కమలం హవా!

Tue,October 22, 2019 04:57 AM

- మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీదే గెలుపు
- అంచనా వేసిన ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు
- మహారాష్ట్రలో 60.46%, హర్యానాలో 65.75% పోలింగ్‌
- గతంతో పోల్చితే రెండు రాష్ర్టాల్లోనూ తగ్గిన ఓటింగ్‌
- 24న ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి

సార్వత్రిక ఎన్నికల అనంతరం మొదటిసారిగా రెండు ప్రధాన రాష్ర్టాలైన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చనున్నదని పలు ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు పేర్కొన్నాయి. మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేన మద్దతు లేకుండానే ప్రభుత్వం ఏర్పాటుచేయగలిగేంత మెజార్టీని బీజేపీ సాధిస్తుందని పలు సర్వేలు తెలిపాయి. సోమవారం ఈ రెండు రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలతోపాటు, దేశవ్యాప్తంగా రెండు లోక్‌సభ, 51 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మహారాష్ట్రలో 60.46%, హర్యానాలో 65.75% పోలింగ్‌ నమోదైంది. గతంతో పోల్చితే రెండు రాష్ర్టాల్లోనూ ఓటింగ్‌ శాతం బాగా తగ్గింది. మహారాష్ట్రలో 1980 (53.3%) తర్వాత ఇంతతక్కువ ఓట్లు పోల్‌ కావటం ఇదే మొదటిసారి. హర్యానాలో కూడా దాదాపు 50 ఏండ్ల తర్వాత రికార్డుస్థాయిలో ఓటింగ్‌ తగ్గినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి 11 శాతం పోలింగ్‌ తగ్గింది. అయినప్పటికీ ఫలితాల్లో బీజేపీ హవానే కనిపిస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ పేర్కొంటున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని, హర్యానాలో గతంకంటే స్థానాలను పెంచుకుంటుందని తెలిపాయి. ఎగ్జిట్‌పోల్స్‌ సారాంశంగా ఎన్డీటీవీ ప్రకటించిన పోల్‌ ఆఫ్‌ పోల్స్‌లో హర్యానాలో బీజేపీకి 66, కాంగ్రెస్‌కు 14 సీట్లు వస్తాయని తేలింది. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమికి 211, కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమికి 64 సీట్లు వస్తాయని వెల్లడైంది.
polling1
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి మరోసారి ప్రభుత్వాలను ఏర్పాటు చేయనుంది. ఈ రెండు రాష్ర్టాల అసెంబ్లీలకు సోమవారం జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాషాయ పార్టీలకే పట్టం కట్టారని పలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు పేర్కొన్నాయి. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి, హర్యానాలో బీజేపీ మూడింట రెండు వంతులకు పైగా సీట్లను గెలుచుకోగలవని ఆ సర్వేలు వెల్లడించాయి. పోలింగ్‌ ముగిసిన వెంటనే పలు టీవీ చానెళ్లలో ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలు ప్రసారమయ్యాయి. మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమికి 185 సీట్లు లభించగా, ఈసారి ఆ సంఖ్య 200ను దాటగలదని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమి పూర్తిగా చతికిలబడుతుందని జోస్యం చెప్పాయి. హర్యానాలో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందని పేర్కొన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలకు గాను బీజేపీ-శివసేన కూటమి 166-194 సీట్లను గెలుచుకోగలదని, ప్రతిపక్ష కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమికి 72-90 సీట్లు దక్కవచ్చని ఇండియాటుడే-యాక్సిస్‌ ఎగ్జిట్‌పోల్‌ తెలిపింది. బీజేపీ 142, శివసేన 102 సీట్లు గెలుచుకోగలదని న్యూస్‌18-ఐపీఎస్‌ఓఎస్‌ అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 17, ఎన్సీపీకి 22 సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొంది. ఏబీపీ-సీ ఓటర్‌ అంచనాల ప్రకారం బీజేపీ-శివసేన కూటమికి 204, కాంగ్రెస్‌-ఎన్సీపీకి 69 సీట్లు రానున్నాయి. ఇక హర్యానాలోని 90 సీట్లకు గాను బీజేపీ 72 సీట్లను కాంగ్రెస్‌ కేవలం 8 సీట్లను గెలుచుకోగలవని ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే తెలిపింది. బీజేపీకి 75, కాంగ్రెస్‌కు 10 సీట్లు వస్తాయని సీఎన్‌ఎన్‌-ఐపీఎస్‌ఓఎస్‌ పేర్కొంది.

polling2
polling3

1568
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles