ఈసీలో అసమ్మతి


Sun,May 19, 2019 02:53 AM

Ashok Lavasa letter CEC Sunil Arora denies rifts over Model Code of Conduct

-నా అభిప్రాయాలు రికార్డు చేస్తేనే కోడ్ ఉల్లంఘనపై ఈసీ భేటీలకు హాజరవుతా: కమిషనర్ అశోక్ లవాస
-సీఈసీ సునీల్ అరోరాకు లేఖ.. మీడియాకు బహిర్గతం
-మోదీ- అమిత్‌షాలకు క్లీన్ చిట్‌పై అసంతృప్తి!
-లవాస అసంతృప్తి అర్థం లేనిదన్న సునీల్ అరోరా
-లవాస లేఖపై దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ, మే 18: తన అభిప్రాయాన్ని కూడా రికార్డు చేసే వరకు కోడ్ ఉల్లంఘన కేసులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్వహించే సమావేశాలకు హాజరు కాబోనని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాకు కమిషనర్ అశోక్ లవాస స్పష్టం చేశారు. ఈ మేరకు ఈ నెల 4న ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాకు కఠిన పదజాలంతో లవాస లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కోడ్ ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఇచ్చిన 11 ఫిర్యాదుల విషయమై ఈసీ వ్యవహార శైలితో లవాస విభేదించారని సమాచారం. మోదీ, అమిత్‌షాలకు ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్ సుశీల్ చంద్ర క్లీన్‌చిట్ ఇవ్వడంతో కోడ్ ఉల్లంఘనపై ఈసీ నిర్వహిస్తున్న సమావేశాలకు లవాస గైర్హాజరవుతున్నట్టు తెలిసింది. నేతలకు క్లీన్‌చిట్‌పై తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, మైనారిటీ నిర్ణయాలకు ప్రాధా న్యం దక్కడం లేదని లవాస ఆవేదన చెందారని తెలుస్తున్నది. కోడ్ ఉల్లంఘన, దానిపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని వాదించారు.

తాను లేఖరాసిన తర్వాత కూడా నేతల కోడ్ ఉల్లంఘనను ఈసీ సీరియస్‌గా తీసుకోవడం లేదని తన సన్నిహితుల వద్ద అన్నట్టు తెలుస్తున్నది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై చేసిన వ్యాఖ్యల విషయంలోనూ మోదీకి ఈసీ క్లీన్‌చిట్ ఇచ్చిందని, కనీసం అలా చేయకూడదని వారించేందుకు ప్రయత్నించలేదని వాపోయారని సమాచారం. తుది దశ పోలింగ్‌కు ముందు.. ప్రత్యేకించి కోడ్ ఉల్లంఘనపై జరిగిన ఈసీ సమావేశాల్లో భాగస్వామి కావడం లేదంటూ లవాస రాసిన లేఖ బహిర్గతం కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పందిస్తూ ముగ్గురు సభ్యుల కమిషన్‌లో అందరూ ఒకేలా ఉంటారని భావించొద్దన్నారు. సాధ్యమైనంతవరకు ఏకాభిప్రాయం.. లేని పక్షంలో మెజారిటీ నిర్ణయాలను అమలు చేయాలన్నారు. ఎన్నికల కోడ్ అమలుపై జరిగిన ఈసీ సమావేశాలకు దూరంగా ఉండాలని సహచర కమిషనర్ అశోక్ లవాస తీసుకున్న నిర్ణయం సరి కాదని సునీల్ అరోరా చెప్పారు. దీనిపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని, సమస్య అంతర్గతంగా పరిష్కరించుకోవచ్చునన్నారు. లవాస అసంతృప్తి అర్థం లేనిదన్నారు.

ఈసీలో పరిణామాలు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఏచూరి

కేంద్ర ఎన్నికల సంఘంలో పరిణామాలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులే తమ అసమ్మతిని బహిర్గతం చేసినప్పుడు ఈసీలో అసమ్మతిని ఎందుకు బహిర్గతం చేయరని ప్రశ్నించారు. ఈసీలో పరిణామాలు దాని తటస్థ వైఖరిపై తీవ్ర సందేహాలను లేవనెత్తుతున్నాయన్నారు. సుప్రీంకోర్టులో మెజారిటీ, మైనారిటీ అభిప్రాయాలు వచ్చినప్పుడు మైనారిటీ అభిప్రాయాలను బహిర్గతం చేస్తున్నారని ఏచూరి గుర్తు చేశారు.

Asaduddin

ఈసీలో అంతర్గత యుద్ధం బాధాకరం: అసద్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) వంటి విశ్వసనీయ సంస్థలో అంతర్గతంగా యుద్ధం (కమిషనర్ల మధ్య విబేధాలు) చాలా బాధాకరమని ఎంఐఎం అధ్యక్షుడు, అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. శేషన్ కేసుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఇతర కమిషనర్ల కంటే ఎక్కువేం కాదని, ఏకాభిప్రాయానికి కృషి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్టు గుర్తుచేశారు.

లవాస లేవనెత్తిన అంశాలపై విచారణ చేపట్టాలి: కాంగ్రెస్

ఎన్నికల కమిషనర్ అశోక్ లవాస లేవనెత్తిన అంశాలపై దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రధాని మోదీ హయాంలో ఈసీ సమగ్రత కొడిగట్టుకుపోతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఎలక్షన్ కమిషన్ కాస్తా ఎలక్షన్ ఒమిషన్ (మినహాయింపు) గా మారిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు. ప్రధాని మోదీ చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారిందన్నారు. మోదీ- అమిత్‌షా ద్వయానికి క్లీన్‌చిట్ ఇవ్వడంలో బిజీగా ఉన్న ఈసీ.. లవాస అసమ్మతి నోట్‌ను నమోదు చేసేందుకు నిరాకరించడం పట్టపగలు రాజ్యాంగ ప్రమాణాలను, సంప్రదాయాలను హత్య చేయడమేనని సుర్జేవాలా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ స్పందిస్తూ.. లవాస లేవనెత్తిన అంశాలపై తప్పనిసరి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాజా పరిణామంతో ఎన్నికల ప్రక్రియ పవిత్రత, ఈసీ సంస్థాగత సమగ్రతకు ముప్పు ఏర్పడిందని ట్వీట్ చేశారు.

470
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles