అయోధ్యలో దీపావళి


Wed,November 7, 2018 02:10 AM

Ayodhya all set to witness grand Diwali celebrations

అయోధ్యతో కొరియాకు రెండువేల ఏండ్ల బంధం
- కొరియా వెళ్లి అక్కడి రాజును వివాహమాడిన అయోధ్య యువరాణి సూరిరత్న
-ఆ దేశంలో మహారాణి హియోగా ప్రసిద్ధి
- నాటి చరిత్రను గుర్తు చేసిన దక్షిణకొరియా మొదటి మహిళ పర్యటన
-క్వీన్ హియో మెమోరియల్ వద్ద నివాళి అర్పించిన కిమ్ జంగ్ సూక్
-మంగళవారం అయోధ్యలో సరయూనది ఒడ్డున దీపావళి వేడుక ఘనంగా జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన దీపోత్సవ్ కార్యక్రమంలో ప్రజలు 3 లక్షలకుపైగా దీపాలు వెలిగించారు.
-దివ్వెలు: 3,01,152 గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో చోటు

అయోధ్య, నవంబర్ 6: భారత్-కొరియాల మధ్య ఉన్న 2 వేల ఏండ్ల నాటి బంధాన్ని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ భార్య, ఆ దేశ మొదటి మహిళ కిమ్ జంగ్ సూక్ పర్యటన మరోసారి గుర్తుచేసింది. కొరియా మహారాణి హియో చరిత్రపై ఇరుదేశాల్లో మరింత ఆసక్తిని పెంచింది. కొరియన్ చరిత్రకారులు పేర్కొంటున్నదాని ప్రకారం అయోధ్యకు చెందిన యువరాణి సూరిరత్న 2 వేల సంవత్సరాల కిందట కొరియాకు వెళ్లి అక్కడి రాజు కిమ్ సూరోను వివాహం చేసుకున్నారు. యువరాణి సూరిరత్న కొరియాలో మహారాణి హియో హ్వాంగ్ ఓకేగా ప్రఖ్యాతిగాంచారు. ఈ నేపథ్యంలో తమ పూర్వీకురాలైన మహారాణి హియో మూలాలను వెతుక్కుంటూ చాలా మంది కొరియన్లు అయోధ్యకు వ స్తుంటారు. దక్షిణకొరియాలో దాదాపు 60 లక్షల మంది ప్రజలు తమ పూర్వీకురాలు క్వీన్ హియో అని పేర్కొంటారు. దక్షిణకొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ యంగ్ సామ్, మరో మాజీ అధ్యక్షుడు లీ మ్యంగ్ బ్యాక్ భార్య కిమ్ యూన్ ఓకే కూడా తమ పూర్వీకురాలు క్వీన్ హియో అని పేర్కొన్నారు. క్వీన్ హియో పురాతన చరిత్ర కొరియా, భారత్‌లను సాంస్కృతికంగా ఒక్కటి చేస్తున్నది. దక్షిణకొరియా మొదటి మహిళ కిమ్ జంగ్ సూక్ పర్యటన ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది అని దక్షిణకొరియా రాయబార కార్యాలయానికి చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. కిమ్ జంగ్ సూక్ పర్యటన నేపథ్యంలో ఆమెకు స్వాగతం పలుకుతూ అయోధ్యలో పెద్దఎత్తున హోర్డింగ్‌లు వెలిశాయి. కిమ్ సూక్ పర్యటన అయోధ్య గౌరవాన్ని మరింత ఇనుమడింప చేస్తుందని.. 2 వేల ఏండ్ల కిందట అయోధ్య యువరాణి కొరియాకు వెళ్లారని.. ఇప్పుడు కొరియా మొదటి మహిళ ఇక్కడికి వచ్చారని.. జీవితం ఒక వృత్తంలో తిరుగుతుందనడానికి ఇదే నిదర్శనమని ఉత్తమ్‌దాస్ అనే సాధువు పేర్కొన్నారు. ఈ ఏడాది జూలైలో మహారాణి సూరిరత్న మెమోరియల్ విస్తరణ ప్రాజెక్టు ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
ayodhya1
అయోధ్య: దీపావళి పర్వదినం సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య పట్టణంలో మంగళవారం నిర్వహించిన దీపోత్సవ్-2018 గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.
దీపోత్సవ్‌లో భాగంగా సరయూ నది ఒడ్డున 3,01,152 మట్టి దీపాలతో సరయూ నదీతీరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. మొత్తం 3,01,152 మట్టిదీపాలను ఏకకాలంలో ఐదునిమిషాల పాటు వెలిగించడం సరికొత్త రికార్డు అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, దక్షిణకొరియా మొదటి మహిళ కిమ్ జంగ్ సూక్ సమక్షంలో గిన్నిస్ రికార్డ్స్ అధికారి రిషినాథ్ ప్రకటించారు. 2016లో హర్యానాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో 1,50,009 దీపాలను వెలిగించారని, ఆ రికార్డును ప్రస్తుత దీపోత్సవ్-2018 అధిగమించిందని, ఇది అసాధారణ విజయమని పేర్కొన్నారు. సరయూ నదికి ఇరువైపులా మొత్తం 3.35 లక్షల దీపాలను వెలిగించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

దీపావళి వేడుకల్లో పాల్గొన్న కిమ్ జంగ్ సూక్..


కిమ్ జంగ్ సూక్ మంగళవారం అయోధ్యలోని క్వీన్ హియో మెమోరియల్‌ను సందర్శించి ఘన నివాళులు అర్పించారు. నాలుగురోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన ఆమె దీపావళి పర్వదినం సందర్భంగా అయోధ్యలో నిర్వహించిన పలు వేడుకల్లో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి పాల్గొన్నారు. హియో మహారాణికి గుర్తుగా ఏర్పాటు చేసిన మెమోరియల్ వద్ద నిర్వహించిన భారీ కార్యక్రమంలో సూక్.. నివాళులు అర్పించారు. తర్వాత సరయూ నది ఒడ్డున ఏర్పాటు చేసిన రామ్‌దర్బార్ కార్యక్రమాన్ని తిలకించారు. రామ్‌దర్బార్ కార్యక్రమానికి రాముడు, సీత వేషధారణల్లోని కళాకారులకు ఆమె ఆహ్వానం పలికారు.

887
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS