పొత్తులకు ఆహ్వానం

Fri,January 11, 2019 02:47 AM

-బీజేపీ తలుపులు తెరిచే ఉంటాయ్
-అటల్‌జీ నడిపిన సంకీర్ణ రాజకీయాలే ఆదర్శం
-తమిళనాడు బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ వ్యాఖ్య

చెన్నై, జనవరి 10: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడులో ఎన్‌డీఏని బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్రమోదీ పొత్తులకు ఆహ్వానం పలికారు. పొత్తులకు బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని ఐదు జిల్లాలకు చెందిన బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 1990వ దశకంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సంకీర్ణ రాజకీయాలను విజయవంతంగా నడిపారని మోదీ గుర్తు చేశారు. 20 ఏండ్ల క్రితం దార్శనిక నేత అటల్‌జీ దేశ రాజకీయాల్లో కొత్త సంస్కృతిని తెచ్చారు. అవే విజయవంతమైన సంకీర్ణ రాజకీయాలు. ప్రాంతీయ ఆకాంక్షలకు ఆయన ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఆయన చూపిన బాటలోనే బీజేపీ పయనిస్తుంది అని మోదీ అన్నారు. అన్నాడీఎంకే, డీఎంకే, లేదా రజనీకాంత్ ఏర్పాటు చేయబోయే పార్టీతో బీజేపీ పొత్తుకు సిద్ధమా అని పార్టీ కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు.

2014 లోకసభ ఎన్నికల్లో తమిళనాడులో డీఎండీఏ, పీఎంకే, ఎండీఎంకే తదితర ఆరు చిన్నపార్టీలతో కలిసి బరిలోకి దిగిన బీజేపీ కూటమి 39 స్థానాల్లో పోటీచేసి కేవలం రెండే స్థానాల్లో గెలుపొందింది. అందులో ఓ స్థానంలో బీజేపీ గెలుపొందగా, మరోచోట పీఎంకే విజయం సాధించింది. ఎన్నికల అనంతరం ఆ పార్టీలన్నీ ఎన్డీఏకి గుడ్‌బై చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో పాత మిత్రులకు ఆయన ఆహ్వానం పలికారు. భారీ మెజార్టీ సాధించిన సందర్భాల్లో కూడా భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వం నడిపేందుకే బీజేపీ ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు, ఆకాంక్షల పట్ల కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రజలతో భాగస్వామ్యమే విజయవంతమైన భాగస్వామ్యమని, ప్రజలతో సంబంధాలు బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారించాలని కార్యకర్తలకు సూచించారు.

రాఫెల్ ఒప్పందం జాప్యంలో మిషెల్ పాత్రేమిటి?

సాయుధ బలగాలకు కాంగ్రెస్ తీరని నష్టం కలిగించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఒప్పందంలో తమకు డీల్ కుదరకపోతే రక్షణ ఉత్పత్తుల కొనుగోలును యూపీఏ ప్రభుత్వం నిలిపివేసేదని విమర్శించారు. మధ్యవర్తి మిషెల్‌కు సోనియా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. యూపీఏ హయాంలో రాఫెల్ ఒప్పందం పదేండ్లు జాప్యం చేసుకోవడం వెనుక మిషెల్ పాత్ర ఏమిటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

బీజేపీ ఉపాధ్యక్షులుగా ముగ్గురు మాజీ సీఎంలు

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజె, రమణ్‌సింగ్‌లను పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా బీజేపీ నియమించింది. ఇటీవల జరిగిన ఈ మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ముగ్గురు సీఎంలుగా ఉన్నారు. ఈ మూడు రాష్ర్టాల్లో బీజేపీ ఓడిపోయిన విషయం తెలిసిందే.

లోక్‌సభ ఎన్నికలే అజెండాగా.. నేటి నుంచి బీజేపీ జాతీయ సమావేశాలు

-కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న మోదీ, అమిత్ షా
బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు శుక్రవారం నుంచి రెండు రోజులపాటు ఢిల్లీలో జరుగనున్నాయి. నాలుగున్నరేండ్ల పాలనలో సాధించిన ప్రగతి, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు చేరువకావడం ప్రధాన అజెండాగా ఈ సమావేశాలు జరుగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకున్నది. శుక్రవారం సమావేశాలను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభిస్తారు. సమావేశాల ముగింపు సందర్భంగా శనివారం ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. లోక్‌సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ కార్యకర్తలకు వీరిద్దరు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

587
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles