బాబ్రీ మసీదు విచారణపై నివేదిక ఇవ్వాలి


Tue,September 11, 2018 02:18 AM

Babri Masjid trial has stalled my promotion Sessions Judge to Supreme Court

-జిల్లా జడ్జికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను నిర్దేశిత గడువులోగా ఏ విధంగా పూర్తి చేయనున్నారో తెలుపుతూ ఒక నివేదికను సీల్డ్ కవర్లో అందజేయాలని సుప్రీంకోర్టు దిగువ కోర్టు జడ్జిని ఆదేశించింది. ఈ కేసులో బీజేపీ సీనియర్ నాయకులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి తదితరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసు విచారణ జరుపుతున్న ట్రయల్ కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్ తన పదోన్నతిపై చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిశీలించింది. రాజకీయంగా ఎంతో సున్నితమైన 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, జోషి, ఉమాభారతి వంటివారిపై నమోదైన నేరపూరిత కుట్ర అభియోగాలపై విచారణను రోజువారీ ప్రాతిపదికన రెండేండ్లలో (2019, ఏప్రిల్ 19 నాటికి) పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్ 19న ఆదేశించింది. ఈ కేసు విచారణ పూర్తయ్యేవరకు సదరు జడ్జిని బదిలీ చేయవద్దని, తప్పనిసరి అయితే తప్ప కేసు విచారణను వాయిదా వేయవద్దని ఆదేశించింది. ఈ తీర్పుతో తన పదోన్నతి నిలిచిపోయిందని జడ్జి యాదవ్ వేడుకున్నారు. దీంతో బాబ్రీ కేసు విచారణను వచ్చే ఏప్రిల్ 19లోగా ఏ విధంగా పూర్తి చేయనున్నారో తెలుపాలని కోర్టు సోమవారం ఆదేశించింది.

283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS