మహా సీఎం పీఠం శివసేనదే

Fri,November 8, 2019 02:59 AM

-తేల్చి చెప్పిన ఆ పార్టీ నేత సంజయ్ రౌత్
-మహారాష్ట్ర సర్కార్ ఏర్పాటులో తొలగని ప్రతిష్ఠంభన
-ఉద్ధవ్‌దే తుది నిర్ణయం: శివసేన ఎల్పీ భేటీలో నిర్ణయం
-హోటల్‌కు శివసేన ఎమ్మెల్యేల తరలింపు
-బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధంగా లేను: ఉద్ధవ్

ముంబై, నవంబర్ 7: ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన నాయకుడు మాత్రమే మహారాష్ట్ర తదుపరి సీఎంగా ఉంటారని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. సర్కారు ఏర్పాటుకు తుది గడువు సమీపిస్తున్నా మహాయుతి (మహా కూటమి) పక్షాలు బీజేపీ, శివసేన తమ వైఖరికే కట్టుబడి ఉండటంతో ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. ప్రభుత్వంలో 50:50 వాటాతోపాటు సీఎం పదవిని చెరో రెండున్నరేండ్లు పంచుకోవాలన్న డిమాండ్‌కే శివసేన కట్టుబడి ఉన్నది. తమ పార్టీకి సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుసుకునేందుకు తాము సిద్ధమని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఇదిలా ఉంటే ఉద్ధవ్ నివాసం మాతోశ్రీలో గురువారం జరిగిన శివసేన శాసనసభా పక్షం.. ప్రభుత్వ ఏర్పాటు విషయమై తుది నిర్ణయాధికారాన్ని పార్టీ అధినేతకు అప్పగిస్తూ తీర్మానించింది. బీజేపీతో మితృత్వాన్ని తెగదెంపులు చేసుకునేందుకు తాము సిద్ధంగా లేమని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని మాత్రమే అమలు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. శివసేన నేతను సీఎంను చేయాలన్న డిమాండ్ నుంచి వైదొలిగే ప్రసక్తే లేదన్నారు. ఒకవేళ సీఎం పదవి వద్దనుకుంటే 15 రోజుల సమయం ఎందుకు వృథా చేస్తానని ఎమ్మెల్యేల భేటీలో ఉద్ధవ్ చెప్పారు. శాసనసభాపక్ష భేటీ ముగిసిన వెంటనే సమీపంలోని రంగ్‌శర్దా హోటల్‌కు శివసేన ఎమ్మెల్యేలు తరలి వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో బేరసారాలు, ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందన్న ఆందోళన మధ్య శివసేన ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించారని తెలుస్తున్నది. శివసేన ఎమ్మెల్యే సునీల్ ప్రభు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేలంతా కలిసి ఉండటం తప్పనిసరి. ఉద్ధవ్ ఏ నిర్ణయం తీసుకున్నా మేం కట్టుబడి ఉంటాం అని చెప్పారు.

గవర్నర్‌తో బీజేపీ ఇతర మిత్ర పక్షాల నేతలు భేటీ కావడంపై శివసేన అధికార పత్రిక సామ్నా మండిపడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై జరిగిన చర్చల్లో రెండున్నరేండ్ల తర్వాత సీఎం పదవిని శివసేనకు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీనిపై రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని శివసేన పట్టుబడుతున్నది. కాగా, కొందరు శివసేన ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం ఫడ్నవీస్‌తో సంప్రదిస్తున్నారని బీజేపీ సన్నిహిత వ్యక్తులు చెబుతున్నారు. కాగా, తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తున్నదన్న శివసేన ఆందోళన నిజమైతే.. బీజేపీ-శివసేన కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నైతిక హక్కు ఉందా? అని కాంగ్రెస్ ప్రశ్నించింది. మరోవైపు, ఏ ఒక్క పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోతే అసెంబ్లీలో అతిపెద్ద పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ కోషియారీ ఆహ్వానించాల్సి ఉంటుందని మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ ముఖ్య కార్యదర్శి అనంత్ కల్సే చెప్పారు.

రాష్ట్రపతి పాలన తరహా పరిస్థితి సృష్టిస్తున్న బీజేపీ: సంజయ్ రౌత్


నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయమై ఎడతెగని జాప్యాన్ని కొనసాగిస్తూ బీజేపీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తరహా పరిస్థితిని సృష్టిస్తున్నదని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ ప్రకటిస్తే, శివసేన తదుపరి చర్యలు చేపడుతుందని గురువారం మీడియాకు చెప్పారు.

గవర్నర్‌తో బీజేపీ మంత్రుల చర్చలు

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మంత్రి చంద్రకాంత్ పాటిల్, మంత్రులు సుధీర్ ముంగంటివార్, గిరీష్ మహాజన్ తదితరులు గవర్నర్ కోషియారీని కలుసుకుని నూతన ప్రభుత్వ ఏర్పాటులో న్యాయ, చట్టపరమైన అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు కావడం బీజేపీకి ఇష్టం లేదని సుధీర్ ముంగంటివార్ చెప్పారు. పార్టీలకతీతంగా దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర సీఎంగా ఉండాలన్నదే తమ అభిమతమని, అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారన్న వార్తలను కొట్టి పారేశారు. 288 స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు కావాలి. బీజేపీ 105 స్థానాలు, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి.

1206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles