వేతన జీవులకు నిరాశ

Fri,February 2, 2018 07:03 AM

-40 వేల మినహాయింపు.. ఒక శాతం సెస్ వాయింపు
-క్యాపిటల్ గెయిన్స్‌పై 10 శాతం పన్ను
-మారని పన్ను శ్లాబులు, రేట్లు రూ.40 వేల స్టాండర్డ్ డిడక్షన్‌తో సరి
-సీనియర్ సిటిజన్లపై జైట్లీ కనికరం

wage-lives
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: సార్వత్రిక బడ్జెట్‌లో వేతన జీవులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం పార్లమెంట్‌కు నివేదించిన బడ్జెట్ 2018-19లో వారికి చెప్పుకోదగ్గ పన్ను ప్రయోజనాలు కల్పించడంలో ఘోరంగా విఫలమవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ పద్దులో జైట్లీ వ్యక్తిగత పన్ను శ్లాబులనుగానీ, రేట్లనుగానీ మార్చకపోవడంతో సగటు వేతనజీవులకు తీవ్ర ఆశాభంగం తప్పలేదు. వ్యక్తిగత ఆదాయం పన్ను రేట్ల విషయంలో వేతనజీవులకు గత మూడేండ్లలో ఎన్నో ప్రయోజనాలను కల్పించామని, కనుక ఈసారి ఈ రేట్లను గానీ, శ్లాబులను గానీ మార్చాలని ప్రతిపాదించడం లేదని జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంచేశారు. దీంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం జనరంజకమైన బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందన్న అంచనాలు తల్లకిందులయ్యాయి.

అయితే పన్నులు చెల్లించే వేతన జీవులతో పాటు పెన్షనర్లకు జైట్లీ తన పద్దులో స్వల్ప ఊరటనిచ్చారు. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు బదులుగా రూ.40 వేల స్టాండర్డ్ డిడక్షన్ (ప్రామాణిక మినహాయింపు)ను ప్రతిపాదించారు. ఇందుకోసం ప్రభుత్వ ఆదాయంలో రూ.8 వేల కోట్లను త్యాగం చేస్తున్నట్లు ఆయన చెప్పిన జైట్లీ.. మరోవైపు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత విద్యతో పాటు వైద్యం కోసం ప్రభుత్వం విధిస్తున్న సెస్సును 4 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మెరుగైన విద్య, వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే వ్యక్తిగత ఆదాయం పన్నుతో పాటు, కార్పొరేట్ పన్నుపై 3% సెస్సు విధిస్తున్నది. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ సెస్సును మరో శాతం పెంచడం ద్వారా అదనంగా రూ.11 వేల కోట్లు వసూలవుతాయని అంచనా వేస్తున్న అరుణ్ జైట్లీ.. మరోవైపు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)ను ప్రవేశపెట్టారు. దీంతో షేర్ల అమ్మకం ద్వారా లక్ష రూపాయల కంటే ఎక్కువ లాభాన్ని ఆర్జించిన వారు ఆ మొత్తంలో 10 శాతం ఎల్టీసీజీ చెల్లించాల్సి ఉంటుంది.

ఉద్యోగుల సగటు పన్ను రూ.76 వేలు..

2016-17 ఆర్థిక సంవత్సరంలో 1,89 కోట్ల మంది వేతన జీవులు సగటున రూ.76,306 చొప్పున పన్ను చెల్లించగా, ఇదే సంవత్సరంలో 1.88 కోట్ల మంది వ్యాపారులు సగటున రూ.25,753 పన్ను చెల్లించారని జైట్లీ వెల్లడించారు. 2014-15 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశంలో 6.47 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులుండగా, 2016-17లో వీరి సంఖ్య 28% పెరిగి 8.27 కోట్లకు చేరుకుందని జైట్లీ తెలిపారు.

సీనియర్ సిటిజన్లకు వరాలు

సార్వత్రిక బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు అనేక ప్రయోజనాలను కల్పిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. వడ్డీ రూపంలో వారికి వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితిని ఏడాదికి రూ.50 వేలకు (ఐదు రెట్లు) పెంచుతున్నామని, ఇదే సమయంలో సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియం, వైద్య ఖర్చులపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నామని, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వృద్ధులందరికీ సెక్షన్ 80డీడీబీ కింద ఈ పన్ను మినహాయింపు పరిమితిని లక్ష రూపాయలకు పెంచుతున్నామని ఆయన వెల్లడించారు. సీనియర్ సిటిజన్లకు ఈ పన్ను రాయితీలతో పాటు వయో వందన పథకాన్ని 2020 మార్చి నెలాఖరు వరకూ పొడిగిస్తున్నామని జైట్లీ ప్రకటించారు. ఈ పథకంలో ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు రూ.7.5 లక్షలుగా ఉన్న పెట్టుబడి పరిమితిని రెట్టింపు చేసి రూ.15 లక్షలకు పెంచుతున్నామని, ఈ రాయితీలన్నింటి వలన దేశంలోని వృద్ధులందరికీ అదనంగా రూ.4 వేల కోట్ల మేరకు పన్ను లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు.

బిల్లులు లేకుండానే స్టాండర్డ్ డిడక్షన్

సీబీడీటీ చీఫ్ సుశీల్ చంద్ర స్పష్టీకరణ
పన్నులు చెల్లించే ఉద్యోగులు, పెన్షనర్లు సార్వత్రిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.40 వేల స్టాండర్డ్ డిడక్షన్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు ఎటువంటి డాక్యుమెంట్లను, బిల్లులను సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశీల్‌చంద్ర స్పష్టంచేశారు. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం పన్నులు చెల్లించే ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.40 వేల ఫ్లాట్ స్టాండర్ డిడక్షన్‌తో పెద్ద ఊరట కల్పించింది. గతంలో బిల్లులు, డాక్యుమెంట్లు సమర్పించి కొంత మంది కన్వేయన్స్ అలవెన్సును, మరికొంత మంది మెడికల్ అలవెన్సును పొందేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ అలవెన్సులు, బిల్లులు, డాక్యుమెంట్లను తొలగించి వేతన జీవులకు ఫ్లాట్‌గా రూ.40 వేల స్టాండర్డ్ డిడక్షన్‌ను కల్పించింది. పన్ను చెల్లించే ఉద్యోగులు, పెన్షనర్లు నేరుగా ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అని ఆయన పీటీఐకి తెలిపారు. దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడే వారికి గడ్డు రోజులు తప్పవని ఆయన హెచ్చరించారు. అనుమానాస్పద లావాదేవీలను, నల్లధనాన్ని గుర్తించేందుకు అనువైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆదాయం పన్ను విభాగం సముపార్జించుకున్నదని, ఇకమీదట ఆ విభాగం ఆర్థిక నేరాలకు పాల్పడే వారిని వేటాడుతుందని సుశీల్‌చంద్ర స్పష్టంచేశారు. అలాగే పన్ను చెల్లింపుదారుల ఆదాయాన్ని ఆన్‌లైన్‌లో మదింపుచేసే (ఈ-అసెస్‌మెంట్) పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

1353
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles