శాంతియుతంగా భారత్‌బంద్


Tue,September 11, 2018 02:38 AM

Bharat Bandh Successful And Peaceful In BJP Ruled Rajasthan

-ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న పలు రాష్ర్టాల్లో విజయవంతం
-బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ మంచి స్పందన

న్యూఢిల్లీ/బెంగళూరు/తిరువనంతపురం, సెప్టెంబర్ 10: రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా సోమవారం ప్రతిపక్ష కాంగ్రెస్, వామపక్షాలు చేపట్టిన భారత్‌బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న మెజార్టీ రాష్ర్టాల్లో బంద్ విజయవంతమైంది. మరోవైపు పలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కూడా బంద్‌కు స్పందన లభించింది. రోడ్లపై వాహనాల సంచారం చాలా తక్కువగా కనిపించడంతోపాటు పాఠశాలలు, కళాశాలలు సహా అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. దేశరాజధాని ఢిల్లీలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. విద్యాసంస్థలు యథావిధిగా కొనసాగగా.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పలు చోట్ల ధర్నాలు, ఆందోళన నిర్వహించాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించలేదు. పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో బంద్ పాక్షికంగా సాగింది. గుజరాత్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు ఉధృతంగా చేపట్టారు. గుజరాత్ పీసీసీ అధ్యక్షుడు అమిత్ చావ్డా సహా 300 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణసేన (ఎంఎన్‌ఎస్) రంగప్రవేశం చేయడంతో మహారాష్ట్రలో బంద్ ప్రభావం కనిపించింది. కాంగ్రెస్, ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు ముంబైలో రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్‌లో బంద్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. పరీక్షలు కొనసాగుతుండటంతో విద్యాసంస్థలు యథావిధిగా కొనసాగాయి. గోవాలో వినాయక చవితి కారణంగా బంద్‌కు దూరంగా ఉండాలని గోవా కాంగ్రెస్ నేతల నిర్ణయించిన ఫలితంగా ఆ రాష్ట్రంలో బంద్ కనిపించలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మిజోరాంలోనూ బంద్ ప్రభావమేదీ కనిపించలేదు.

బీహార్‌లో ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ కార్యకర్తలు పలుచోట్ల విధ్వంసం సృష్టించారు. జహనాబాద్ జిల్లాలో దవాఖానకు చికిత్స కోసం తీసుకెళ్లేందుకు వాహనాలు లభించకపోవడంతో ఓ బాలిక చనిపోయిందని బీజేపీ ఆరోపించింది. అసోంలో సాధారణ జనజీవనానికి బంద్ కారణంగా అంతరాయం ఏర్పడింది. ఒడిశాలో బంద్ విజయవంతమైంది. దాదాపు 10 రైళ్లు రద్దుకావడంతోపాటు బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బంద్‌కు మంచి స్పందన లభించింది. బంద్‌కు ఛత్తీస్‌గఢ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా మద్దతు పలికింది. రాజస్థాన్‌లో సైతం విద్యాసంస్థలు, వాణిజ్యసముదాయాలు మూతపడ్డాయి.

దక్షిణాది రాష్ర్టాల్లో బంద్ ప్రభావం..

కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిల్లో బంద్ సంపూర్ణంగా కొనసాగింది. కేరళలో అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ బంద్‌కు మద్దతు పలుకడంతో ఆందోళన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు బంద్‌కు పిలుపునివ్వగా అధికార వామపక్ష కూటమి 12 గంటల బంద్‌ను కొనసాగించింది. కర్ణాటకలో కూడా బంద్ సంపూర్ణంగా కొనసాగింది. మంగళూరులో నిరసనకారులు హోటళ్లు, దుకాణాలపై రాళ్లు విసిరారు. తమిళనాడులో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ కూడా ప్రత్యేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది.


Lathi-Charge

తెలంగాణలో పాక్షికం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలో బంద్ పాక్షికంగా, ప్రశాంతంగా జరిగింది. చాలాచోట్ల బంద్ ప్రభావం కనిపించలేదు. రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలేవీ చోటు చేసుకోలేదని పోలీసులు తెలిపారు. పలుచోట్ల ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు ముందు జాగ్రత్తగా సెలవు ప్రకటించారు. మెజార్టీ కళాశాలలు యథావిధిగా పనిచేశాయి. ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం జరుగాల్సిన ప్రీ-పీహెచ్‌డీ పరీక్షలను మంగళవారానికి వాయిదావేశారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల సంఖ్యను తగ్గించారు. హైదరాబాద్‌లో బస్సులు యథావిధిగా నడిచాయి. చాలాచోట్ల పెట్రోల్‌బంక్‌లు తెరిచే కనిపించాయి. పలుచోట్ల నిరసనలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన కార్మిక సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

325
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles