జీవితాంతం ఉచిత విమానయానం!Mon,June 19, 2017 02:05 AM

-విమానంలో పుట్టిన బాలునికి జెట్ ఎయిర్‌వేస్ కానుక

jet-airways
న్యూఢిల్లీ, జూన్ 18: తమ విమానంలో పుట్టిన ఓ బాలునికి జెట్ ఎయిర్‌వేస్ సంస్థ అపూర్వ కానుక అందించింది. సౌదీ అరేబియా నుంచి భారత్ వస్తున్న విమానంలో జన్మించిన ఆ బాలునికి జీవితాంతం తమ విమానాల్లో ఉచితంగా ప్రయాణించే లైఫ్‌టైమ్ పాస్‌ను అందించింది. జెట్ ఎయిర్‌వేస్ విమానం 9డబ్ల్యూ569 ఆదివారం ఉదయం 3.00 గంటలకు సౌదీలోని దమ్మమ్ నుంచి కొచ్చికి బయల్దేరింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ నిండు గర్భిణికి ఆకస్మికంగా పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో సిబ్బంది విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. విమానం అరేబియా సముద్రంపై సముద్రమట్టానికి 35వేల అడుగులపై ప్రయాణిస్తుండగానే ఆ మహిళ ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. విమానంలో వైద్యులెవరూ లేకపోవడంతో ఓ నర్సు సాయంతో సిబ్బంది ఆమెకు పురుడుపోశారు. విమానం ముంబైలో దిగిన వెంటనే తల్లీబిడ్డలను దవాఖానకు తరలించారు. ఇద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ సంస్థ తెలిపింది. తమ విమానాల్లో ఓ శిశువు పుట్టడం ఇదే మొదటిసారి అని అందుకే ఆ బాబుకు ఫ్రీ లైఫ్‌టైం పాస్ (జీవితాంతం ఉచితంగా ప్రయాణించే సదుపాయం) కల్పిస్తున్నామని జెట్‌ఎయిర్‌వేస్ ఒక ప్రకటనలో తెలిపింది. 90 నిమిషాలు ఆలస్యంగా విమానం కొచ్చికి చేరుకుంది.

3367

More News

VIRAL NEWS