ఒడిశాలో బీజేపీ అభ్యర్థి కాల్చివేత


Tue,April 16, 2019 03:14 AM

BJP Leader Shot Dead Outside Party Candidate House In Odisha

-మోటార్‌బైక్‌పై వచ్చి నాలుగు రౌండ్లు కాల్పులు
-హత్యకు నిరసనగా సోమవారంబీజేపీ బంద్
-దాడిని ఖండించినసీఎం నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
భువనేశ్వర్, ఏప్రిల్ 15: ఒడిశాలోని ఖుర్దా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మంగులి జెనాను ఆదివారం అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కౌలూచరణ్ ఖండాయత్‌లోని తన నివాసానికి సమీపాన మంగులి జైనా పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. మోటార్ బైక్‌పై వచ్చిన దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి, పారిపోయారు. రెండు తూటాలు తగలడంతో తీవ్రంగా గాయపడిన జెనాను జిల్లా కేంద్ర దవాఖానకు తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఖుర్దా పట్టణంలో పలుచోట్ల తనిఖీలు జరిపారు.

ఆయన కాల్చివేతకు కారణమేమిటో ఇంకా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. మంగులి జెనా హత్యకు నిరసనగా సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ఘటనను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత తరుణంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని పార్టీ శ్రేణులను కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాలెట్లతో బుల్లెట్లకు సమాధానం చెప్పాలని ప్రజలను అభ్యర్థించారు. సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. జెనా మృతికి సంతాపం తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని ఈసీని కోరారు. బీజేడీ అభ్యర్థి జితూ మిశ్రా కూడా ఘటనను ఖండించారు. భువనేశ్వర్ లోక్‌సభ స్థానం పరిధిలోకి రానున్న ఖుర్దా అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు ఈ నెల 23న జరుగుతాయి.

645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles