ఆఖరి అంకానికి లోక్‌సభ సమరం


Thu,May 16, 2019 02:35 AM

Bengal Campaigning Stopped Today

- రేపటితో తుదివిడుత ప్రచారానికి తెర
- బెంగాల్‌లో నేడే ప్రచారం బంద్
- ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
- ఎనిమిది రాష్ర్టాల్లోని 59 స్థానాలకు 19న పోలింగ్
- మే 23న ఫలితాలు


న్యూఢిల్లీ, మే 15: ఏడు విడుతల లోక్‌సభ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. ఏప్రిల్ 11న తొలి విడుత ఎన్నికలతో ప్రారంభమైన ప్రజాస్వామ్య మహాక్రతువు ఈ నెల 19న జరుగనున్న చివరి విడుతతో పరిసమాప్తం కానుంది. మే 23న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకుగాను 483 స్థానాలకు ఇప్పటికే ఎన్నికలు పూర్తికాగా, మిగిలిన 60 సీట్లలో 59 సీట్లకు చివరి విడుతలో పోలింగ్ జరుగనుంది. విచ్చలవిడి ధనప్రవాహం నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూర్ నియోజకవర్గ ఎన్నికను ఎన్నికల సంఘం రద్దు చేసింది. యూపీలో 13, పంజాబ్‌లో 13, పశ్చిమబెంగాల్‌లో 9, బీహార్‌లో 8, ఎంపీలో 8, హిమాచల్‌ప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌లో 3, చండీగఢ్‌లో ఒక స్థానానికి చివరి విడుతలో ఎన్నికలు జరుగనున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది. పెద్ద ఎత్తున హింస జరుగుతున్న బెంగాల్‌లో ఒకరోజు ముందుగానే ప్రచారం నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. చరిత్రలో మొదటిసారి తీసుకున్న నిర్ణయంతో గురువారమే బెంగాల్‌లో ప్రచారం ముగియనుంది.

లోక్‌సభ ఎన్నికల సమరాంగణం తుది అంకానికి చేరుకుంది. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 483 స్థానాలకు ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన 60 సీట్లలో 59 సీట్లకు చివరి(ఏడో) విడుతలో ఈనెల 19న పోలింగ్ జరుగనుంది. విచ్చలవిడి ధనప్రవాహం నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూర్ నియోజకవర్గ ఎన్నికను ఎన్నికల సంఘం (ఈసీ) రద్దు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 13, పంజాబ్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 9, బీహార్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 8, హిమాచల్‌ప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌లో 3, చంఢీగఢ్‌లో ఒక స్థానానికి ఏడో విడుతలో ఎన్నికలు జరుగనున్నాయి.
political1
అధికార పక్షానికి, ప్రతిపక్షానికి ఈ విడుత ఎన్నికలు కీలకం కానున్నాయి. చివరి విడుత కావడంతో ఇరుపక్షాలూ హోరాహోరీగా తలపడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 59 స్థానాలకుగాను బీజేపీ, దాని మిత్రపక్షాలు 40 స్థానాలను కైవసం చేసుకున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 9, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 4, జార్ఖండ్ ముక్తి మోర్చా 2, జనతాదళ్ (యునైటెడ్) ఓ స్థానాన్ని దక్కించుకున్నాయి.

మారిన లెక్కలు..

చివరి విడుత ఎన్నికలు జరుగుతున్న చాలా రాష్ర్టాల్లో రాజకీయ పరిణామాలు గత ఎన్నికలతో పోలిస్తే చాలావరకు మారాయి. పంజాబ్‌లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండేది. అయితే 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోనూ 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీని ఓడించి 15 ఏండ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. మరోవైపు గత లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. బీహార్‌లో జేడీయూ-ఆర్జేడీ మధ్య పొరపొచ్చాలు రావడంతో మహాకూటమి ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీతో కలిసి జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రాష్ర్టాల్లో బీజేపీ స్థానికంగా ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటుండడంతో లోక్‌సభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్‌గా మారాయి.

ఉత్తర్‌ప్రదేశ్

రాష్ట్రంలో చివరి విడుతలో ఎన్నికలు జరుగనున్న 13 స్థానాలనూ గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే కైవసం చేసుకుంది. నాడు ఆ పార్టీకి బీఎస్పీ ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. మొత్తం 8 స్థానాల్లో బీఎస్పీ రెండో స్థానంలో నిలిచింది. ఎస్పీ మూడు, కాంగ్రెస్, ఆప్ చెరో ఒక సీటులో రెండు స్థానంలో నిలిచాయి. అయితే ఈసారి ఎస్పీ-బీఎస్పీ కలిసి పోటీచేస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో మాదిరే బీజేపీని నిలువరిస్తామని ధీమాగా ఉన్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్, ఫుల్పూర్ స్థానాలతోపాటు కైరానా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. మహాకూటమి అభ్యర్థులే విజయం సాధించారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నది.

బీహార్

2014 ఎన్నికల్లో ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్పీ) ఎన్డీయే కూటమిలో ఉండేది. రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న 8 స్థానాల్లో గత ఎన్నికల్లో ఎన్డీయే 7 (బీజేపీ-5, ఆర్‌ఎల్‌ఎస్పీ-2), జేడీయూ ఓ స్థానంలో గెలుపొందాయి. ఈసారి ఆర్‌ఎల్‌ఎస్పీ.. ఆర్జేడీ-కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష శిబిరంలోకి చేరింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన జేడీయూ ఈసారి బీజేపీతో చేతులు కలిపింది.

మధ్యప్రదేశ్

మాల్వా-నిమార్ ప్రాంతంలోని 8 స్థానాలకు ఈ విడుతలో ఎన్నికలు జరుగనున్నాయి. గత ఎన్నికల్లో అన్ని స్థానాలను బీజేపీనే కైవసం చేసుకోగా, 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో పట్టు పెంచుకుంది. 2015లో ఝబువా-రాత్లాం స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జయభేరి మోగించింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో 66 స్థానాల్లో 56 బీజేపీనే గెలుపొందగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 21 స్థానాల్లోనే విజయం సాధించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని 9 నుంచి 35కు పెంచుకుంది.

పశ్చిమ బెంగాల్

42 లోక్‌సభ స్థానాలున్న బెంగాల్లో చివరి విడుతలో 8 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. గత లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాల్లోనూ టీఎంసీనే విజయం సాధించింది. ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా 21 స్థానాలను కైవసం చేసుకోవాలని కాషాయపార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రధాని మోదీతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

పంజాబ్, చంఢీగఢ్

పంజాబ్‌లోని 13 స్థానాలతోపాటు, చంఢీగఢ్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. గత ఎన్నికల్లో చంఢీగఢ్ స్థానంతో పాటు పంజాబ్‌లోని 6 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో విజ యం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలని పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో నాలుగు స్థానాలను కైవసం చేసుకున్న ఆప్ అంతర్గత పోరుతో సతమతమవుతున్నది.

హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్

హిమాచల్‌లో ఎన్నికలు జరుగనున్న నాలుగు స్థానాల్లోనూ గత ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధించింది. అలాగే 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించి కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక జార్ఖండ్‌లో ఈ విడుతలో మూడు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. గత ఎన్నికల్లో ఒక్క స్థానంలో బీజేపీ గెలుపొందగా, కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్న జార్ఖండ్ ముక్తి మోర్చా మిగిలిన రెండు స్థానాలను కైవసం చేసుకుంది.

అత్యధిక నేరచరితులు బీజేపీ నుంచే..

ఏడో విడుతలో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో నేరచరిత్ర కలిగిన వారు బీజేపీ నుంచే ఎక్కువ మంది ఉన్నట్టు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 43 మంది బీజేపీ అభ్యర్థుల్లో 18 మంది (42 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించినట్టు తెలిపింది. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 31 శాతం మందికి నేరచరిత్ర ఉన్నదని పేర్కొంది. 39 మంది బీఎస్పీ అభ్యర్థుల్లో ఆరుగురిపై, 313 మంది స్వతంత్రుల్లో 29 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలిపింది. మొత్తం 909 మంది అభ్యర్థుల్లో 127 మందిపై తీవ్ర నేరచరిత్ర ఉన్నట్టు పేర్కొంది.

710
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles