రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ ఎన్నిక


Fri,August 10, 2018 02:57 AM

BJP led NDA candidate Harivansh Narayan Singh elected New Rajya Sabha deputy chairman

-ఉత్కంఠ రేపిన పోరులో ఎన్డీయే అభ్యర్థి విజయం
- 20 ఓట్ల తేడాతో ఓడిన విపక్షాల అభ్యర్థి హరిప్రసాద్
-ఓట్లు వేయించడంలో విఫలమైన విపక్షం
-కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకేకు చెందిన ఇద్దరేసి సభ్యుల గైర్హాజరు
-సభను నిష్పాక్షికంగా నిర్వహిస్తా: హరివంశ్
-ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీహార్ సీఎం నితీశ్ కృతజ్ఞతలు

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఉత్కంఠభరితంగా సాగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో విజయం ఎన్డీయే అభ్యర్థినే వరించింది. హోరాహోరీగా జరుగుతుందనుకున్న పోటీ చివరికి ఏకపక్షంగా మారింది. ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఓటింగ్‌పై శ్రద్ధ చూపకపోవడంతో ఓటమి చవిచూడక తప్పలేదు. దీంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా అధికార పక్ష కూటమి (ఎన్డీయే) అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. జేడీ(యూ)కు చెందిన హరివంశ్ 20 ఓట్ల తేడాతో విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్ (కాంగ్రెస్)ను ఓడించారు. హరివంశ్‌కు 125 ఓట్లు రాగా, హరిప్రసాద్‌కు 105 ఓట్లు వచ్చాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు, కొందరు ప్రతిపక్ష సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరు కాగా, ఇద్దరు సభ్యులు సభలో ఉన్నప్పటికీ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఫలితం వెలువడిన వెంటనే ప్రధాని మోదీ సహా రాజ్యసభ సభ్యులందరూ హరివంశ్‌ను అభినందించారు. సభను మర్యాదపూర్వకంగా, నిష్పాక్షికంగా నడిపిస్తానని కొత్త డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ చెప్పారు. అబ్ సబ్ కుచ్ హరీ భరోసే. ఔర్ ముజే విశ్వాస్ హై కే సభీ ఇధర్ హో యా ఉధర్, సభీ సాన్సదో పర్ హరీ కృపా బనీ రహేగీ (ఇప్పుడిక అంతా హరి (హరివంశ్) చేతిలోనే. ఇటువైపు సభ్యులైనా, అటువైపు సభ్యులైనా అందరిపై హరి దయ ఉంటుందని ఆశిస్తున్నాను) అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Harivansh-Narayan3
సభా నాయకుడు అరుణ్‌జైట్లీ, ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కూడా హరివంశ్‌ను అభినందించారు. హరివంశ్ సింగ్ పేరును రామ్‌ప్రసాద్ సింగ్ (జేడీయూ) ప్రతిపాదించగా, ఆర్పీఐ సభ్యుడు రామ్‌దాస్ అఠావలే మద్దతు తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, శివసేన సభ్యుడు సంజయ్ రౌత్, అకాలీదళ్‌కు చెందిన సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా కూడా హరివంశ్ పేరును ప్రతిపాదించారు. ఓటింగ్ సమయంలో పొరపాట్లు జరిగినట్టు కొందరు సభ్యులు చెప్పడంతో రెండోసారి ఓటింగ్ నిర్వహించారు. సభకు హాజరైన వారిలో హరివంశ్‌కు అనుకూలంగా 125 మంది, హరిప్రసాద్‌కు 105 మంది ఓటు వేయగా, ఇద్దరు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఫలితాన్ని ప్రకటించిన అనంతరం చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ కలిసి హరివంశ్‌ను డిప్యూటీ స్పీకర్‌కు కేటాయించిన స్థానం వద్దకు తోడ్కొని వెళ్లారు. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స కారణంగా చాలాకాలం సభకు రాకుండా ఉన్న అరుణ్‌జైట్లీ ఈ ఎన్నిక కోసం సభకు వచ్చారు. పీజే కురియన్ పదవీ విరమణతో జూలై ఒకటి నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది.

ఆటగాళ్లకంటే అంపైర్లకే ఇబ్బందులు: మోదీ ఛలోక్తులు

ఎన్డీయే అభ్యర్థి విజయం సాధించడంతో ఉల్లాసంగా కనిపించిన మోదీ కొన్ని చలోక్తులు విసిరారు. సభలో పరిస్థితి ఎలా ఉంటుందంటే.. ఇక్కడ ఆటగాళ్లకంటే అంపైర్లే ఎక్కువ ఇబ్బందులనెదుర్కొంటారు అని అన్నారు. చైర్మన్ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, సభలో ఎప్పుడైనా నేను భావోద్వేగానికి గురి కావచ్చు. కానీ హరివంశ్ ఎప్పుడూ నవ్వుతూ, ప్రశాంతంగా ఉంటారు అని అన్నారు.
Harivansh-Narayan1

సీఎం కేసీఆర్‌కు బీహార్ సీఎం నితీశ్ కృతజ్ఞతలు

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్‌సింగ్‌కు టీఆర్‌ఎస్ సభ్యులు మద్దతునిచ్చిందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు బీహార్ సీఎం, జేడీ(యూ) అధినేత నితీశ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన సీఎం కేసీఆర్‌కు ఫోన్‌చేసి మాట్లాడారు. భవిష్యత్తులో టీఆర్‌ఎస్ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు.

కాంగ్రెస్, తృణమూల్ సభ్యుల డుమ్మా!

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ప్రతిపక్షాలు తమ సభ్యులందరితో ఓటు వేయించడంలో విఫలమయ్యాయి. ఎన్డీయేకు చెందిన సభ్యులందరూ పూర్తి స్థాయిలో సభకు హాజరు కాగా, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకేకు చెందిన ఇద్దరేసి సభ్యులు గైర్హాజరయ్యారు. సభలో మొత్తం 244 మందికి గాను 232 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో 125 మంది హరివంశ్‌కు ఓటు వేయడంతో ఆయన 20 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైసీపీకి చెందిన ఇద్దరు సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. పీడీపీకి చెందిన ఇద్దరు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒకరు కూడా సభకు హాజరు కాలేదు.. బీజేడీ, టీఆర్‌ఎస్‌లు ఎన్డీయే అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశాయి.

సభ గౌరవాన్ని కాపాడుతా..

-గాంధీజీ, జయప్రకాశ్ నారాయణ్ సిద్ధాంతాలను సభ్యులు అనుసరించాలి
-రాజ్యసభలో కొత్త డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పిలుపు

Harivansh-Narayan4
ఎగువసభ గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తానని రాజ్యసభ కొత్త డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌సింగ్ చెప్పారు. నిర్మాణాత్మక చర్చలు, ఏకాభిప్రాయం ద్వారా సభ్యుల మద్య విభేదాలు సమసిపోగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. సభ్యులందరూ మహాత్మా గాంధీ, జయప్రకాశ్ నారాయణ్ సిద్ధాంతాలను అనుసరించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. మన రాజ్యాంగ నిర్మాతలు రూపొందించిన నిబంధనలను అనుసరించడం ద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చని అన్నారు. నా చుట్టూ ఉన్న ఎందరో అనుభవజ్ఞులను చూస్తే భయమేస్తున్నది. అయితే మీరే నాకు బలం కూడా. ఎందుకంటే సభను నడిపించడంలో మీరే నాకు మార్గనిర్దేశనం చేయగలరు. సభను మర్యాదపూర్వకంగా, నిష్పాక్షికంగా నడిపించగలనని భరోసా ఇస్తున్నాను అని హరివంశ్ పేర్కొన్నారు. నేను రాజ్యసభ ఎంపీ అయిన తరువాత బీహార్‌లోని ఆరా యూనివర్సిటీకి గెస్ట్ లెక్చర్ ఇవ్వటానికి వెళ్లాను. అక్కడ ఒక యక్ష ప్రశ్న ఎదురైంది.

అక్కడి విద్యార్థులు నన్ను భారత్.. పశ్చిమ దేశాల ప్రజాస్వామ్య విధానాలను అనుసరిస్తున్నప్పుడు మన పార్లమెంటేరియన్లు పశ్చిమ దేశాల వారిలాగా ఆ క్రమశిక్షణతో, గౌరవంతో ఎందుకు సభను నడుపడం లేదు? లేదంటే, పురాతన భారతీయ వ్యవస్థలోని ఉన్నతస్థాయి చర్చా విధానాలను ఎందుకు అనుసరించటం లేదు? అని అడిగారు. వారి ఈ యక్ష ప్రశ్న(సంక్షిప్త ప్రశ్న)కు గీతా శ్లోకంలో జవాబు లభించింది. ఓ గొప్ప వ్యక్తి ఏం చేసినా, ఇతరులు దానిని అనుసరిస్తారు. ఆయన నెలకొల్పిన ప్రమాణాలను ఇతరులు పాటిస్తారు అని గీతలో ఉంది. ప్రజలు పార్లమెంటు సభ్యులను అనుకరిస్తారు గనుక మీరు గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలి అని హరివంశ్ పేర్కొన్నారు. తాను ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రతిపక్ష నేత ఆజాద్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గంగా, గాఘ్రా అనే రెండు మహానదుల మధ్య ఉన్న గ్రామం నుంచి తాను వచ్చానని తెలిపారు. అక్కడ వరదలు వచ్చినప్పుడు ఇదే తమ చివరి రోజు అని ప్రజలు భావిస్తారని అన్నారు. ఓ సాధారణ పాఠశాలలో.. చెట్టుకింద చదువుకున్నాను. మా ఊరికి ఒకప్పుడు రోడ్డు లేదు. అనారోగ్యం బారిన పడిన వారిని మంచాలపై వేసుకొని 15 కిలోమీటర్ల దూరంలోని దవాఖానకు తీసుకెళ్లేవారు. చాలా ఏండ్లకు మా ఊరికి విద్యుత్ వచ్చింది. 37 ఏండ్ల పాత్రికేయ వృత్తితోసహా మొత్తం 40 ఏండ్ల ఉద్యోగ జీవితం నాది అని వెల్లడించారు.

నాటి జర్నలిస్టు.. నేటి డిప్యూటీ చైర్మన్

-ఆర్బీఐ ఉద్యోగాన్ని వదులుకొని పాత్రికేయ రంగంలోకి హరివంశ్ నారాయణ్ సింగ్
-ప్రభాత్ ఖబర్ హిందీ పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా సేవలు
-నాటి ప్రధాని చంద్రశేఖర్‌కు మీడియా సలహాదారుగా బాధ్యతలు
-రాజ్యసభలో తొలిసారిగా అడుగుపెట్టి.. డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక

Harivansh-Narayan2
తొలిసారి ఎంపీగా రాజ్యసభలో అడుగుపెట్టిన హరివంశ్ నారాయణ్‌సింగ్.. గురువారం పెద్దలసభకు డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1956 జూన్ 30న ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియాలో ఆయన జన్మించారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో డిగ్రీ చదివే సమయంలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఉపన్యాసాలతో తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఎంఏ (ఎకనామిక్స్)తోపాటు జర్నలిజంలో డిప్లొమా పూర్తిచేశారు. తొలుత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ శాఖలో కొన్నాళ్లు బాధ్యతలు నిర్వర్తించారు. జర్నలిజంపై ఉన్న ఆసక్తితో ప్రభుత్వ కొలువును వదిలేసి పాత్రికేయుడిగా మారారు. ఎంచుకున్న రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రముఖ హిందీ దినపత్రిక ప్రభాత్ ఖబర్‌కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు మీడియా సలహాదారుగా కూడా వ్యవహరించారు. తర్వాత తిరిగి జర్నలిజంలోకి వెళ్లారు. హిందీలో ఆయన అనేక పుస్తకాలు రాశారు. ప్రత్యేకించి జార్ఖండ్, బీహార్‌లపై ఆయన రచనలు కొనసాగాయి. హిందీ భాషాభివృద్ధికి చేసిన సేవలకు అనేక అవార్డులను అందుకున్నారు. నిరాడంబరంగా ఉండేందుకే ప్రాధాన్యమిచ్చే ఆయనకు పార్టీలకు అతీతంగా రాజకీయ స్నేహితులు ఉన్నారు. బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న హరివంశ్.. జేడీ(యూ) తరఫున 2014లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. బీహార్‌లో జేడీ(యూ), బీజేపీ కలిసి సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటుచేసినా.. ఇటీవల నితీశ్ తమకు దూరంగా జరుగుతున్నారన్న వార్తల నేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ పదవికి అనూహ్యంగా హరివంశ్‌ను ఎన్డీయే అభ్యర్థిగా బీజేపీ తెరపైకి తెచ్చింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి 1992తర్వాత తొలిసారిగా ఓటింగ్ ద్వారా ఎన్నికైన వ్యక్తిగా హరివంశ్ నిలిచారు.

రాహుల్ చొరవ చూపి ఉంటే&!

- హరిప్రసాద్‌కు మరిన్ని ఓట్లు వచ్చేవంటున్న విపక్షాలు
- డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఓటమిపై పలువురి అసంతృప్తి

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెసేతర అభ్యర్థి పోటీ పడి ఉంటే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చేవని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. తమపై ఎన్డీయే అభ్యర్థి గెలిచినా బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యతను సాధించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలుగబోదని అవి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు బయటికి గాంభీర్యం చూపుతున్నప్పటికీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. పార్లమెంట్ గ్యాలరీల్లో వారి అసంతృప్తి బహిరంగంగానే వినిపించింది. జేడీ(యూ) అభ్యర్థి హరివంశ్ సింగ్‌ను గెలిపించుకొనేందుకు ఆ పార్టీ అధినేత, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ టీఆర్‌ఎస్, బీజేడీ వంటి తటస్థ పార్టీలకు కూడా ఫోన్‌చేసి మద్దతును కోరారు. అదే పనిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎందుకు చేయలేకపోయారని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇటు ఎన్డీయేకు అటు కాంగ్రెస్‌కు అనుకూలంగా లేని పార్టీల వారికి రాహుల్ ఫోన్ చేసి మద్దతును కోరి ఉంటే తమ అభ్యర్థికి మరిన్ని ఓట్లు లభించి ఉండేవని వారు అభిప్రాయపడ్డారు. ఎన్డీయే అభ్యర్థికి ఓట్లు సాధించేందుకు స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. బీజేపీని వ్యతిరేకించడంలో మేమింకా ఐక్యంగానే ఉన్నాం. ఇవన్నీ ప్రపంచ కప్ పోటీలకు ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌ల వంటివి అని టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రియన్ అన్నారు. కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం కూడా సంతృప్తికరంగా లేదని మరికొందరు పేర్కొన్నారు.

1032
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles