ఎఫ్‌టీఐఐ నూతన చైర్మన్‌గా అనుపమ్‌ఖేర్


Thu,October 12, 2017 02:16 AM

Anupam Kher appointed as new FTII chairman

anupamkher
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: పుణెలోని ప్రఖ్యాత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) నూతన చైర్మన్‌గా ప్రముఖ నటుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత అనుపమ్ ఖేర్ (62) నియమితులయ్యారు. ఇంతకుముందున్న చైర్మన్ గజేంద్ర చౌహాన్ పదవీకాలం గత మార్చిలో ముగియడంతో నూతన చైర్మన్‌గా ఖేర్‌ను నియమిస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది. తన నియామకంపై అనుపమ్ ఖేర్ ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ సంస్థ అయిన ఎఫ్‌టీఐఐకి చైర్మన్‌గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. శక్తి వంచన లేకుండా నా విధులకు న్యాయం చేస్తాను అని పేర్కొన్నారు. ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్‌ఎస్‌డీ)లో డిగ్రీ పూర్తి చేసిన ఖేర్.. 500కు పైగా సినిమాల్లో, మరెన్నో నాటకాల్లో నటించారు. సినిమా రంగంలో సేవలకు గాను 2004లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. అనుపమ్ ఖేర్ భార్య, బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ తన భర్తకు ట్విట్టర్‌లో మొట్టమొదట శుభాకాంక్షలు తెలియజేశారు. ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా ఆయన తన విధులను సమర్ధంగా నిర్వహిస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇంతకుముందున్న చైర్మన్ గజేంద్ర చౌహాన్ ఎఫ్‌టీఐఐకి రెండేండ్లు సారథ్యం వహించారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది మార్చిలో ముగిసింది. కాగా గజేంద్ర చౌహాన్ నియామకం రాజకీయ ప్రేరేపితమైందని ఎఫ్‌టీఐఐ విద్యార్థులు 139 రోజులపాటు నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

అనుపమ్ ఖేర్ ప్రస్థానం..

హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో 1955 మార్చి 7న జన్మించిన ఖేర్.. డీఏవీ సొసైటీ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. హిందీ సినీపరిశ్రమలో ప్రజాదరణ కలిగిన, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుపొందిన ఖేర్.. 1982లో ఆగ్మాన్ చిత్రం ద్వారా సినీరంగప్రవేశం చేశారు. 1984లో వచ్చిన మహేశ్‌భట్ సినిమా సారాంశ్ ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. అనిల్ కపూర్, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్‌లతో కలిసి ఆయన ఎన్నో పాత్రల్లో నటించారు. కొన్ని చిత్రాల్లో విలన్‌గా నటించిన ఆయన హాస్యభరిత పాత్రలతోపాటు స్నేహపూర్వక తండ్రి పాత్రల్లో కూడాఒదిగిపోయారు. 2002లో ఓం జై జగదీశ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆస్కార్ అవార్డు పొందిన డేవిడ్ ఓ రస్సెల్స్ సినిమా సిల్వర్ లినింగ్స్ ప్లేబుక్ సహా పలు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) చైర్మన్‌గా.. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్‌ఎస్‌డీ) డైరెక్టర్‌గా అనుపమ్ ఖేర్ బాధ్యతలు నిర్వహించారు.

153

More News

VIRAL NEWS

Featured Articles