధర ఇస్తామన్నారు. ఇతర రంగాలకూ భారీ ఎత్తున నిధులను ప్రకటించారు. కానీ, వాటినెలా సమీకరిస్తారన్న దానిపై స్పష్టత కొరవడింది. ఆదాయానికి, వ్యయానికి పొంతన లేకపోవటంతో ద్రవ్యలోటు పరిమితిని మరింత పెంచారు. ఇటు వేతన ఉద్యోగులకుగానీ అటు వ్యాపారవర్గాలకుగానీ బడ్జెట్ ఊరట కలిగించలేదు. బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో మార్కెట్లు కుప్పకూలాయి. బడ్జెట్‌ను.. శుష్క వాగ్దానాల ఎన్నికల ప్రహసనంగా, భారీ మోసంగా ప్రతిపక్షాలు కొట్టిపారేయగా, నూతన భారతావని నిర్మాణానికి అవసరమైన వారధిగా ప్రధాని మోదీ అభివర్ణించారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు, మరికొన్ని నెలల్లో 8 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయనకిది వరుసగా ఐదో బడ్జెట్. గంటా యాభై నిమిషాలపాటు ఇంగ్లిష్, హిందీల్లో జైట్లీ ప్రసంగించారు. మన దేశం 75వ స్వాతంత్య్రదిన సంబురాలు జరుపుకొనే 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు అని గుర్తు చేశారు. దీంట్లోభాగంగా వ్యవసాయానికి దన్నుగా నిలిచేందుకు సేంద్రియసాగు, పశుపోషణ, గ్రామీణ గృహ నిర్మాణం, మత్స్యరంగం అభివృద్ధికి రూ.14.34 లక్షల కోట్లతో పలు పథకాలను జైట్లీ ప్రకటించారు. ఉత్పత్తి వ్యయానికి కనీసం 150 శాతం అధికంగా ఉండేలా అన్ని వానకాలం పంటల మద్దతుధరను పెంచుతామన్నారు. పది కోట్ల పేద కుటుంబాలకు వర్తించే విధంగా జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం తీసుకొస్తామని చెప్పారు. ఈ పథకంతో దాదాపు 50 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది. కుటుంబానికి ఏటా రూ.5 లక్షల వరకూ ఆరోగ్య బీమా సదుపాయం లభిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రభుత్వ ప్రాయోజిత ఆరోగ్యబీమా పథకం అని జైట్లీ పేర్కొన్నారు. చిన్న, మధ్యతరహా వ్యాపారసంస్థలకు పన్నును తగ్గించారు. అత్యంత సంపన్నులపై ఉన్న 10-15 శాతం పన్నును మాత్రం అలాగే కొనసాగించారు. విద్య, వైద్య సెస్సును ఇప్పుడున్న మూడు నుంచి నాలుగు శాతానికి పెంచారు.

వ్యవసాయం, గ్రామీణ భారతమే ప్రాధాన్యం

రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ప్రాధాన్యరంగాలు వ్యవసాయం, గ్రామీణభారతమేనని జైట్లీ ప్రకటించారు. ఈ ఏడాది అన్ని వానకాలం పంటలకు ఉత్పత్తి వ్యయం కన్నా 150 శాతం అధికంగా కనీస మద్దతు ధరను చెల్లిస్తామన్నారు. వ్యవసాయ రుణాలను రూ.11 లక్షల కోట్లకు పెంచారు. ఇది గత ఏడాది (రూ.10 లక్షల కోట్లు) కన్నా లక్ష కోట్లు అధికం. కిసాన్ క్రెడిట్ కార్డును మత్స్యకారులకు, పశుపోషణ రంగంలోని రైతులకు కూడా వర్తింపజేస్తామన్నారు. వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి రూ.2000 కోట్లను కేటాయించారు. వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను సరళీకరిస్తామని చెప్పారు. రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్‌ను నమోదు చేసే వ్యవసాయోత్పత్తుల కంపెనీలకు తొలి ఐదేండ్లపాటు వందశాతం పన్ను మినహాయింపును ప్రకటించారు. ఉచిత వంటగ్యాస్ (ఎల్పీజీ) కనెక్షన్ లబ్ధిదారుల సంఖ్యను ఇప్పుడున్న 5 కోట్ల నుంచి 8 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. నాలుగు కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్‌ను అందించనున్నామని తెలిపారు. విద్య, ఆరోగ్య, సామాజిక పరిరక్షణ రంగాలకు రూ.1.38 లక్షల కోట్లను కేటాయించారు. బ్లాక్‌బోర్డు నుంచి డిజిటల్‌బోర్డుకు పరివర్తన చెందే విధంగా దేశ విద్యారంగాన్ని మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని జైట్లీ చెప్పారు. ఈ మేరకు ప్రి-నర్సరీ నుంచి 12వ తరగతి వరకూ ఒక సమగ్ర విద్యావిధానాన్ని తీసుకొస్తామన్నారు. అయితే దీని గురించి వివరాలు వెల్లడించలేదు.

వేతన వర్గాలకు లభించని ఊరట

వేతన వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పన్నుశ్లాబుల్లో జైట్లీ ఎటువంటి మార్పులను చేయలేదు. కాకపోతే, వేతన ఉద్యోగులు, పింఛనుదారుల రవాణా, వైద్య ఖర్చులకు సంబంధించి రూ.40 వేల స్టాండర్డ్ డిడక్షన్‌ను మంత్రి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రూ.19,200 వరకూ రవాణా అలవెన్సు మీద, రూ.15,000 వరకూ వైద్య ఖర్చుల మీద పన్ను విధించటం లేదు. ఈ రెండింటినీ కలిపి ప్రస్తుతం రూ.40 వేలకు పెంచారు. దీనివల్ల కలిగే ప్రయోజనం స్వల్పమే అయినా, దీనివల్ల రూ.2.5 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. సీనియర్ సిటిజన్లకు బ్యాంకు, పోస్టాఫీసు డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ మీద విధించే పన్ను మినహాయింపును ఇప్పుడున్న రూ.10 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. తీవ్రమైన అస్వస్థతకు లోనైనప్పుడు చికిత్సకు చేసిన వ్యయంపై విధించే పన్ను మినహాయింపును రూ.లక్షకు పెంచారు.
ArunJaitley2

సెస్సు పెంపు

పన్ను వర్తించే అన్ని రకాల ఆదాయంపై విధిస్తున్న విద్య, ఆరోగ్యం సెస్సును ఇప్పుడున్న మూడు శాతం నుంచి నాలుగు శాతానికి పెంచారు. సామాజిక సంక్షేమ పథకాలకు అవసరమైన నిధుల కోసం పదిశాతం సామాజిక సంక్షేమ సర్‌చార్జీని ప్రవేశపెట్టారు. రూ.250 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారసంస్థలపై విధిస్తున్న కార్పొరేట్ పన్నును ఇప్పుడున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. ఈ పన్నును 25 శాతానికి తగ్గిస్తామని జైట్లీ 2015లో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుత తగ్గింపును రూ.2016-17 ఆర్థికసంవత్సరం నుంచి వర్తింపజేశారు. ఎక్సైజ్‌డ్యూటీ, సేవాపన్నులను జీఎస్టీలోనే కలిపిన నేపథ్యంలో కస్టమ్స్‌డ్యూటీలో మాత్రమే జైట్లీ మార్పులను ప్రకటించారు. దీనివల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సెల్‌ఫోన్లు, పర్‌ఫ్యూమ్‌లు, వాచీలు, ఆటోమొబైల్ పరికరాలు, సన్‌గ్లాసెస్, ట్రక్కు టైర్లు, పాదరక్షలు, వజ్రాలు తదితర సరుకులపై కస్టమ్స్‌డ్యూటీ పెరిగింది. ఫలితంగా వీటి ధరలు పెరుగనున్నాయి. ఏడాదికిపైగా అట్టిపెట్టుకున్న షేర్ల విక్రయం ద్వారా అర్జించే రూ.లక్షకుపైగా ఆదాయం (లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్)పై పన్నును పునరుద్ధరించారు. ఈ పన్నును రద్దు చేసిన 14 ఏండ్ల తర్వాత తిరిగి తీసుకొచ్చారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి పంపిణీ చేసిన ఆదాయంపై 10 శాతం పన్నును విధిస్తున్నట్లు ప్రతిపాదించారు.

ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవిస్తాం

జీఎస్టీ, పెద్ద నోట్లరద్దు ప్రభావంతో జీడీపీ గత మూడేండ్లలోనే అత్యంత కనిష్ఠానికి చేరుకున్న నేపథ్యంలో, జీడీపీని 8 శాతానికి పైగా త్వరలోనే సాధిస్తామని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ 2.5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకున్నది. ప్రపంచంలో ఏడోస్థానంలో ఉన్నాం. త్వరలోనే ఐదోస్థానానికి చేరుకోనున్నాం అని ప్రకటించారు. రక్షణరంగానికి రూ.2.95 లక్షల కోట్లను జైట్లీ కేటాయించారు. ఇది గత ఏడాది (రూ.2.74 లక్షల కోట్లు) కన్నా 7.81 శాతం అధికం. రైల్వేలకు రూ.1.48 లక్షల కోట్లను కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఖర్చును రూ.21.57 లక్షల కోట్లకు సవరిస్తూ, 2018-19 సంవత్సరం ఖర్చును రూ.24.42 లక్షల కోట్లుగా ఆర్థికమంత్రి అంచనా వేశారు. చిన్న, మధ్యతరహా వ్యాపారసంస్థలు తీసుకున్న బ్యాంకు రుణాలను రాబట్టటం కోసం త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇన్సూరెన్స్, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ ఈ మూడు ప్రభుత్వ కంపెనీలను ఒకే కంపెనీగా కలిపివేస్తామన్నారు. ఎయిరిండియా ప్రైవేటైజేషన్‌తోపాటు 24 ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం ప్రక్రియ ప్రారంభమైందన్నారు.
ArunJaitley1

నిధులెలా?

ఎన్నికల నేపథ్యంలో వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకోవటానికి జైట్లీ ఘనంగా పథకాలు ప్రకటించినప్పటికీ వాటికి అవసరమైన నిధుల సమీకరణ మాత్రం అంత సులభంగా జరిగేట్లు లేదు. అందువల్లే, ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్రవ్యలోటును ముందు అనుకున్న దానికన్నా పెంచారు. ద్రవ్యలోటును జీడీపీలో 3.2 శాతానికి కట్టడి చేయాలని తొలుత నిర్ణయించినప్పటికీ, ఇప్పుడు దానిని 3.5 శాతానికి పెంచారు. అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2018-19) ద్రవ్యలోటును కూడా తొలుత మూడు శాతానికే పరిమితం చేయాలని భావించినప్పటికీ ఇప్పుడు 3.3 శాతానికి పెంచారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ఖర్చు మధ్య ఉండే వ్యత్యాసమే ద్రవ్యలోటు. ఖర్చుకు తగిన ఆదాయ వనరులు లేనప్పుడు ద్రవ్యలోటు పెరుగుతుంది.

ప్రముఖుల వేతనాలు పెంపు

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారికి వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు జైట్లీ తెలిపారు. రాష్ట్రపతి వేతనాన్ని రూ.5 లక్షలకు, ఉపరాష్ట్రపతి వేతనాన్ని రూ.4 లక్షలకు, గవర్నర్ల వేతనాన్ని రూ.3.5 లక్షలకు పెంచారు. ఎంపీల విషయంలో ప్రతీ ఐదేండ్లకోసారి ద్రవ్యోల్బణాన్ని బట్టి వేతనాలను సవరించే విధంగా చట్టాన్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు.

ఈ సర్కారుకిదే ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్

వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను జైట్లీ ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది వోట్ ఆన్ ఎకౌంట్‌ను ప్రవేశపెడుతారు. కొత్త పూర్తిస్థాయి బడ్జెట్‌ను లోక్‌సభ ఎన్నికల అనంతరం వచ్చే నూతన ప్రభుత్వం తీసుకొస్తుంది.

1010
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles