పాత అస్ర్తానికి బీజేపీ పదును


Thu,December 7, 2017 02:36 AM

Assembly elections 2017 BJP set to win Gujarat to get 106-116 seats says opinion poll

గుజరాత్ ఎన్నికల్లో అయోధ్యను తెరపైకి తెచ్చిన కమలం పార్టీ
-కులాన్ని మతం కార్డుతో కొట్టేందుకు యత్నం

BJP
అహ్మదాబాద్, డిసెంబర్ 6: చేతి దాకా వచ్చిన ముద్ద నోటికి అందకుండా పోయినట్టు తయారైంది కాంగ్రెస్ పరిస్థితి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశావాహ దృక్పథంతో.. ఉద్ధృతంగా సాగుతున్న ఆ పార్టీ ప్రచారానికి అయోధ్య రాముని రూపంలో పెద్ద సవాల్ ఎదురైంది. అయోధ్య విషయంలో సున్నీ వక్ఫ్‌బోర్డు తరఫున సుప్రీంకోర్టు ఎదుట హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్.. కేసును 2019 సాధారణ ఎన్నికలయ్యే వరకు వాయిదా వేయాలని కోరారు. ఇదే ఇప్పుడు బీజేపీకి అందివచ్చిన అస్త్రంగా దొరికింది. తద్వారా బాబ్రీ విధ్వంసం జరిగి 25 ఏండ్ల తర్వాత.. అయోధ్య మరోసారి ఎన్నికల అంశంగా మారింది. కేసును వాయిదా వేయాలని సిబల్ కోరిన కొద్ది నిమిషాల్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. కాంగ్రెస్, రాహుల్‌గాంధీపై దాడి మొదలుపెట్టారు. మీరు గుజరాత్‌లోని అన్ని దేవాలయాలను సందర్శిస్తున్నారు. అయోధ్య అంశంపై కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టం చేయండి అని అమిత్‌షా కోరారు. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో కాషాయ దళాలు అప్పుడే ఉద్ధృత ప్రచారం ప్రారంభించాయి. మొదటిదశ పోలింగ్‌కు కేవలం మూడురోజులు మిగిలిన నేపథ్యంలో అయోధ్య ముఖ్యమైన ఎన్నికల అంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

బీజేపీకి ఇబ్బందిగా రాహుల్ ఆలయ సందర్శనలు..

22 ఏండ్లపాటు గుజరాత్‌లో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. రాహుల్‌గాంధీ నేతృత్వంలో బీజేపీ హిందూత్వ ఏకస్వామ్యంపై పదునైన దాడి మొదలుపెట్టింది. ఇదేక్రమంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌గాంధీ 15 రోజుల్లో 23 ఆలయాలను సందర్శించారు. ఇది బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులను సృష్టించింది. ఢిల్లీలో తన ఇంటికి దగ్గరలో ఉన్న అక్షరధామ్‌ను ఎన్నడూ సందర్శించని రాహుల్.. గుజరాత్‌లో ఆలయాలను సందర్శించడం కేవలం రాజకీయాల కోసమేనని బీజేపీ విమర్శించింది.
gujratelections

కులపోరుకు హిందూ ఏకీకరణతో చెక్

గుజరాత్‌లో ఎన్నడూలేని విధంగా ఈసారి బీజేపీకి వ్యతిరేకత ఎదురవుతున్నది. దీనికితోడు కులనాయకులు హార్దిక్‌పటేల్ (పటేల్ సామాజికవర్గం), అల్పేశ్ ఠాకూర్ (ఓబీసీ), జిగ్నేశ్ మేవానీ (దళిత) కాషాయ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏండ్ల తరబడి కొనసాగుతున్న తన హిందుత్వ ఓట్లను కాపాడుకునేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నది. అయోధ్య అంశాన్ని తెరపైకి తేవడంద్వారా కులాల పోరుకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నది. 2002లో నరేంద్రమోదీ విజయానికి ఇదే కారణం కావడం గమనార్హం. ఇదే ఫార్ములాను బీజేపీ ఇతర రాష్ర్టాల్లో కూడా విజయవంతంగా ప్రయోగించింది. బీజేపీ వ్యూహం లో భాగంగానే ప్రధాని మోదీ.. తీవ్ర హిందూ వ్యతిరేకి అయిన మొఘల్ రాజు ఔరంగజేబుతో రాహుల్‌గాంధీని పోల్చారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా ఎన్నికల్లో ఓడిపోతామనే బీజేపీ అయోధ్య అంశాన్ని లేవనెత్తుతున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.

ఎన్నికల చిత్రంలో లేని ముస్లింలు

వడోదర: 2002 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కడా పొంతన లేకుండా పోయింది. అప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు ప్రధాన ఎన్నికల అంశంగా కాగా ప్రస్తుతం వారి ఊసే లేకుండా పోయింది. ప్రధాన పార్టీలు వారి మాట ఎత్తడం లేదు. లౌకికవాద పార్టీగా ముద్రపడిన కాంగ్రెస్ కూడా తన తీరును మార్చుకున్నది. రాహుల్‌గాంధీ హిందూ ఆలయాల సందర్శనే ఇందుకు తార్కాణం. 2002 తర్వాత ముస్లింలు పూర్తిగా అంతర్లీనంగా ఉంటూ విద్య, వ్యాపారాలపైనే దృష్టిపెడుతున్నారు.

1052
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS