అయోధ్య తీర్పునేడే

Sat,November 9, 2019 02:52 AM

-ఉదయం 10.30 గంటలకు!
-సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తృత భద్రత
-భద్రతావలయంలో అయోధ్య
-60 కంపెనీల పీఏసీ, పారా మిలిటరీ బలగాల మోహరింపు
-సీజేఐతో ఉత్తరప్రదేశ్ సీఎస్, డీజీపీల భేటీ
-యూపీలో విద్యాసంస్థలకు మూడురోజులు సెలవు
-రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తం.. సెలవులు రద్దు
-తీర్పును విజయం లేదా అపజయంగా భావించొద్దు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ/ అయోధ్య/ లక్నో, నవంబర్ 8: దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.. దాదాపు 27 ఏండ్ల క్రితం రాజకీయంగా, సామాజికంగా పలు సంచలనాలకు తెర తీసిన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం శనివారం తీర్పు వెలువరించనున్నది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఉదయం 10.30 గంటలకు చారిత్రక తీర్పును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యం లో దేశమంతా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. తీర్పును గౌరవిస్తూ సంయమనం పాటించాలని, శాంతిభద్రతల పరిరక్షణ కు సహకరించాలని రాజకీయ, అధ్యాత్మిక నేతలు ప్రజలకు విజ్ఞప్తిచేశారు. తీర్పును గెలుపు, ఓటమిగా చూడొద్దని దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. రైల్వేశాఖ తన పరిధిలోని పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేసి, సిబ్బంది సెలవులను రద్దు చేసింది. అయోధ్యతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని సున్నితమైన జిల్లాలు, నగరాలు, పట్టణాలు.. దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో భారీగా పోలీసులు, పారా మిలిటరీ బలగాలను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా పలు రాష్ర్టాల్లో అన్ని విద్యా సంస్థలకు శనివారం నుంచి సోమవారం వరకు సెలవులు ప్రకటించారు. వివిధ రాష్ర్టాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించడంతోపాటు పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. అయోధ్యతోపాటు యూపీ లో భద్రతా ఏర్పాట్లపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్.. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్ తివారీ, డీజీపీ ఓంప్రకాశ్ సింగ్‌లను శుక్రవారం పిలిపించుకు ని మాట్లాడారు. తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతాచర్యలపై వారికి దిశా నిర్దేశం చేశారు.

ఈ నేపథ్యంలో 4000 మందికి పైగా పారా మిలిటరీ బలగాల భద్రతతో అయోధ్య ఉక్కు దుర్గాన్ని తలపిస్తున్నది. చీమ చిటుక్కుమన్నా స్పందించే రీతిలో బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లుచేశారు. అయోధ్యలోని 28 స్కూళ్లను తాత్కాలిక జైళ్లు గా మార్చివేశారు. 78 చోట్ల రాపిడ్ రియాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఆర్‌ఎఫ్) బలగాలను మోహరించారు. డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు లక్నో, అయోధ్యలో రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదుకు వెళ్లే రహదారులను దిగ్బంధం చేశారు. పోలీసులు అడుగడుగునా తనిఖీ చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, ఇండ్ల పైభాగాలపై రాళ్లు సమకూర్చిన ప్రదేశాలను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు.
Ayodhya_Case1

నెల రోజులుగా ప్రజల్లో విశ్వాస కల్పన చర్యలపైనే కేంద్రీకరించాం. పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. వ్యాపారులు, విద్యావేత్తలు, మేధావులతో సంప్రదిస్తున్నాం అని యూపీ అదనపు డీజీపీ రామస్వామి వివరించారు. ఆలయ పరిసరాల చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. 60 కంపెనీల ప్రోవిన్షియల్ ఆర్మ్‌డ్ కానిస్టేబులరీ (పీఏసీ), పారా మిలిటరీ బలగాలను మోహరించినట్లు యూపీ అదనపు డీజీ (ప్రాసిక్యూషన్) అశుతోష్ పాండే తెలిపారు. అయోధ్యను ఆరు జోన్లుగా, 31 సెక్టార్లుగా, 35 సబ్ సెక్టార్లుగా విభజించి భద్రత కల్పించారు. రాష్ట్రంలో భద్రతపై సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం రాత్రి మూడు గంటల పాటు సమీక్షించారు. భద్రతా చర్యల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో లక్నోలో రూమ్, ప్రతి జిల్లా కేంద్రంలోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాల న్నారు. ఆగ్రాలోని సున్నిత ప్రదేశాల్లో ఐజీ సతీశ్ గణేశ్ సారథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరాల పోలీసులు కూడా అలర్టయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కీలక, సున్నిత ప్రదేశాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పెట్రోలింగ్ ముమ్మరం చేశారు.

తీర్పును గౌరవించి శాంతిని కాపాడండి.. ప్రజలకు మత పెద్దల విజ్ఞప్తి

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని ముస్లిం మత పెద్దలు, హిందూ పూజారులు, క్రైస్తవ ఫాదర్లు ఆయా వర్గాల ప్రజలను అభ్యర్థించారు. లక్నో ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాతి మాట్లాడుతూ తీర్పును మనమంతా గౌరవించాలి. ఇతర సామాజిక వర్గాల మతపరమైన మనోభావాలు దెబ్బతినకుండా మనం నిగ్రహం పాటించాలి. స్వతంత్ర భారతంలోనే అయోధ్య కేసు అతిపెద్దదైన, సున్నితమైన కేసు. శాంతిభద్రతల పరిరక్షణకు కోర్టు తీర్పును గౌరవించడం ప్రతి పౌరు డి బాధ్యత. ముస్లింలు భయపడవద్దు. న్యాయవ్యవస్థ, రాజ్యాంగంపై విశ్వాసం ఉంచా లి అని పేర్కొన్నారు. అఖిలభారత షియా పర్సనల్ లా బోర్డు (ఏఐఎస్పీఎల్బీ) అధికార ప్రతినిధి మౌలానా యసూబ్ అబ్బాస్ మాట్లాడు తూ మతాలకతీతంగా ప్రతి వ్యక్తి సుప్రీంకోర్టు తీర్పును తప్పక గౌరవించాల్సిందే. మేం తీర్పు కు కట్టుబడి ఉంటాం అని చెప్పారు. హజ్రత్‌గంజ్ దక్షిణ్‌ముఖి హనుమాన్ దేవాలయం పూజారి సర్వేశ్ శుక్లా మాట్లాడుతూ.. ఈ కేసు లో తీర్పును ప్రజలు గౌరవించాలని అభ్యర్థిస్తున్నా. దేశ ప్రజలు పూర్తి పరిణతితో వ్యవహరిస్తారని, తీర్పును ఆమోదిస్తారని నాకు విశ్వా సం ఉంది అని అన్నారు. లక్నో క్యాథలిక్ డి యోసిస్ చాన్స్‌లర్ ఫాదర్ డొనాల్డ్ డిసౌజా స్పందిస్తూ.. మనది ప్రజాస్వామ్య దేశం. చట్టం అందరికీ ఒక్కటే. కోర్టు తీర్పును పక్షపాతానికి తావు లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఇదే సంస్కారం అని అభిప్రాయ పడ్డారు.
Ayodhya_Case2

సీజేఐతో యూపీ సీఎస్, డీజీపీ భేటీ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌తో ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ కుమార్ తివారీ, డీజీపీ ఓం ప్రకాశ్ సింగ్ శుక్రవారం భేటీ అయ్యారు. అయోధ్య కేసులో తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో గొగోయ్ వారిని పిలిపించుకుని మాట్లాడారు. తన కార్యాలయంలో గంట సేపు ఈ సమావేశం జరిగింది. వారేం చర్చించారన్న విషయమై పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.

అలహాబాద్ హైకోర్టు తీర్పుపై 14 పిటిషన్లు

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమి విషయమై 2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 రిట్లు దాఖలయ్యాయి. సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లాకు భూమిని సమానంగా పంచుతూ నలుగురు సభ్యుల అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. అంతకుముందు దిగువ న్యాయస్థానంలో ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి. తొలుత రామ్‌లల్లా భక్తుడు గోపాల్‌సింగ్ విశారద్ వివాదాస్పద స్థలంలో పూజలు చేసే హక్కు కల్పించాలని 1950లో పిటిషన్ వేశారు. అదే ఏడాది పరమహంస రామచంద్ర దాస్ కూడా పిటిషన్ వేసినా తర్వాత ఉపసంహరించుకున్నారు. తర్వాత నిర్మోహి అఖడా 1959లో భక్తులకు పూజలు చేసుకునే హక్కు కల్పించాలని పిటిషన్ వేసింది. 1961లో వివాదాస్పద భూమి తమదేనని పేర్కొంటూ యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు కూడా కోర్టును ఆశ్రయించింది. రామ్‌లల్లా విరాజ్మన్ తరఫున 1989లో అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి డియోకీ నందన్ అగర్వాల్, రామజన్మభూమి కమిటీ పిటిషన్లు దాఖలు చేశారు. 1992 డిసెంబర్ ఆరో తేదీన బాబ్రీ మసీదు కూల్చివేతకు గురైన తర్వాత ఈ పిటిషన్లన్నీ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యాయి.
Ayodhya_Case3

శాంతి నెలకొల్పే బాధ్యత మెజార్టీలకే ఎక్కువ

న్యూఢిల్లీ, నవంబర్ 8: దేశంలో శాంతి నెలకొల్పే బాధ్యత మెజార్టీలకే ఎక్కువగా ఉన్నదని పలువురు ముస్లిం ప్రముఖులు పేర్కొన్నారు. మైనార్టీలకు సంరక్షకులుగా ఉన్న హిందువులకే ఈ బాధ్యత ఉంటుందని ప్రముఖ కవి మునావ్వర్ రానా అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముస్లింలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటూ పలువురు ముస్లిం మత పెద్దలు, రాజకీయ, హిందూ నేతలు పలు ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. అయితే నా అభిప్రాయం ప్రకారం, ఈ బాధ్యత ఒక్క ముస్లింలదే కాదు. మెజార్టీ వర్గమైన హిందువులదే. దేశంలోని ముస్లింలకు అండగా ఉంటారన్నది వారు నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది అని అన్నారు. షియా మత పెద్ద మౌలానా కల్బే జావాద్ కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మేమంతా సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం. ధర్మాసనం ఎవరి పక్షాన తీర్పు ఇచ్చినా ముస్లింలు అంగీకరించాలని చెబుతున్నాం. హిందూ సోదరులను కూడా ఇదే కోరుతున్నాం. వారి పక్షాన తీర్పు రాకపోయినా శాంతి నెలకొనేలా హిందూ సంఘా లు పిలుపునివ్వాలని కోరుతున్నాం అని చెప్పారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు, సున్నీ మత పెద్ద ఖలీద్ రషీద్ ఫరంగి మహాలి కూడా ఇటీవల ఇలాంటి అభ్యర్థనే చేశారు. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా అంతా గౌరవించాలని, ఇతరుల మనోభావాలు దెబ్బతిసే విధంగా ప్రవర్తించొద్దని పిలుపునిచ్చారు.

గెలుపూ ఓటమిగా చూడొద్దు: మోదీ ట్వీట్

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును గెలుపు, ఓటమిగా చూడవద్దు. మతపరంగా సున్నితమైన అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు శనివారం వెలువరించనున్న తీర్పు ఏ ఒక్కరికీ విజయం గానీ, అపజయం గానీ కాబోదు. తీర్పు వెలువడిన తర్వాత దేశ సంప్రదాయమైన ఐక్యత, మైత్రి, శాంతి, సామరస్యతను బలోపేతం చేయడానికి ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలి. తీర్పు వెలువరించిన తర్వాత మనమంతా ఐక్యతను కొనసాగించాల్సి ఉంది. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సామరస్య వాతావరణాన్ని నెలకొల్పేందుకు చర్యలు చేపట్టడం అత్యంత అభినందనీయం

తీర్పు ఎలా ఉన్నా శాంతి పరిఢవిల్లాలి: మంత్రి కేటీఆర్ ట్వీట్

నమస్తే తెలంగాణ, హైదరాబాద్: అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా వివేకం, శాంతి పరిఢవిల్లాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఆకాంక్షించారు. ఏడాది క్రితం టైమ్స్‌నౌ చానల్ ఇంటర్వ్యూలో తాను వెలిబుచ్చిన అభిప్రాయాన్ని పునరుద్ఘాటిస్తున్నానని ట్విట్టర్‌లో తెలిపారు. గత ఏడాది నవంబర్ 27వ తేదీన టైమ్స్‌నౌ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన కేటీఆర్.. మందిరం- మసీదుతో పేదలకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. దీనికంటే అవసరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉన్నదని అన్నారు. ఈ మేరకు జర్నలిస్టు నవికాకుమార్ చేసిన ఇంటర్వ్యూ స్క్రీన్‌షాట్‌ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

జస్టిస్ గొగోయ్‌కి జడ్‌ఫ్లస్ సెక్యూరిటీ

సీజేఐ రంజన్ గొగోయ్‌కి జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణ యం తీసుకు న్న ది. ఆయన నేతృ త్వంలోని రాజ్యాం గ ధర్మాసనం అయోధ్యపై శనివారం తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యం లో ఆయన భద్రతను పెంచింది. దేశంలోనే అత్యంత పటిష్టమైనదిగా భావించే జడ్ ప్లస్ సెక్యూరిటీని సీఆర్పీఎఫ్ పర్యవేక్షిస్తుంది.

చారిత్రక ధర్మాసనం ఇదే

అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ సారథ్యంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శనివారం తీర్పు చెప్పనున్నదని శుక్రవారం పొద్దు పోయిన తర్వాత న్యాయస్థానం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.. ఈ ధర్మాసనంలో జస్టిస్‌లు రంజన్ గొగోయ్, ఎస్‌ఏ బోబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్‌భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్ సభ్యులు. తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బోబ్డే స్పందిస్తూ.. అయోధ్య కేసు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన కేసుల్లో ఒకటి అని పేర్కొన్నారు. సాధారణంగా శనివారం (నవంబర్ 9) న్యాయస్థానాలకు సెలవు. అయినా వివాదాస్పద అంశంపై చారిత్రక తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు సిద్ధం కావడం గమనార్హం.

40 రోజులు వరుసగా విచారణ

ఈ వివాదం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడానికి మాజీ న్యాయమూర్తి ఎఫ్‌ఎంఐ కలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. ఆ ప్రయత్నం విఫలం కావడంతో చీఫ్ జస్టిస్ గొగోయ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు ఆరోతేదీ నుంచి వరుసగా 40 రోజులు రోజువారీ విచారణ జరిపింది. గత నెల 16న తీర్పును రిజర్వు చేసింది.

రెచ్చగొట్టే పోస్టులు పెడితే నాసా అమలు!

నోయిడా: అయోధ్య విషయమై సోషల్ మీడియాలో, వాట్సప్‌ల్లో హింసను ప్రేరేపించేలా, ద్వేషపూరితమైన పోస్టులు పెట్టే వారిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ), గ్యాంగ్‌స్టర్ల చట్టం కింద చర్యలు తీసుకుంటామని ఉత్తర్‌ప్రదేశ్‌లోని గౌతమ్‌బద్ధ్ నగర్ కలెక్టర్ బీఎన్ సింగ్ తెలిపారు. ద్వేషపూరిత పోస్టులు పెట్టేవారికి జైలుశిక్షతోపాటు కఠినమైన శిక్షలు ఉంటాయని ఒక ప్రకటనలో హెచ్చరించారు. వారి ఆస్తులను జప్తు చేస్తామన్నారు. మరోవైపు నోయిడా పోలీసులు విభిన్న వర్గాలు నివసించే ప్రాంతాల్లో శుక్రవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎప్పటికప్పుడు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలంతా ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

1151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles