ఐక్యతా రాగం.. ఫలించేనా?


Fri,March 15, 2019 11:09 AM

Attempts to establish Mahagathbandhan

-మహాఘట్ బంధన్ పట్టాలెక్కేనా?
-మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా విపక్షాల యత్నాలు
-ఎన్నికలు తరుముకొస్తున్నా కుదరని పొత్తులు
మోదీని ఎలాగైనా గద్దె దించాలనే ఏకైక ఎజెండాతో విపక్షాలన్నీ ఐక్యతారాగం ఆలపిస్తున్నాయి. మహాఘట్ బంధన్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్నా ఈ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. భిన్న భావజాలాలు, వ్యక్తిగత వైషమ్యాలు, ప్రాంతీయ అవసరాలు, పరస్పర విరుద్ధ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న విపక్షాలు.. ఈ విభేదాలన్నింటినీ పక్కనబెట్టి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి వ్యతిరేకంగా ఒక్కతాటిపైకి రాగలవా అన్నదే అసలు ప్రశ్న.
- ఎలక్షన్ డెస్క్


గత ఎన్నికల్లో కేవలం 31 శాతం ఓట్లతో బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ దాదాపు ఒంటరిగానే బరిలోకి దిగడంతో బీజేపీ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నేతృత్వంలో గత జనవరిలో కోల్‌కతాలోని బ్రిగేడ్ మైదానంలో నిర్వహించిన విపక్షాల ఐక్యతా సభకు దాదాపు 20 జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు హాజరయ్యారు. విభేదాలను పక్కనబెట్టి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని, ఎన్నికలు ముగిసిన తర్వాతే ప్రధాని అభ్యర్థిని నిర్ణయించాలని తీర్మానించాయి. అనంతరం ఢిల్లీలోనూ విపక్షాలు బలప్రదర్శన నిర్వహించాయి. ఈ సభకూ డజనుకుపైగా పార్టీలు హాజరయ్యాయి. అయితే సభకు మమతాబెనర్జీ వచ్చే కొద్ది నిమిషాల ముందు వామపక్ష నేతలు సీతారాం ఏచూరి,డీ రాజా వేదిక మీద నుంచి దిగిపోయారు. ఎన్డీయే సర్కారుకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరుకు సిద్ధమని నాయకులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ, విపక్షాల అనైక్యతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

akhilesh-yadav
ఢిల్లీలో కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య పొత్తు యత్నాలు ఫలించలేదు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసేందుకు తాము సిద్ధమంటూ ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి స్నేహ హస్తం అందించినా కాంగ్రెస్ స్పందించలేదు. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ స్పష్టం చేశారు. తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్‌తో కలిసి పోటీచేయాలని భావించాం. ఢిల్లీలో బీజేపీని ఓడించాలా వద్దా అన్నది ఇక కాంగ్రెస్ ఇష్టం అని ఆప్ నేత గోపాల్ రాయ్ వ్యాఖ్యానించారు.

ఇక పశ్చిమ బెంగాల్‌లో

తృణమూల్ కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్షాలు పొత్తుపై అవగాహనకు వచ్చాయి. అదే కేరళలో మాత్రం కాంగ్రెస్, వామపక్షాలు ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి.

మహారాష్ట్రలో

శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు.. మిత్రపక్షాలైనా శత్రుపక్షాలుగా వ్యవహరిస్తున్న శివసేన, బీజేపీలను దగ్గర చేసింది. రాజు శెట్టికి చెందిన స్వాభిమాన పక్ష, దళిత నేత ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాదీ కూటమితోనూ ఎన్సీపీ, కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నాయి. ఇక లెఫ్ట్‌ఫ్రంట్, జనతాదళ్ కూడా బరిలో ఉన్నాయి. పొత్తులు కొలిక్కి వచ్చేందుకు ఇంకొద్ది రోజులు పడుతుంది.

బీహార్‌లో

రెండు ప్రధాన ప్రతిపక్షాలైన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ ఆవాస్ మోర్చా (సెక్యులర్), ఉపేంద్ర కుశ్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్పీ)లతోనూ ఈ రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నా యి. యూపీ సరిహద్దు జిల్లాల్లో ప్రభావం చూపగల బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నది.

కర్ణాటకలో

కాంగ్రెస్, జేడీఎస్ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ 20, జేడీఎస్ 8 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. తమిళనాడులో అన్నా డీఎంకే, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకున్నాయి. వైగోకి చెందిన ఎండీఎంకే.. డీఎంకే కూటమిలో చేరగా, రాందాస్‌కు చెందిన పీఎంకే ప్రత్యర్థి శిబిరంలో చేరింది. ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, అసోం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో కాంగ్రెస్, బీజేపీ నేరుగా తలపడనున్నాయి.

బీజేపీ హఠావో.. దేశ్ బచావో

మోదీ సర్కారుకు గడువు తీరింది. దేశంలో మార్పు రావాలంటే కేంద్రంలో ప్రభుత్వం మారాలి. వచ్చే ఎన్నికల్లో విపక్షాలదే అధికారం. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ సర్కారు రాజ్యాంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నది. బీజేపీ హఠావో.. దేశ్ బచావో
-విపక్షాల ఐక్యతా సభలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

Narendra-Modi

అది మహాకల్తీ కూటమి

విపక్షాలది మహా కల్తీ కూటమి. అవినీతిపరులంతా ఒక్కచోటకు చేరారు. దోపిడీని అడ్డుకున్నందుకే వారంతా ఏకమయ్యారు. విపక్షాలు అధికారంలోకి వస్తే దేశాన్ని ఐసీయూలోకి నెడుతాయి. అవినీతి మళ్లీ
రాజ్యమేలుతుంది.
- ప్రధాని నరేంద్ర మోదీ

mayawati

ఎవరికి వారే.. యమునా తీరే..

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఒకేస్వరం వినిపిస్తున్న విపక్షాలు.. రాష్ట్రస్థాయిలో మాత్రం పరస్పరం ఢీకొంటున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బీహార్, జార్ఖండ్ మినహాయిస్తే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉమ్మడిగా తలపడే పరిస్థితులు కనబడడం లేదు. దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఘట్‌బంధన్‌ను ఏర్పాటు చేశాయి. అజిత్‌సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌ను తమ కూటమిలో చేర్చుకున్న ఈ రెండు పార్టీలు.. కాంగ్రెస్‌ను మాత్రం పక్కనబెట్టాయి. అయితే రాహుల్, సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల్లో పోటీ చేయబోమని ప్రకటించాయి. ఎస్పీ-బీస్పీ కూటమితో రాష్ట్రంలో త్రిముఖ పోరు ఖరారైంది. 1996లో బీఎస్పీ, 2017లో ఎస్పీ.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌కు రాంరాం చెప్పాయి!

Salman-Khurshid

రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగానే

బీజేపీని గద్దెదించాలనే కోరిక భిన్న స్వరాలను ఒక్కచోటుకి చేర్చినా.. అంతిమంగా రాష్ట్ర పరిస్థితులపైనే పొత్త్తు లెక్కలు ఆధారపడి ఉన్నాయని విపక్ష నేతలు అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయి కంటే రాష్ట్ర స్థాయిలో పొత్తులకే ప్రాధాన్యమిస్తున్నారు. అయితే రాష్ర్టాల్లో ఆయా పార్టీలు విడివిడిగా పోటీ చేసినా, ఎన్నికల అనంతరం బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ కూటమిలో విపక్ష పార్టీలన్నీ చేరుతాయని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు

priyanka-gandhi

భీమ్ ఆర్మీచీఫ్‌తో ప్రియాంక ఎందుకు భేటీ అయినట్టు?

దళితనేత, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను కలిసేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, తూర్పు యూపీ పార్టీ ఇంచార్జి అయిన ప్రియాంక గాంధీ-వాద్రా మీరట్‌లోని దవాఖానకు వెళ్లడంలోని ఆంతర్యం ఏమిటి? పైగా ఆమె 15 నిమిషాల సేపు లోపలకు వెళ్లేందుకు వేచిఉండాల్సి వచ్చింది. నిజానికి ఆమె ఒక్కతే వెళ్లలేదు. ఆమె వెంట పశ్చిమయూపీ కాంగ్రెస్ ఇంచార్జి జ్యోతిరాదిత్య సింధియా, యూపీసీసీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ కూడా ఉన్నారు. ఆజాద్ దళిత రాజకీయాల్లోకి రాకెట్ వేగంతో దూసుకువస్తున్న సరికొత్తతార. పైగా ఆయన నడిపేది ఏదో మామూలు రాజకీయపార్టీ కాదు.. ఉద్యమ సంస్థ. మంగళవారం షహారన్‌పూర్‌లోని దేవ్‌బంద్‌లో బహుజన్ హుంకార్ ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. కాంగ్రెస్‌తో దోస్తీకి మాయావతి ససేమిరా అంటున్న నేపథ్యంలో దళితుల్లో పట్టున్న ఆజాద్ వంటి చురుకైన నేతల అండదండలు కావాలని కాంగ్రెస్ ఎంతగానో ఆరాటపడుతున్నది. యూపీలోనే కాదు మరే ఇతర రాష్ట్రంలోనూ హస్తంతో కరచాలనం ఉండబోదని బీఎస్పీ నేత తెగేసి చెప్పారు. ఇటు బీజేపీ, అటు మాయా-అఖిలేశ్ కూటమి.

మధ్యలో మనుగడ సాగించాలంటే కాంగ్రెస్‌కు దళితబహుజనుల అండదండలు ఎంతైనా అవసరం అనేది బహిరంగ రహస్యమే. దవాఖానలో భేటీ అనంతరం ప్రియాంక గాంధీ-వాద్రా ఆజాద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దళితుల విముక్తి కోసం ఆజాద్ పోరాడుతున్నారని మెచ్చుకున్నారు. ఆయన దళితుల వాణిని వినిపించేందుకు ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం ఆయన గొంతు నొక్కాలని చూస్తున్నదని అన్నారు. తన భేటీకి రాజకీయాలతో సంబంధం లేదని, రాజకీయ దృష్టితో చూడరాదని ఆమె నొక్కిచెప్పారు. ఇలా ఎంత కాదన్నా ఈ భేటీ రాజకీయపరమైనదేనని రుజువుచేసే పరిణామాలు తర్వాత జరిగాయి. ప్రధాని మోదీపై వారణాసిలో పోటీచేస్తానని ఆజాద్ కాంగ్రెస్ నేతలు తనను కలిసి వెళ్లిన తర్వాత ప్రకటించడం గమనార్హం. యూపీనుంచి మోదీని ఎట్టి పరిస్థితుల్లో గెలువనివ్వను అని భీమ్ ఆర్మీ చీఫ్ ఢంకా బజాయించడం చర్చాంశమైంది. అంటే కాంగ్రెస్ మద్దతుతో వారణాసిలో ఆజాద్ పోటీచేస్తారా? ఇది జరిగే పని కాదని రాజకీయ పండితులు అంటున్నారు. కాంగ్రెస్ ఆయనను పశ్చిమ యూపీలోని నగీనా రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి పోటీకి పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మోదీకి పోటీగా 111 మంది రైతులు!

మోదీపై తమిళనాడు రైతులు భగ్గుమంటున్నారు. తమ డిమాండ్లను ఒక్కటి కూడా పరిష్కరించలేదంటున్నారు. ఢిల్లీలో 140 రోజుల పాటు ఆందోళనలు చేసినా తమ గోడు పట్టించుకోలేదని వాపోతున్నారు. బీజేపీ మానిఫెస్టోలో పంటలకు మద్దతు ధర, పంట రుణాల రద్దు, రైతులకు పింఛన్లు, వ్యక్తిగత బీమా అందించే విషయాలని చేర్చాలని జాతీయ దక్షిణ భారత నదుల అనుసంధాన రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకణ్ణు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ ఎక్కడ పోటీ చేసినా 111 మంది రైతులను బరిలోకి దింపి మోదీని ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు.

ఎఫ్‌బీ ప్రచారం ఊరికే రాదు!

ఎలక్షన్ సమయం.. ఫేస్‌బుక్‌కు మస్తు గిరాకీ ఉంది. అయితే ఫేస్‌బుక్ సంస్థ ఊరికే ప్రచారం చేస్తుందా? కోట్ల రూపాయలు ఇస్తేనే ప్రచారం చేస్తున్నాం అంటున్నారు. యాడ్ లైబ్రరీ ద్వారా ఈ వివరాలు ప్రకటిస్తున్నాం అంటున్నది ఫేస్‌బుక్. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 9 వరకు ఈ ఖర్చుల వివరాలను యాడ్ లైబ్రరీలో వెల్లడించింది. దీంట్లో శోధిస్తే పొలిటికల్ పార్టీలు.. నాయకుల ప్రచారానికి ఫేస్‌బుక్‌లో ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుస్తుంది. దేశవ్యాప్తంగా 2501 మంది తమ ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయగా చంద్రబాబు మళ్లీ నువ్వే రావాలి పేజీ.. జగన్ జగనన్నకి తోడుగా పేజీ టాప్-50లో నిలిచాయట.

677
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles