టికెట్లు అమ్ముకున్న నేతలకు శాస్తి

Wed,October 23, 2019 01:39 AM

-బూట్ల దండలు, గాడిదపై ఊరేగింపు
-రాజస్థాన్‌లో బీఎస్పీ నాయకులపై కార్యకర్తల తిరుగుబాటు

జైపూర్, అక్టోబర్ 22: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్లను అమ్ముకున్నారన్న కోపంతో.. రాజస్థాన్‌కు చెందిన బీఎస్పీ కార్యకర్తలు తమ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులకు బూట్లతో చేసిన దండలు వేసి, ముఖానికి ముసుగులు కప్పి పార్టీ కార్యాలయం బయట ప్రదక్షిణలు చేయించారు. అంతేకాదు.. వీరిలో ఒకరిని గాడిదపై కూర్చొబెట్టి మరీ ఊరేగించారు. ఈ ఘటన మంగళవారం జైపూర్‌లోని బని పార్క్ వద్ద చోటుచేసుకుంది. రాష్ట్రంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, పార్టీ జాతీయ కో ఆర్డినేటర్ రాంజీ గౌతమ్, బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సీతారాం టికెట్లను అమ్ముకున్నారని ఆరోపిస్తూ కార్యకర్తలు ఈ చర్యకు పాల్పడ్డారు. వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు అమ్ముకున్నారని, పార్టీ కోసం ఏండ్ల నుంచి కష్టపడి పనిచేసిన వారిని పట్టించుకోలేదని కార్యకర్తలు తెలిపారు. రాంజీ గౌతమ్, సీతారాంలకు బూట్ల దండలు వేసి ఊరేగించామని, రాంజీ గౌతమ్‌ను గాడిదపై కూర్చోబెట్టి ఊరేగించామని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటన వెలుగుచూసిన వెంటనే రాజస్థాన్ బీఎస్పీ రాష్ట్ర కమిటీని మాయావతి రద్దు చేశారు.

546
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles