గారడీ బాబు..


Thu,March 21, 2019 02:27 AM

Andhra Pradesh People Fires On Chandrababu Naidu

-600 పైగా హామీలు.. ఒక్కటి అమలైతే ఒట్టు
-ఈ ఐదేండ్లలో ఏం చేశారో చెప్పేందుకు జంకు
-రాజకీయ విమర్శలతోనే ప్రచార పబ్బం

గుండాల కృష్ణ - హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ సర్వతో ముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. ఐదేండ్లు గడిచినా ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. బాబు మాటలన్నీ ఉత్తి మాటలుగానే మిగిలాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే చంద్రబాబు తాజా ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ఈ ఐదేండ్లలో తానేం చేశాననేది చెప్పడం లేదు. రాజకీయ విమర్శలతోనే పబ్బం గడుపుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఐదేండ్లు అయినా నేటికీ హైదరాబాద్‌ను నేనే నిర్మించా అనే కట్టుకథను వదలడం లేదు. పైగా తెలంగాణ ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేస్తూ తన హామీల అమలు నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా ఓటర్లు చైతన్యవంతులు. బాబు ఇచ్చిన హామీల అమలును ప్రజలు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలోని ఈ పరిస్థితులు పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దీనిని గమనించిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కీలక నేతలు వైసీపీ బాట పడుతున్నారు. ఇదంతా కండ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. ఐదేండ్లుగా చంద్రబాబు దాదాపు 600కుపైగా హామీలు ఇచ్చినట్టు రికార్డులు చెప్తున్నాయి. వీటిలో కనీసం పది శాతం కూడా సంపూర్ణంగా అమలు చేసిన దాఖలాలులేవనేది ప్రత్యర్థుల ఆరోపణ. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రజలకిచ్చిన ప్రధాన హామీలు-వాటి అమలు తీరుపై క్షేత్రస్థాయి వాస్తవాలను ఒక్కసారి పరిశీలిద్దాం.

.

రైతుల రుణమాఫీ.

2014లో ఎన్నికల సమయంలో బాబు ఇచ్చిన అత్యంత కీలకమైన హామీ ఇది. వాస్తవంగా రైతులు పెద్దఎత్తున టీడీపీకి ఓట్లేసేందుకు దోహదపడిన హామీగా రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఒక పరిమితి, ఒక పరిధి అంటూ లేకుండా రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తాననిచెప్పారు. కానీ అమలు విషయానికొచ్చేసరికి తన మార్కు జిమ్మిక్కులు ప్రదర్శించారు. రాష్ట్రంలో సుమారు రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేయా ల్సి ఉన్నది. కానీ ఇప్పటివరకు ఇచ్చింది కేవలం రూ.16 వేల కోట్లు మాత్రమే.

.

సాగుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా

వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని అమలునే మరిచారు. రాష్ట్రంలో 17 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారం తొమ్మిది గంటల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు రోజుకు 76 మిలియన్ యూనిట్ల కరంటు అవసరం. కానీ ప్రస్తుతం ఇస్తున్న కరంటు రోజుకు 29.67 మిలియన్ యూనిట్లు దాటడం లేదు. దీని ప్రకారం వ్యవసాయానికి సరఫరా అవుతున్నది కేవలం నాలుగు గంటలలోపేనని అంటున్నారు.

.

బెల్టు తీయలేదు..

2014 ఎన్నికల ప్రచారంలో బెల్టు షాపులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారాన్ని చేపట్టిన తర్వాత మద్యం ఏరులై పారేందుకు వీధివీధినా బెల్టు షాపులు తెరిచేలా మద్యం సిండికేట్లకు చంద్రబాబు ప్రభుత్వం ఊతమిచ్చిందనేది క్షేత్రస్థాయి వాస్తవం. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం షాపులుంటే.. వాటికి అనుబంధంగా 40 వేలకుపైగా బెల్టు షాపులు నడుస్తుండటం బాబు హామీ అమలు డొల్ల అనేందుకు నిదర్శనమని అంటున్నారు.

.

అప్పుల ఊబిలో డ్వాక్రా గ్రూపులు

రాష్ట్రంలో 9.37 లక్షల డ్వాక్రా సంఘాల పేరిట రూ.21,479 కోట్ల అప్పులున్నాయి. చంద్రబాబు డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి చాలా సంఘాలు అప్పులు చెల్లించడం ఆపేశాయి. కానీ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడంతో వడ్డీలు పెరిగిపోయి మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

.

భర్తీకి నోచుకోని ఉద్యోగాలు

రాష్ట్రంలో 2.40 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉంటే 2016లో పోలీసు ఉద్యోగాలు మినహా భర్తీ చేసినవి సుమారు 2,300 పోస్టులు మాత్రమే. 35 వేల టీచర్ పోస్టులు ఖాళీలున్నాయి. నాలుగేండ్లుగా కాలయాపనచేసి ఎన్నికల సమయంలో 7,902 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేశారు.

.

నిరుద్యోగ భృతి ఊసేలేదు

2014 ఎన్నికల సమయంలో బాబు ఇచ్చిన ప్రధాన హామీల్లో నిరుద్యోగులకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తాననేది కూడా ప్రధానం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడూ ఆ ఊసే ఎత్తలేదు.

.

ఆరోగ్యశ్రీ నిర్వీర్యం

ఎన్టీఆర్ హెల్త్ కార్డు ద్వారా అన్నిరకాల వ్యాధులకు కార్పొరేట్, ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో రూ.2.50 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తానని బాబు ప్రకటించారు. కానీ ఎక్కడా అమలుకు నోచుకోలేదు. వాస్తవానికి 938 జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉన్నా యి. వీటిల్లో 133 వ్యాధులకు ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం నిరాకరించారు. బకాయిలు చెల్లించకపోవడం, అనేక నిబంధనలతో ఆరోగ్యశ్రీని నిర్వీర్యంచేశారు.

.

ఐదువేల పాఠశాలలు మూత

బాబు కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడా అమలు కాలే దు. రాష్ట్రంలో విద్యార్థులు 16.10 లక్షల మంది ఉంటే, వారికి అరకొరగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తూ ఏటా విద్యార్థులపై రూ. 4,385.22 కోట్లకుపైగా భారం మోపుతున్నా రు. కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామని చెప్పి రేషనలైజేషన్ పేరిట ఐదు వేల పాఠశాలలు మూసివేశారని ప్రజలు చెప్తున్నారు.

.

ప్రాజెక్టుల్లో అవినీతి వరద

చంద్రబాబు సాగునీటిరంగంపై ఇచ్చిన హామీ లు అన్నీఇన్నీ కావు. పోలవరం ప్రాజెక్టు పూర్తి, హంద్రీనీవా, గాలేరు-నగరి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టులను సత్వర పూర్తితోపాటు చిన్ననీటి వనరులకు మరమ్మతులు చేస్తానని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల నుంచి నీరు గాకుండా అవినీతి వరదలై పారింది. ఈ ఐదేండ్లలో బాబు ప్రభుత్వం సాగునీటిరంగంపై రూ.64,334 కోట్లు ఖర్చుచేసింది. కానీ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లందించిన దాఖలాలు లేవని ప్రజలంటున్నారు.

209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles