-రూపురేఖలు మార్చేందుకు అధికారుల ప్రణాళికలు
లక్నో, నవంబర్ 13: రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చిన నేపథ్యంలో ఇక అయోధ్య రూపురేఖలు సమూలంగా మార్చడంపై అధికారులు దృష్టిసారించారు. ఆ పట్టణంలో రిసార్టులు, ఫైవ్ స్టార్ హోటల్, అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్, విమానాశ్రయ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు. వీటికి అదనంగా సరయూ నదిపై క్రూయిజ్‌ను (జలవిహారం) ప్రారంభించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. అయోధ్య డివిజన్ సమాచార డిప్యూటీ డైరెక్టర్ మురళీధర్ సింగ్ అభివృద్ధి ప్రణాళికలను బుధవారం వివరించారు. ‘అయోధ్య తీర్థ్ వికాస్ పరిషత్‌ను ఏర్పాటుచేస్తాం. అయోధ్యలో సరయూ నదిపై క్రూయిజ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అయోధ్య.. తిరుపతి నగరంలా మారడానికి కనీసం నాలుగేండ్లు పడుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా ప్రారంభిస్తామని, వచ్చే శ్రీరామనవమి నాటికి తొలి విమానం టేకాఫ్ అవుతుందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ నిర్మాణంతోపాటు అయోధ్య రైల్వే స్టేషన్‌ను కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. అయోధ్య-ఫైజాబాద్ మధ్య ఐదు కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఫైవ్‌స్టార్ హోటల్‌తోపాటు పది రిసార్టుల నిర్మాణాల పనులు డిసెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంగా రామ మందిరాన్ని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. 2000 మంది రోజుకు 8 గంటలు పనిచేస్తే రెండున్నరేండ్లలో మందిర నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఇప్పటికే 65 శాతం శిల్పాలను చెక్కినట్లు తెలిపారు. 77 ఎకరాల ఆలయ క్యాంపస్‌లో గోశాల, ధర్మశాల, వేదిక్ సంస్థను ఏర్పాటుచేయనున్నట్లు వివరించారు. 10 శ్రీరామ ద్వారాలు, 10,000 కమ్యూనిటీ వసతి గృహాలను నిర్మించనున్నట్లు మురళీధర్ తెలిపారు.
ట్రస్ట్‌పై ప్రధానిదే నిర్ణయం: కేంద్ర మంత్రి
అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుపై ప్రధాని స్థాయిలోనే నిర్ణయం జరుగుతుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు. అంతకుమించి దీనిపై తానేమీ చెప్పలేనని బుధవారం ఓ చానల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నారు. మరోవైపు, రామజన్మభూమి న్యాస్ (ఆర్జేఎన్) ఉన్నందున ప్రత్యేకించి మళ్లీ ట్రస్ట్ ఏర్పాటుచేయాల్సిన అవసరం లేదని ఆర్జేఎన్ అధ్యక్షుడు మహంత్ న్రిత్య గోపాల్‌దాస్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ప్రతిపాదిత ట్రస్ట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు చోటు కల్పించాలని వీహెచ్‌పీ సూచించింది. ఆర్జేఎన్ డిజైన్ మేరకు ప్రభుత్వం అద్భుత మందిరాన్ని నిర్మిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది.
ఆ భూమిలోనే ఐదెకరాలివ్వాలి!
-67 ఎకరాల్లోనే మసీదుకు స్థలం ఇవ్వాలంటున్న ముస్లిం నాయకులు
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మసీదు నిర్మాణం కోసం కేటాయించనున్న ఐదెకరాల స్థలాన్ని అయోధ్యలోని వివాదాస్పద ప్రదేశం చుట్టూ ప్రభుత్వం సేకరించిన 67 ఎకరాల భూమి నుంచే ఇవ్వాలని ముస్లిం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 1991లో ఆ స్థలాన్ని సేకరించింది. ‘వారు (ప్రభుత్వం) మాకు ఇవ్వాలనుకుంటే మాకు అనుకూలమైనది ఇవ్వాలి. ఆ భూమి ఆ 67 ఎకరాలలోనే ఉండాలి. అప్పుడే తీసుకుంటాం. లేకపోతే తిరస్కరిస్తాం. 14 కోసుల (కిలోమీటర్ల) దూరం వెళ్లి మసీదు కట్టుకోవాలి అని కొందరంటున్నారు. అలా అనడం న్యాయం కాదు’ అని అయోధ్య భూవివాదం కేసులో ప్రధాన కక్షిదారుగా ఉన్న ఇక్బాల్ అన్సారీ పేర్కొన్నారు. అయోధ్యకు చెందిన స్థానిక ముస్లిం మతగురువు మౌలానా జలాల్ మాట్లాడుతూ, ముస్లింలు సొంతంగా భూమిని కొనుక్కొని మసీదును కట్టుకోగలరని చెప్పారు. ‘కోర్టు లేదా ప్రభుత్వం మా మనోభావాలను శాంతపరచాలనుకుంటే.. ఐదెకరాల స్థలాన్ని 67 ఎకరాల భూమి నుంచే ఇవ్వాలి. ఆ 67 ఎకరాలలోనే ముస్లింల సమాధులు, 18వ శతాబ్దానికి చెందిన సూఫీ మతగురువు ఖాజీ ఖుద్వా దర్గా ఉన్నది’ అని చెప్పారు.