మాకు పూర్తి మెజార్టీ


Sat,May 18, 2019 02:59 AM

BJP will come back to power with a majority of its own

-మళ్లీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్న మోదీ
-ఐదేండ్లలో మొదటిసారి విలేకరుల సమావేశానికి..
-నాలుగు ముక్కలు మాట్లాడి మమ అనిపించిన ప్రధాని
-పార్టీ అధ్యక్షుడే స్పందిస్తారంటూసమాధానాలు దాటవేత
300కు పైగా సీట్లు సాధిస్తామన్న అమిత్‌షా
న్యూఢిల్లీ, మే 17:ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధీమా వ్యక్తంచేశారు. సంపూర్ణ మెజార్టీ సాధిస్తామని, మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అరుదుగా మీడియాతో మాట్లాడే ప్రధాని మోదీ.. ఐదేండ్లలో మొట్టమొదటిసారిగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు హఠాత్తుగా హాజరై ఆశ్చర్యపరిచారు. షెడ్యూల్ ప్రకారం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఈ సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. మోదీ కూడా పాల్గొన్నారు. అయితే నాలుగు ముక్కలు మాట్లాడి మమ అనిపించారు. విలేకరుల ప్రశ్నలను ఎదుర్కొనేందుకు, సమాధానాలు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. ప్రశ్నలు ఏమైనా ఉంటే పార్టీ అధ్యక్షుడినే అడుగాలంటూ అమిత్‌షాపైకి తోసి తప్పించుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఐదేండ్లుగా దేశం మొత్తం మద్దతుగా నిలిచిందన్నారు. ఇందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నానని అన్నారు. ఎన్నికలు అద్భుతంగా, సానుకూల వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పారు. మరోసారి సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటుచేయబోతున్నామని ధీమా వ్యక్తంచేశారు.

అనేక దశాబ్దాల తర్వాత ఇలాంటిదృశ్యం ఆవిష్కృతమవుతున్నదని పేర్కొన్నారు. మా నిజాయితీ ప్రభుత్వ పాలన 2014 మే 17న ప్రారంభమైంది. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పందేలు కట్టినవారంతా ఓడిపోయారు. భారీమొత్తంలో కోల్పోయారు. ఈ రోజు కూడా మే 17 అని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలితాలు అందించామని, ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం చెప్పామని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాజా మ్యానిఫెస్టోలోని హామీలను ఒకదానితర్వాత ఒకటి అమలుచేస్తామన్నారు. సోషల్ మీడియా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా తనలో జవాబుదారీతనాన్ని రెట్టింపు చేసిందని చెప్పారు.
Amit-Shah

నన్ను అడుగొద్దు ప్లీజ్..

సమావేశం సందర్భంగా విలేకరులు ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నించగా మోదీ తిరస్కరించారు. తాను కేవలం కృతజ్ఞతలు చెప్పేందుకే వచ్చానన్నారు. ఏవైనా ప్రశ్నలు ఉంటే అమిత్‌షాను అడుగాలని సూచించారు. ఈ సమావేశాన్ని అమిత్‌షా నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రశ్నలన్నింటికీ ఆయనే సమాధానం ఇస్తారు. క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తలుగా మేం నిబంధనలు పాటిస్తాం. మాకు పార్టీ అధ్యక్షుడే అన్నీ.. ఐదేండ్లు ఈ దేశానికి సేవచేసే అవకాశం కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పేందుకు మాత్రమే ఇక్కడికి వచ్చాను అని చెప్పారు.

ఎవరైనా ఎన్డీయేలో చేరొచ్చు

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడుతూ ఎన్నికల్లో గెలువడానికి మోదీ తీవ్రంగా శ్రమించారని, మొత్తం 142 ప్రచార సభల్లో పాల్గొని, 1.5 కోట్ల మంది ప్రజలతో నేరుగా మాట్లాడారని పేర్కొన్నారు. ప్రజలు మోదీ పాలనను, ప్రయోగాలను ఆమోదించారని చెప్పారు. ఎన్డీయేలో చేరాలనుకునే పార్టీలకు ఆహ్వానం పలికారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సినన్ని సీట్లు సాధిస్తాం. 300కుపైగా స్థానాలు మావే. మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయం. ఎవరైనా ఎన్డీయేలో చేరాలనుకుంటే.. మా తలుపులు తెరిచే ఉంటాయి అని పేర్కొన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత మీడియాతో మాట్లాడటం లేదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన విమర్శలను తోసిపుచ్చారు. రాఫెల్ వివాదంపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారన్న ఓ విలేకరి ప్రశ్నకు స్పందిస్తూ ప్రతి ప్రశ్నకు ప్రధాని స్పందించాల్సిన అవసరం లేదు. ఈ వివాదం గురించి నేను అనేకసార్లు మాట్లాడాను అని పేర్కొన్నారు. మోదీ వైఖరిని కాంగ్రెస్ విమర్శించింది. విలేకరుల ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానాలు చెప్పలేక.. యుద్ధాన్ని మధ్యలోనే వదిలేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఎద్దేవా చేశారు.

మళ్లీ ప్రధానిగా ఎన్నుకోబోతున్నందుకు కృతజ్ఞతలు

ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్‌లో చివరి ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. దేశప్రజలంతా మరోసారి మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈసారి 300కుపైగా సీట్లు సాధిస్తామని, దశాబ్దాల తర్వాత వరుసగా రెండోసారి సంపూర్ణ మెజార్టీ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని ధీమా వ్యక్తంచేశారు. మరోసారి తనను ఎన్నుకోబోతున్నందుకు దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. మిగతా ఎన్నికలకు, 2019 సార్వత్రిక ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉన్నదన్నారు. తిండి దొరుకని వాళ్లే సైన్యంలో చేరుతారన్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఖండించలేదని విమర్శించారు. అలాంటివారిని దేశ ప్రజలు ఎన్నడూ క్షమించరని చెప్పారు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికీ తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

666
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles