వాయుసేన అమ్ములపొదిలో సరికొత్త అస్త్రం

Mon,February 11, 2019 01:16 AM

గుజరాత్ పోర్టుకు చేరుకున్న చినూక్ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: భారత వాయుసేన అమ్ములపొదిలో సరికొత్త అస్త్రం చేరబోతున్నది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నిర్మించిన శక్తిమంతమైన చినూక్ సీహెచ్ 47ఎఫ్(ఐ) హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు ఆదివారం గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్నాయి. మొత్తం 15 హెలికాప్టర్లు సరఫరా చేయాల్సి ఉండగా, తొలి దశలో నాలుగింటికి సంబంధించిన విడిభాగాలను అందజేసింది. వీటిని గుజరాత్‌లో అసెంబుల్ చేసి అనంతరం ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తారు. అక్కడ అధికారికంగా వాయుసేనకు అందజేస్తారు. షెడ్యూల్ ప్రకారం మార్చిలో వీటిని అందజేయాల్సి ఉండగా, అంతకంటే ముందుగానే అందజేయడం విశేషం. భారత భద్రతా దళాల ఆధునికీకరణలో తమ నిబద్ధతకు ఇదే నిదర్శనమని బోయింగ్ తెలిపింది. మొత్తం 2.5 బిలయన్ డాలర్ల వ్యయంతో 22 అపాచి, 15 చినూక్ హెలికాప్టర్ల కొనుగోలుకు 2015లో భారత ప్రభుత్వం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. హెలికాప్టర్ల తయారీ, శిక్షణ, సహకారానికి బోయింగ్‌ను రక్షణ శాఖ ఎంపిక చేసింది. చినూక్‌కు సంబంధించి వాయుసేన సిబ్బంది గతేడాది అమెరికాలో శిక్షణను ప్రారంభించారు. ఈ నెల ప్రారంభంలో ఫిలడెల్ఫియాలో తొలి చినూక్ హెలికాప్టర్ భారత వాయుసేనకు అందింది.

568
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles