హర్‌హర్ గంగే 1.5 కోట్ల మంది పుణ్య స్నానాలు


Mon,February 11, 2019 01:41 AM

Braving cold weather 1 5 crore take dip in last shahi snan of Kumbh

-వసంత పంచమి సందర్భంగా జనసంద్రంగా మారిన కుంభమేళా
-చివరి పుణ్య స్నానాల కోసం పోటీపడ్డ భక్తులు
-ఇప్పటివరకూ 15 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు అధికారుల ప్రకటన

అలహాబాద్, ఫిబ్రవరి 10: హర్‌హర్ గంగే.. గంగా మాతాకీ జై.. అనే నినాదాలతో కుంభమేళా పరిసరాలు ఆదివారం దద్దరిల్లాయి. వసంత పంచమి పర్వదినం సందర్భంగా పవిత్ర స్నానాలు చేసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు అలహాబాద్‌కు పోటెత్తారు. గజగజ వణికించే చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామున నుంచే భక్తులు స్నాన ఘట్టాలకు బారులు తీరారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద ఈ ఒక్క రోజే సుమారు 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. సూర్యోదయానికి ముందే 50 లక్షల మంది భక్తులు గంగలో మునకేసినట్లు చెప్పారు. జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటివరకూ సుమారు 15 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు కుంభమేళా అధికారి విజయ్‌కిరణ్ ఆనంద్ చెప్పారు.

ప్రస్తుత కుంభమేళాలో మూడోది, చివరిదైన షాహీ స్నాన్‌ను వసంత పంచమి సందర్భంగా చేసేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. స్నానాలు చేసేందుకు, తిరిగి వెళ్లేందుకు వేర్వేరు దారులను ఏర్పాటు చేసి ఎక్కడా తొక్కిసలాట చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంది. అత్యధికులు అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత స్నానాలకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా అధికారులను యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అభినందించారు. మరోవైపు గంగానదిలో 15 కోట్ల మంది స్నానాలు చేశారని ప్రభుత్వం చెబుతుందని, ఏ ప్రాతిపదికన మీరు ఈ ప్రకటన చేశారని యూపీ మంత్రి, ఎస్బీ ఎస్పీ పార్టీ నేత ఓంప్రకాశ్ రాజ్‌భర్ ప్రశ్నించారు. భక్తులు, పర్యాటకులు ఏ మార్గాల ద్వారా కుంభమేళాకు చేరుకున్నారు. ఎంత మంది వచ్చారు? అనే వివరాలు మీ వద్ద ఉన్నాయా? అని నిలదీశారు.

mahanth

ఈ సాధువు.. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ

కుంభమేళాలో ఓ సాధువు భక్తుల్ని అమితంగా ఆకర్షిస్తున్నారు. గత ఎనిమిదేండ్లుగా తన కుడిచేతిని ఆకాశం వైపునకు చూపిస్తున్నట్లుగా పైకెత్తి ఉంచాడు. ప్రపంచ శాంతి, ప్రజల సంక్షేమం కోసమే తాను ఈ పనిచేస్తున్నట్లు మహంత్ రాధే పురి చెప్పారు. ఇది అఖండ్ తపస్య. ఉదయమే కాదు రాత్రి పూట కూడా ఈ చేయి అలాగే పైకెత్తి ఉంటుంది. 2011లో ఈ తపస్సును ప్రారంభించాను. ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండేవరకూ దీన్ని కొనసాగిస్తాను అని చెప్పారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో చేతిని పైకెత్తిన సాధువును చూసేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. సాధువు చేతిలో టార్చ్ పెడితే నడిచే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలా ఉంటారని భక్తుడొకరు వ్యాఖ్యానించారు.

రామ్ నామ్ బ్యాంకు

ఇదో అరుదైన బ్యాంకు. ఇక్కడ ఏటీఎం, చెక్‌బుక్‌లు ఉండవు. రామ నామమే ఈ బ్యాంకు ఆస్తి. మీరు రాసిన రామ జపమే కరెన్సీ. అలహాబాద్ కుంభమేళాలో రామ్ నామ్ బ్యాంకు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నది. మీరు చేయాల్సిందల్లా రామ నామం రాసి బ్యాంకు వారికి ఇవ్వడమే. తరాలుగా కొనసాగుతున్న రామ్ నామ్ బ్యాంకు డిజిటల్ హంగును సంతరించుకోనున్నది. బ్యాంకులో ఖాతాదారులకు ఇచ్చినట్లుగానే రామ్ నామ్ బ్యాంకులో ప్రతి భక్తుడికి (ఖాతాదారుడికి) ఒక అకౌంట్ నెంబర్, పాసు పుస్తకాన్ని ఇస్తారు. 30 పేజీలతో ఉన్న బుక్‌లెట్‌ను అందజేస్తారు. ఇందులో ప్రతి పేజీలో 108 కాలమ్స్ ఉంటాయి. ఇందులో నిత్యం 108 సార్లు రామ నామాన్ని రెడ్ కలర్ ఇంకుతో మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఈ పుస్తకంలో రామ నామం రాసిన తర్వాత తిరిగి బ్యాంక్‌లో మీ వ్యక్తిగత ఖాతాలో డిపాజిట్ చేయాలి.

ఆ తర్వాత పాక్‌బుక్‌ను జారీచేస్తారు. తన తాతల కాలం నుంచి రామ్‌నామ్ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఈ బ్యాంకును కొనసాగిస్తున్నట్లు నిర్వాహకుడు అశుతోష్ వర్షినే చెప్పారు. కుంభమేళాలో సెక్టార్ 6లో ఆయన క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రామ్‌నామ్ బ్యాంకు డిజిటలీకరణ దిశగా అడుగులు వేస్తున్నది. రామ్ నామ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ వ్యక్తిగత వివరాల్ని అందులో నమోదు చేసుకున్న అనంతరం ఖాతాదారుకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కేటాయిస్తారు. పూర్తి ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నామని, రామ భక్తిని విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమని బ్యాంకు అధ్యక్షుడు గుంజన్ వర్షినే వెల్లడించారు. ప్రస్తుతం ఈ బ్యాంకుకు 1.5లక్షల మంది నాన్-డిజిటల్ ఖాతాదారులు ఉన్నారు. కుంభమేళా చివరి నాటికి డిజిటల్ ఖాతాదారుల సంఖ్య 50వేల మందికి చేరుకుంటుందని అంచనా.

coconut

ప్రపంచంలోనే అతి పెద్ద విత్తనం

కుంభమేళాలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో 30 కిలోల బరువు ఉన్న జంట కొబ్బరి విత్తనం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ప్రపంచంలో ఇదే అతి పెద్ద విత్తనమని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బీఎస్‌ఐ) అధికారులు చెప్పారు. కోల్‌కతాలోని ఆచార్య జగదీశ్‌చంద్రబోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్‌లో 1894లో నాటిన కొబ్బరి చెట్టు నుంచి ఈ విత్తనాన్ని సేకరించినట్లు వారు వెల్లడించారు. 112 ఏండ్ల తర్వాత ఈ చెట్టు తొలిసారి పూత కాసిందని చెప్పారు. అంతరించిపోయే వృక్షాల జాబితాలో ఉన్న ఈ చెట్లు ప్రస్తుతం రెండు ఆఫ్రికా దేశాల్లోని దీవుల్లో మాత్రమే ఉన్నాయన్నారు. జంట కొబ్బరి చెట్టు జీవితకాలం వెయ్యేండ్లు అని పేర్కొన్నారు. అలాగే కేవలం 799 మైక్రాన్లు ఉన్న ఆర్చిడ్ సీడ్ కూడా పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నది. కేవలం మైక్రోస్కోప్ సాయంతో మాత్రమే ఈ విత్తనాన్ని చూడగలం.

1297
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles