బీజేపీ ఎంపీ ముకుల్‌రాయ్‌పై ఎఫ్‌ఐఆర్


Mon,February 11, 2019 01:23 AM

BJPs Mukul Roy named in FIR and two arrested

-టీఎంసీ ఎమ్మెల్యే బిశ్వాస్ హత్యకేసులో..
-మరో ముగ్గురిపై కూడా...

కోల్‌కతా, ఫిబ్రవరి 10: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ హత్య కేసుకు సంబంధించి బీజేపీ ఎంపీ ముకుల్‌రాయ్‌తోపాటు మరో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిని ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అప్పగించినట్లు తెలిపారు. కేసుతో సంబంధమున్న మరో ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బిశ్వాస్‌ను హత్య చేసేందుకు వినియోగించిన నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కృష్ణగంజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిశ్వాస్ శనివారం నాడియా జిల్లాలోని ఓ గ్రామంలో సరస్వతి పూజ కార్యక్రమంలో పాల్గొనగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. వెంటనే ఆయనను స్థానిక దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఎమ్మెల్యేతోపాటు మంత్రి కూడా హాజరైన కార్యక్రమానికి సరైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు రావడంతో స్థానిక హన్స్‌ఖాలి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జితోపాటు బిశ్వాస్ వ్యక్తిగత భద్రత అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, రాజకీయ ప్రేరేపితంగానే తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ముకుల్‌రాయ్ ఆరోపించారు. బిశ్వాస్ మృతి విచారకరమని, అయితే తృణమూల్ నేతలు బీజేపీ నేతలను ఇరికించేందుకు యత్నించడం నీచమైన కుట్ర తప్ప మరేమీ కాదన్నారు. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన ముకుల్‌రాయ్...పార్టీ అధినేత్రి మమతాబెనర్జీతో విభేదాల కారణంగా గతేడాది బీజేపీలో చేరారు. కాగా, బీజేపీకి చెందిన గూండాలే బిశ్వాస్‌ను హత్య చేశారని తృణమూల్ కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ పార్థా చటర్జీ మండిపడ్డారు.

857
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles