అటల్‌జీ అస్తమయం

Fri,August 17, 2018 09:13 AM

-బీజేపీ కురువృద్ధుడు వాజపేయి కన్నుమూత
-తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
-నేడు రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
-రాజకీయ భీష్ముడికి పార్టీలకు అతీతంగా ప్రముఖుల నివాళి
-ఏడురోజులు సంతాపదినాలుగా ప్రకటించిన కేంద్రం
-తెలంగాణ సహా పలు రాష్ర్టాల్లో నేడు సెలవు

భారత రాజకీయాల్లో ఒక గొప్ప ప్రజాస్వామ్యవాది శకం ముగిసిపోయింది. తొలితరం జాతీయ నాయకుల్లో ఒకరైన గొప్ప రాజనీతిజ్ఞుడిని జాతి కోల్పోయింది. అత్యుత్తమ పార్లమెంటేరియన్, మానవతావాది, జాతీయవాది, భారతరత్న పురస్కార గ్రహీత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి (93) మహాభినిష్క్రమణం చెందారు. గెలుపోటముల భయమే లేని నేత.. ఏ పరిస్థితుల్లోనూ ఎవరినీ ఏదీ కోరుకోకుండా.. కర్తవ్యదీక్షలో లభించిందే చాలనుకొన్న తాత్తిక రాజకీయవేత్త.. తనకు లభించిన గౌరవాన్ని, అభిమానాన్ని పొదివిపట్టుకుని దిగంతాలకేగారు. జాతీయత, మానవత, ఉదాత్తత కలగలిసిన అజాతశత్రువు.. సెలవుపలికారు. రాజధర్మాన్ని తు.చ. తప్పక పాటించిన అరుదైన వ్యక్తిత్వం.. ఇక కనిపించదు. ప్రత్యర్థులను సైతం మంత్రముగ్ధులను చేసిన ఆయన వాగ్ధాటి ఇక వినిపించదు. తన ప్రధాన రాజకీయ స్రవంతికి సాహితీసొబగులద్దిన మహాకవి.. రాజకీయాలను, కవిత్వాన్ని సమతూకం వేస్తూ.. దేశ రాజకీయ చిత్రపటంపై తనదంటూ ఓ ముద్రవేసిన మహానాయకుడు.. ఇక చరిత్ర పాఠమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన పదమూడు రోజులకే ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినా.. ఒక్క ఓటు తేడాతో పదమూడు నెలలకే ప్రభుత్వం పడిపోయినా.. అటల్.. అనే పేరుకు తగ్గట్టే దృఢమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించిన నేత.. పడిలేచిన కెరటం.. వాజపేయి. అందరితో అటల్‌జీ.. అంటూ ఆప్యాయంగా పిలిపించుకుంటూ సంపూ ర్ణ జీవితాన్ని అనుభవించిన నేత.. మనస్ఫూర్తిగా పోతున్నానంటూ వెళ్లిపోయాడు. సుదీర్ఘ అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం 5.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని యుమునానదీ తీరాన రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.
VajpayeePM1
న్యూఢిల్లీ, ఆగస్ట్16: రాజకీయ భీష్ముడు, మాజీ ప్రధాని, భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అటల్‌బిహారీ వాజపేయి కన్నుమూశారు. ఆయన వయసు 93ఏండ్లు. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన తొమ్మిది వారాలుగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం దవాఖానలోనే తుదిశ్వాస విడిచారు. జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయిన ఆయన.. నమిత కౌల్ భట్టాచార్య అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకున్నారు. తన ప్రచండ పదప్రవాహం లాగే నాలుగుదశాబ్దాల సుదీర్ఘ పార్లమెంటరీ జీవితాన్ని పరవళ్లు తొక్కించిన వ్యక్తి వాజపేయి. మూడు పర్యాయాలు భారత ప్రధానిగా పనిచేసిన వాజపేయి.. పూర్తికాలం ఆ పదవిలో కొనసాగిన ఏకైక కాంగ్రెసేతర నేతగా నిలిచారు. అనేక సంక్షోభాలనుంచి సమర్థవంతంగా దేశాన్ని గట్టెక్కించిన విశిష్ట రాజనీతిజ్ఞత ఆయన సొంతం. అతివాద పార్టీలో మితవాద నేతగా, అజాత శత్రువుగా రాజకీయాలకు అతీతమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు. పోఖ్రాన్ అణుపాటవ పరీక్ష, కార్గిల్ యుద్ధం, ఢిల్లీ-లాహోర్ బస్సుయాత్ర వంటి నిర్ణయాలతో ఆయన దేశచరిత్రలో చెరగని ముద్రవేశారు. ప్రజలు నివాళలర్పించేందుకు వీలుగా వాజపేయి భౌతికకాయాన్ని ఢిల్లీ కృష్ణమీనన్ మార్గ్‌లోని ఆయన నివాసానికి తరలించారు. దేశ రాజధానిలోని రాష్ట్రీయ శక్తిస్థల్‌లో శుక్రవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వాజపేయి మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా వివిధ రాష్ర్టాల సీఎంలు, కేంద్ర మంత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కొన్నేండ్లుగా ఇంటికే పరిమితమైన మాజీ ప్రధాని

2009లో గుండెపోటుకు గురైనప్పటి నుంచి ఇంటికే పరిమితమైన వాజపేయి పలురకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీర్ఘకాలంగా ఆయనకు ఒక కిడ్నీ మాత్రమే పనిచేస్తున్నది. మూత్రపిండాల, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను జూన్ 11న ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖానలో చేర్చారు. బుధవారం ఆయన ఆరోగ్యస్థితి విషమించిందని, చికిత్సకు ఆయన శరీరం సహకరించడంలేదని ఎయిమ్స్ వైద్యబృందం ప్రకటించింది. ఆయన కోలుకోవాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా అభిమానులు ప్రార్థనలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. 36గంటలుగా లైఫ్‌సపోర్టింగ్ సిస్టమ్‌పై ఉన్న ఆయన గురువారం సాయంత్రం 5:05 గంటలకు అంతిమశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. అంతకుముందు వాజపేయి అంతిమఘడియల సమాచారం అందుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, వాజపేయి సహచరుడు, పార్టీ సీనియర్ నేత అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పలువురు అధికార, విపక్ష పార్టీల నేతలు ఎయిమ్స్‌కు చేరుకుని ఆయన ఆరోగ్యస్థితిపై వైద్యులతో, కుటుంబసభ్యులతో మాట్లాడారు. మేం చేయాల్సినంతా చేశాం. అయినా ఫలితం దక్కలేదు. యావత్ జాతి దుఃఖిస్తున్న వేళ.. ఆ మహానేతకు మేము కూడా నివాళులర్పిస్తున్నాం అని వాజపేయికి వైద్యచికిత్సలందించిన డాక్టర్ ఆర్తి విజ్ తెలిపారు. 47 ఏండ్ల సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా కొనసాగిన వాజపేయి 10 పర్యాయాలు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పటి భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, పూర్వ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన అటల్ బిహారీ వాజపేయి 1996లో తొలిసారిగా ప్రధాని బాధ్యతలు చేపట్టారు. కూటమి రాజకీయాల్లో ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితిలో ఆయన ప్రభుత్వాలను నడిపారు. 1996లో 13రోజులకు, 1998లో 13నెలలకు వాజపేయి ప్రభుత్వం కుప్పకూలింది. 1999లో మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన 2004వరకు సుస్థిరంగా ఐదేండ్ల పదవీకాలాన్ని పూర్తిచేశారు.
VajpayeePM2

నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

మాజీ ప్రధాని వాజపేయి భౌతికకాయానికి శుక్రవారం ఢిల్లీలోని యమునానది ఒడ్డున ఉన్న రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గురువారం రాత్రి కృష్ణమీనన్ మార్గ్‌లోని నివాసానికి వాజపేయి పార్థివ దేహాన్ని తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కడినుంచి స్మృతిస్థల్ వరకు అంతిమయాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల తర్వాత అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేయనున్నారు. వాజపేయి మృతికి నివాళిగా ఏడురోజులపాటు జాతీయ సంతాపదినాలుగా పాటిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గురువారం నుంచి ఈనెల 22వ తేదీ వరకు దేశవ్యాప్తంగా కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని అవనతం చేసి ఉంచాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాజపేయికి నివాళులర్పించేందుకు వీలుగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఢిల్లీలోని దేశరాజధాని ప్రాంత పరిధిలోని అధికారులకు శుక్రవారం సగంరోజు సెలవు ప్రకటించారు. గురువారం రాత్రి అత్యవసరంగా సమావేశమైన కేంద్ర మంత్రివర్గం వాజపేయి మృతికి సంతాపం తెలిపింది.

ఏడురోజులు సంతాప దినాలు

నేడు సెలవు ప్రకటించిన పలు రాష్ర్టాలు
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మరణంతో కేంద్రప్రభుత్వం ఏడురోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇందులోభాగంగా గురువారం నుంచి ఈ నెల 22 వరకు అధికారికంగా ఎలాంటి వినోద కార్యక్రమాలు నిర్వహించబోరు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై ఎగురుతున్న జాతీయ జెండాలను సగం వరకు అవనతం చేయనున్నారు. వాజపేయి అంత్యక్రియలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సీపీఎస్‌యూలకు శుక్రవారం మధ్యాహ్నం నుంచి సెలవు ఇస్తున్నట్టు కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. మాజీ ప్రధాని మృతికి సంతాపసూచకంగా తెలంగాణ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, పంజాబ్, బిహార్, జార్ఖండ్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ర్టాలు శుక్రవారం సెలవు ప్రకటించాయి. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇస్తున్నట్టు పేర్కొన్నాయి.
VajpayeePM3

1986

అయోధ్య అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించుకుంది. దీనినే బీజేపీ బలమైన రాజకీయ అస్త్రంగా నమ్మింది. చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎంపీలను గెలిపించుకో గలిగింది.

1989

వీపీ సింగ్ సారథ్యంలోని జనతాదళ్ ప్రభుత్వానికి బయటినుంచి మద్దతునిచ్చిన బీజేపీ.. 1998లో మండల్ కమిషన్ ప్రకటన, అద్వానీ చేపట్టిన రామమందిర రథయాత్రను బీహార్‌లో అడ్డుకోవడంతో మద్దతు ఉపసంహరించుకుంది.

1991

1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.

1994-95

మహారాష్ట్ర, గుజరాత్ ఎన్నికల్లో గెలుపొందడం, అంతకుముందు 1994లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం బీజేపీకి రాజకీయ ప్రాముఖ్యం తెచ్చి పెట్టాయి. అయితే హిందూత్వ అతివాద ఎజెండానే పార్టీని అధికారంలోకి తెస్తుందని చాలామంది బీజేపీ నేతలు విశ్వసించారు.

1996

1996 ఎన్నికల్లో జాతీయవాద నినాదంతో ప్రచారం నిర్వహించిన బీజేపీ.. ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే లోక్‌సభలో విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు అవసరమైన మెజారిటీ సంపాదించడంలో విఫలం కావడంతో 13వ రోజున ఆ ప్రభుత్వం కుప్పకూలింది.

1998

1998 మధ్యంతర ఎన్నికల్లో కొన్ని పార్టీలతో జాతీయ ప్రజాతంత్ర కూటమి(ఎన్డీయే)గా కలిసి పోటీ చేసి బీజేపీ విజయం సాధించింది. 1999లో అప్పటి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మద్దతు ఉపసంహరించడంతో వాజపేయి సర్కార్ 13నెలలకే పడిపోక తప్పలేదు. ఈ రెండు సందర్భాలు వాజపేయికి అనేక పాఠాలు నేర్పాయి. సైద్ధాంతికంగా పార్టీ నడపడం కన్నా, ఎన్నికల రాజకీయాలు పూర్తి భిన్నమైనవని గ్రహించారు. స్థిరమైన ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రాంతీయపార్టీలతో చెలిమి చేయాలని, అనేక వర్గాలకు పార్టీ చేరువ కావాలని ఆయన భావించారు. ఆమేరకు కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ముస్లింల ప్రత్యేక పౌరస్మృతి రద్దు వంటి డిమాండ్లను బీజేపీ పక్కనబెట్టడానికి సిద్ధమవడానికి వాజపేయి సూచనలే కారణమని భావిస్తారు.

2004-14

2004 నుంచి 2014వరకు విపక్షంలో ఉన్నా వాజపేయి వేసిన తన బలమైన పునాదుల మీద బీజేపీ నిలబడింది. గుజరాత్ అల్లర్ల మరకలున్నప్పటికీ మోదీకి పలు ప్రాంతీయ పార్టీలు మద్దతు పలికి 2014లో అధికారంలోకి తీసుకురావడానికి కూడా వాజపేయి నడిపించిన మార్గంపై నమ్మికనే కారణం.

దేశం దిగ్గజ నేతను కోల్పోయింది

మనమందరం గొప్ప దిగ్గజ నేతను కోల్పోయాం. మాజీ ప్రధాని వాజపేయి నాయకత్వం, దూరదృష్టి, వాగ్ధాటి ఆయనను ఒక సమూహంగా నిలబెట్టింది. అటల్‌జీ చనిపోయారన్న వార్త వినడం అత్యంత బాధాకరం. మన మాజీ ప్రధాని నిజమైన భారతీయ రాజనీతిజ్ఞుడు. తన పదవీకాలంలో ఎన్నో సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నారు. ఆయన మనల్ని వదిలి వెళ్లిపోవడం మనందరికీ తీరని విషాదం.
- రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి

ఒక శకం ముగిసింది

వాజపేయి మరణంతో ఒక శకం ముగిసిపోయింది. ఆయన నాకు పితృసమానుడు. ఆయన మృతి నాకు వ్యక్తిగతంగా పూడ్చలేని లోటు. నా వంటి కార్యకర్తలకు ఆయన స్ఫూర్తి. అటల్‌జీ తన నాయకత్వ పటిమతో 21వ శతాబ్దపు భారత్‌కు దృఢమైన, సంపన్నమైన పునాది వేశారు. దూరదృష్టితో ఆయన అమలుచేసిన విధానాలు దేశంలోని ప్రతి పౌరుడి మనసును దోచుకున్నాయి. పట్టుదల, కృషితో ఒక్కొక్క ఇటుక పేరుస్తూ బీజేపీని నిర్మించారు. ఆయన వల్లే పార్టీ శక్తిమంతంగా ఎదిగింది. అటల్‌జీ మృతితో దేశం దుఃఖసాగరంలో మునిగిపోయింది.
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన నేత

మాజీ ప్రధామంత్రి అటల్ బిహారీ వాజపేయి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, ప్రధానమంత్రిగా విలువలతో కూడిన రాజకీయాలను చేసి దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. వాజపేయి మృతి దేశానికి తీరని లోటు. ఆయన ఉదారవాది, మానవతావాది, కవి, సిద్ధాంతకర్త, మంచి వక్త... నిరాడంబరుడు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన అటల్ బిహారీ వాజపేయి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం.
- కే చంద్రశేఖర్‌రావు, ముఖ్యమంత్రి

1329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles