హిందుత్వ విధానాలకు విధేయుడు


Fri,August 17, 2018 07:39 AM

Atal Bihari Vajpayee loyal to Hindutva policies

న్యూఢిల్లీ, ఆగస్టు 16: నెహ్రూ తరువాత అనర్గళంగా, కవితాత్మకంగా, ఆకట్టుకునే విధంగా ప్రసంగించగలిగిన నాయకుడు అటల్ బిహారీ వాజపేయి. ఈ దేశం అందించిన అతికొద్దిమంది గొప్ప వక్తలలో ఆయన ఒకరు. భాషపై ఆయనకున్న పట్టు, మాటలకు మత్తు జల్లి ఆయన చేసే ప్రసంగం శ్రోతలను ఉర్రూతలూగించేవి. భారత రాజకీయాలలో ఆయన అజాతశత్రువు. మూడుసార్లు ప్రధాని పదవిని అధిష్ఠించిన వాజపేయిని అసలు సిసలైన తొలి కాంగ్రెసేతర నేతగా చెప్పవచ్చు. ఆయనకన్నా ముందు మొరార్జీ దేశాయ్, చరణ్‌సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్, హెచ్‌డీ దేవెగౌడ ప్రధాని పదవిలో కొనసాగినప్పటికీ వీరందరూ ఏదో ఒక సమయంలో కాంగ్రెస్‌తో సంబంధాలున్న వారే. వాజపేయి ఆరెస్సెస్ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత శ్యాం ప్రసాద్ ముఖర్జీ మరణానంతరం జన్‌సంఘ్‌లో కీలకనేతగా ఎదిగారు. ఆయన ప్రధాన మంత్రి కావడం భారత రాజకీయాలలో అసలైన సైద్ధాంతిక మార్పుగా చెప్పుకోవచ్చు. అంతకుముందున్న ప్రధానమంత్రులు కాంగ్రెస్ పనితీరుతో విభేదించి, లేదా ఆ పార్టీపై తిరుగుబాటు చేసి ఇతర పార్టీలలో చేరినవారే తప్ప సిద్ధాంతపరంగా కాంగ్రెస్‌ను సవాలు చేసిన వారు కాదు.

దేశ రాజకీయాలలో వాజపేయి సిద్ధాంతపరంగా ఆ మార్పును చూపించగలిగారు. ఈ దశలో కాంగ్రెస్ తన సిద్ధాంతాలను సమీక్షించుకొని, పునర్నిర్మాణ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఆరెస్సెస్/బీజేపీలు మరింత పుంజుకున్నాయి. ఇందుకు తనవంతుగా వాజపేయి సంపూర్ణంగా తోడ్పడ్డారు. ఓవైపు ఎల్‌కే అద్వానీ దేశ సైద్ధాంతిక పునాదిని పునర్నిర్వచిస్తుండగా, మరోవైపు వాజపేయి దానిని అందరికీ ఆమోదయోగ్యంగా మార్చేందుకు ప్రయత్నించారు.

అందరికీ ఆప్తుడు

ఉదారవాదిగా, ఎవరికీ హాని తలపెట్టని వ్యక్తిగా పేరు తెచ్చుకొని, అందరికీ ఆప్తులయ్యారు. నేడు బీజేపీలో చేరేందుకు యువత ఉత్సాహం చూపిస్తుండవచ్చు. కానీ వాజపేయి రాజకీయాలలోకి ప్రవేశించిన సమయంలో ఆరెస్సెస్ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. మహాత్మా గాంధీని హత్య చేసిన ఆరోపణలు ఆరెస్సెస్‌ను వెంటాడుతున్నాయి. ఓవైపు పలు ప్రపంచ దేశాలలో కమ్యూనిజం విజృంభిస్తున్న దశలో, ఇటు దేశంలో నెహ్రూ నాయకత్వంలో అధికార పక్షం, రామ్ మనోహర్ లోహియా నేతృత్వంలో ప్రతిపక్షం విడిపోయిన దశలో వాజపేయి పార్లమెంట్‌లో హిం దూత్వ గురించి మాట్లాడి అందరినీ మెప్పించారు. అయితే ఆయన నీడలోనే ఆరెస్సెస్ పురోగతి సాధించగలిగింది. వాజపేయికి సైద్ధాంతిక స్పష్టత లేదని, ఆయన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మానవతావాదానికి, తన సొంత గాంధేయ సోషలిజానికి మధ్య ఉగిసలాడారన్న విమర్శలు ఉన్నాయి. కానీ ఆయన ద్వారా, ఆచరణాత్మ రాజకీయాలను ఆయన అవగాహన చేసుకున్న తీరు ద్వారా మాత్రమే ఆరెస్సెస్‌కు, బీజేపీకి గౌరవ మర్యాదలు దక్కాయనడం అతిశయోక్తి కాదు.

బీజెపీ/ఆరెస్సెస్ విధానాల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారనడం వాస్తవం కాదు. తమ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో ఆయన తన పార్టీ సహచరులు, గురువులతో విభేదించి ఉండవచ్చు కానీ ఆయన హిందూత్వ విధానాలకు ఎప్పు డూ విధేయుడిగానే ఉన్నారు. హిందూత్వ పార్టీలో ఉండదగిన వ్యక్తి కాదని అంటున్నారు, కానీ వాజపేయి అసలు సిసలైన ఆరెస్సెస్ కార్యకర్త. ఆయన అందులోనే పుట్టి పెరిగారు కాబట్టి హిందూత్వ విషయంలో ఆయన ఎన్నడూ ఎవరితోనూ విభేదించలేదు. ఆయన మృదుత్వమే ఆరెస్సెస్/బీజేపీలకు గొప్ప కవచంగా ఉపయోగపడింది. ఆరెస్సెస్ పత్రికలైన రాష్ట్ర ధర్మ, పాంచజన్య పత్రికలకు వాజపేయి సంపాదకునిగా కూడా పనిచేశారు.

743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles