క్యాన్సర్‌ కణాలకు అడ్డుకట్ట

Sat,November 23, 2019 03:29 AM

- వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేసిన బెంగళూరు మెడికల్‌ ఇంజినీర్‌
- గుర్తింపునిచ్చిన అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌
- ఘన రూప క్యాన్సర్‌కు పరిష్కారాన్ని చూపుతుందని ఆశాభావం

బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ప్రాణ సంకటంగా పరిణమిస్తున్న క్యాన్సర్‌ను వ్యాప్తి చెందించే కణాల వృద్ధిని నియంత్రించే పరికరాన్ని బెంగళూరుకు చెందిన ఓ మెడికల్‌ ఇంజినీర్‌ ఆవిష్కరించారు. ఈ పరికరాన్ని వినూత్న ఆవిష్కరణగా పేర్కొంటూ.. అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ గుర్తింపు ఇచ్చిందని ఆయన తెలిపారు. సైటోట్రాన్‌ అనే ఈ పరికరంను డీ సెలీన్‌ అనే ప్రైవేట్‌ రీసెర్చ్‌ కేంద్రంలో తయారు చేశారు. క్యాన్సర్‌ వచ్చిన సమయంలో శరీరమంతా కణాలు వ్యాపించకుండా అరికట్టడమే కాకుండా చికిత్స సమయంలో సదరు కణాలను కొవ్వు కణాలుగా ఈ పరికరం మార్చివేస్తుందని పరిశోధన కేంద్రం చైర్మెన్‌ డాక్టర్‌ రాజా విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ పరికరం అందుబాటులోకి వస్తే క్యాన్సర్‌కు జరిగే చికిత్స విధానంలో సమూల మార్పులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరికరాన్ని జనవరినాటికి దేశంలోని అన్ని దవాఖానల్లో అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ‘మాగ్నటిక్‌ రెసోనెన్స్‌(అయస్కాంత ప్రతిధ్వని) సాయంతో ఈ పరికరం శరీరంలోని కణాలు, కణజాలాల పనితీరులో మార్పులు తీసుకురావడానికి సాయపడుతుంది.

ఒక వ్యక్తి శరీరంలోని ఏ కణమైనా తన జీవిత కాలంలో 50 సార్లు విభజితమవుతుంది. ఆ తర్వాత ఈ విభజన ప్రక్రియ ముగుస్తుంది. అయితే క్యాన్సర్‌ కణితిలో మాత్రం కణాలు 50 సార్లు విభజితమైన తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి, ఈ పరికరం సాయంతో కృత్రిమ సిగ్నళ్లను పంపి క్యాన్సర్‌ కణితిని ప్రేరేపిస్తాం, దీంతో నిర్దిష్టమైన పీ -53 ప్రొటీన్‌ క్రమబద్ధీకరణ ఉండకపోవడంతో క్యాన్సర్‌ కణాలు పెరుగడం ఆగిపోతాయి’ అని విజయ్‌ కుమార్‌ చెప్పారు. దాదాపు 30 ఏండ్ల పాటు పరిశోధనలు చేశాక ఈ పరికరాన్ని అభివృద్ధి చేసినట్టు ఆయన పేర్కొన్నారు. రొటేషనల్‌ ఫీల్డ్‌ క్వాంటవ్‌ు న్యూక్లియర్‌ మేగ్నెటిక్‌ రెసోనెన్స్‌ టెక్నాలజీని ఉపయోగించి పని చేసే ఈ సైటోట్రాన్‌.. ఎంఆర్‌ఐ స్కానర్‌ మెషీన్‌ను పోలి ఉంటుంది. వివిధ కణజాలాల కూర్పుకు సాయపడే రేడియో ఫ్రీక్వెన్సీ టూల్స్‌ సాయంతో ఈ పరికరం పనిచేస్తుంది. రోగుల పరిస్థితిని బట్టి ప్రొటీన్లు లేదా కణజాలాలను అభివృద్ధి చేయాలా? లేదా తగ్గించాలా? అనే అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ పరికరం పని చేస్తుంది.

28 రోజుల పాటు చికిత్స

క్యాన్సర్‌ కణాల వృద్ధిని తగ్గించాలనుకున్నా, నిర్దిష్ట కణాలను వృద్ధి చేయాలని వైద్యుడు భావించినా.. దానికి అనుగుణంగా ఈ పరికరంలో ప్రొగ్రామింగ్‌ చేసుకోవచ్చు. సైటోట్రాన్‌ సాయంతో క్రమం తప్పకుండా 28 రోజుల పాటు చికిత్స అందిస్తారు. ఘనరూపంలో ఉన్న క్యాన్సర్‌/కణితిలకు ఈ పరికరం ద్వారా అం దించే చికిత్స ప్రభావవంతంగా పని చేస్తుంది. అంటే కాలేయం, క్లోమం, రొమ్ము క్యాన్సర్లు వంటి ఘనరూప క్యాన్సర్లకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. అయితే, ద్రవ రూపంలో ఉన్న బ్లడ్‌ క్యాన్సర్లకు ఈ పరికరం పనిచేయదు. సైటోట్రాన్‌ వాడటం వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కుమార్‌ చెప్పారు. ‘ఈ పరికరం ఉపయోగించి ముందస్తు పరీక్షలను నిర్వహించాం. చికిత్స తీసుకున్న వాళ్లలో ఇప్పటి వరకూ ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదు’ అని ఆయన చెప్పారు. ఐరోపా, మెక్సికో, అమెరికా, మలేషియా, గల్ఫ్‌ వంటి దేశాల్లో ఈ పరికరాన్ని వాడటానికి అనుమతులు లభించాయని, భారత్‌లో అనుమతుల ప్రక్రియ కొనసాగుతున్నదని కుమార్‌ తెలిపారు. ఈ సాంకేతికతను ఉపయోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న దవాఖానలతో చర్చలు జరుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.

1413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles