ఇది మూడో పానిపట్టు యుద్ధం


Sat,January 12, 2019 02:10 AM

BJPs Duty to Build Ram temple in Ayodhya at Earliest Says Amit Shah in War Cry for 2019 Polls

- వచ్చే లోక్‌సభ ఎన్నికల్ని సైద్ధాంతిక పోరాటంగా అభివర్ణించిన అమిత్‌షా
- అయోధ్యలో అతి త్వరలో ఆలయం నిర్మిస్తామని ప్రకటన
- కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తున్నదని విమర్శ
- సార్వత్రిక ఎన్నికల్లో 282 సీట్లతో అధికారంలోకి వస్తామని ధీమా
- అట్టహాసంగా ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

న్యూఢిల్లీ, జనవరి 11: వచ్చే లోక్‌సభ ఎన్నికల్ని సైద్ధాంతిక పోరాటంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అభివర్ణించారు. మరాఠాలకు, ఆఫ్ఘన్ సైన్యాలకు మధ్య 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధానికి 2019 సార్వత్రిక ఎన్నికలకు పోలిక ఉందని చెప్పారు. ఈ యుద్ధంలో మరాఠాల ఓటమితో దేశం విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఆ తర్వాత ఆంగ్లేయుల పాలనలో 200 ఏండ్లు భారతీయులు బానిసలుగా జీవించారని అమిత్‌షా గుర్తుచేశారు. అత్యంత నిర్ణయాత్మకమైన 2019 ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం కట్టాలని, లేదంటే మళ్లీ బానిసత్వంలోకి వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు. 2019 ఎన్నికల్లో 282 స్థానాలు సాధించి బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని, ప్రధాని మోదీ రెండోసారి అధికారం చేపడుతారని ధీమా వ్యక్తంచేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రెండు రోజులపాటు జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్ని అమిత్‌షా శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు.

ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వేలాది మంది ప్రతినిధులను ఉద్దేశించి అమిత్‌షా మాట్లాడుతూ.. అయోధ్యలో ప్రస్తుతం ఉన్న స్థలంలోనే అతి తొందరలోనే భవ్యమైన రామాలయాన్ని నిర్మిస్తామని, ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, త్వరలో సమస్య పరిష్కారమయ్యే దిశగా బీజేపీ అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. రాజ్యాంగబద్ధంగానే అయోధ్య వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. ఆలయం విషయంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ తమ వైఖరిని స్పష్టం చేయాలని అమిత్‌షా డిమాండ్ చేశారు. ఆలయానికి కాంగ్రెస్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కడుతున్న మహాకూటమిని మిథ్యగా ఆయన అభివర్ణించారు. కూటమికి నాయకత్వం గానీ, పాలసీగానీ లేవని ఎద్దేవా చేశారు. కేవలం అధికారం కోసం వారు జట్టు కట్టారని విమర్శించారు. సాంస్కృతిక జాతీయవాదం, పేదల సంక్షేమ పథకాలు, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం తమను రెండోసారి అధికారంలోకి తీసుకువస్తాయని అమిత్‌షా ధీమా వ్యక్తంచేశారు. మజ్బూత్ సర్కార్ (సమర్థ ప్రభుత్వం) కావాలా? లేదంటే మజ్బూర్ సర్కార్ (నిస్సహాయ ప్రభుత్వం) కావాలా? అనేది ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలంతా మోదీ లాంటి గట్టి నేత ఉన్న మజ్బూత్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
BJP
దేశంలో మోదీకి ఉన్న ప్రజాదరణ మరే నేతకు లేదని చెప్పారు. రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు అసత్యమని న్యాయస్థానాల్లో తేలిందని చెప్పారు. 1987 నుంచి మోదీ తనకు తెలుసునని, అప్పట్నుంచీ ఇప్పటివరకూ ఆయన నేతృత్వంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఓటమిని చూడలేదని తెలిపారు. మోదీని ఓటమెరుగని విజేతగా అభివర్ణించారు. యూపీలో అత్త-అల్లుడు (మాయావతి, అఖిలేష్) కూటమి తమకు పోటీ కాదని చెప్పారు. యూపీలో గత ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకు 73 గెలిచామని, వచ్చే ఎన్నికల్లో 74 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తామని తెలిపారు. మోదీపై అవినీతి ఆరోపణలు చేసేందుకు సోనియా, రాహుల్‌లు భయపడుతున్నారని, నేషనల్ హెరాల్డ్ కేసులో వారిద్దరూ బెయిల్‌పై ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని మండిపడ్డారు. దేశ భద్రత రాహుల్ బాబాకు, అతడి భజన బృందానికి పట్టదని ఎద్దేవా చేశారు. ఈబీసీ బిల్లుతో అగ్రకులాల్లోని నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూరనున్నదని పేర్కొన్నారు. మోదీ హయాంలో సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని చెప్పారు. లక్ష్యిత దాడులతో భారత్ ఏకంగా అమెరికా, ఇజ్రాయెల్ సరసన చేరిందని తెలిపారు.

715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles