వివాహాలు రిజిస్టర్ చేసుకోని ఎన్నారైల పాస్‌పోర్టు రద్దు

Tue,February 12, 2019 02:35 AM

-రాజ్యసభలో బిల్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) భారత్‌కు చెందిన మహిళను లేదా విదేశాలలో సహచర ఎన్నారైలని వివాహం చేసుకున్న 30 రోజులలోగా తమ పెండ్లిని రిజిస్టర్ చేసుకోవాలి. లేదా వారి పాస్‌పోర్టు జప్తు చేయబడుతుంది లేదా రద్దవుతుంది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో ఎన్‌ఆర్‌ఐల వివాహ రిజిస్ట్రేషన్ బిల్లు-2019ని ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం అపరాధులుగా నిర్ధారణ అయిన ఎన్‌ఆర్‌ఐలు చట్టం ముందు లొంగిపోకపోతే వారి ఆస్తులను జప్తు చేసే అధికారం కోర్టులకు లభిస్తుంది. కోర్టులు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే ఒక ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా నిందితులకు సమన్లు, వారంట్లు జారీ చేస్తాయి. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రవాస భారతీయులు వివాహం పేరుతో మహిళలను మోసగిస్తున్న కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు ప్రకారం పాస్‌పోర్ట్ చట్టాన్ని, నేర శిక్షా స్మృతిని కూడా సవరించనున్నారు. ఓ ఎన్‌ఆర్‌ఐ భారతీయ మహిళను ఇక్కడ పెండ్లి చేసుకుంటే స్థానిక చట్టాల ప్రకారం తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. వివాహం విదేశాల్లో జరిగితే అక్కడి నిర్దేశిత అధికారుల వద్ద తమ పెండ్లిని రిజిస్టర్ చేసుకోవాలి. ప్రతిపాదిత చట్టం భారతీయ మహిళలను దేశంలో లేదా విదేశాల్లో వివాహం చేసుకొనే ఎన్‌ఆర్‌ఐలకు వర్తిస్తుంది.

బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం


వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ఈ నెల ఒకటిన ప్రతిపాదించిన తాత్కాలిక బడ్జెట్‌ను లోక్‌సభ సోమవారం ఆమోదించింది. బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ సమాధానమిస్తుండగా, ప్రతిపక్ష సభ్యులు అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ఈ గందరగోళం మధ్యనే ఆర్థిక బిల్లును, ద్రవ్య వినిమయ బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్, సీపీఎం, ఎన్సీపీ వాకౌట్ చేశాయి. వివిధ అంశాలపై ప్రతిపక్షాలు నిరసనకు దిగడంతో రాజ్యసభ కూడా వాయిదా పడింది. అంతకుముందే ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టింది.

1385
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles