అసెంబ్లీ సీట్ల పెంపుపై మొదలైన కసరత్తుTue,July 18, 2017 01:26 AM

-కేంద్రహోం, న్యాయశాఖల సంప్రదింపులు
-ముసాయిదా బిల్లు తయారీ: ఎంపీ వినోద్‌కుమార్

MPVinodkumar
న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు దిశగా కేంద్రం కసరత్తు ప్రారంభించిందని ఎంపీ బీ వినోద్‌కుమార్ తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని తాము ప్రస్తావించి, ఈ ప్రయత్నాల్ని వేగవంతం చేయాలని కోరుతామని అన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ, న్యాయశాఖల మధ్య సంప్రదింపుల ప్రక్రియ మొదలైందని, ఇక కేవలం కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడం మాత్రమే మిగిలి ఉన్నదని చెప్పారు. న్యాయమంత్రిత్వశాఖ ఇప్పటికే ముసాయిదా బిల్లుకు ఒక రూపం ఇచ్చిందని, కేంద్ర రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ (సీసీపీఏ) భేటీలో నిర్ణయం తీసుకున్న తరువాత బిల్లుకు తుది మెరుగులు దిద్దుతుందని వినోద్ వివరించారు. పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి పెద్దగా సమయం కూడా అవసరం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26లో ఇచ్చిన హామీని అమలుచేయడానికి మాజీ అటార్నీ జనరల్ ఇచ్చిన లిఖితపూర్వక అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగంలోని 170(3) అధికరణంతో వచ్చే లీగల్ చిక్కుల్ని అధిగమించడానికి ఇప్పటికే సూత్రప్రాయంగా ఒక నిర్ణయం జరిగిపోయిందని ఆయన తెలిపారు. కేంద్రం రాజకీయపరమైన విధాన నిర్ణయం తీసుకున్న తరువాత రెండు మూడు రోజుల్లోనే ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతారని వివరించారు. ఈ వ్యవహారంలో న్యాయమంత్రిత్వశాఖ చేసిన సూచనలను హోంశాఖ పరిశీలించిందని, మంత్రిత్వశాఖలోని శాసనవ్యవహారాల విభాగం కూడా దాదాపు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని చెప్పారు. కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఈ వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు పెట్టడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని అన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో హైకోర్టు విభజన అంశాన్ని కూడా లేవనెత్తుతామని ఎంపీ తెలిపారు.

238

More News

VIRAL NEWS