ఎన్జీఎంఏపై పాలేకర్ ధ్వజం

Mon,February 11, 2019 01:21 AM

ఎగ్జిబిషన్‌లో ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్న సభ్యులు
ముంబై, ఫిబ్రవరి 10: నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ) తీరుపై సీనియర్ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రముఖ కళాకారుడు ప్రభాకర్ బార్వే స్మారకార్థం ఎన్జీఎంఏలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో శుక్రవారం పాలేకర్ ప్రసంగిస్తుండగా కొందరు ఎన్జీఎంఏ సభ్యులు ఆయనను పదేపదే అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన పాలేకర్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించి వేదిక దిగి వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్జీఎంఏ ముంబై, బెంగళూరు కేంద్రాల సలహా కమిటీలను రద్దుచేసినందుకు పాలేకర్ తన ప్రసంగంలో సాంస్కృతిక శాఖను విమర్శించినట్టు ఈ వీడియోలో ఉన్నది. దీనిపై పాలేకర్ ఆదివారం పుణెలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్జీఎంఏలో ఇద్దరు సీనియర్ కళాకారులకు సంబంధించిన ప్రదర్శనలను రద్దుచేయడం వెనుక కారణాలేమిటో తెలుసుకునేందుకే తాను ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఎన్జీఎంలోని కళాకారుల సలహా కమిటీ ముగ్గురు కళాకారుల ప్రదర్శనలను నిర్వహించేందుకు ఆమోదం తెలిపిందని, వీటిలో ప్రభాకర్ బార్వే ప్రదర్శనను మాత్రమే ప్రారంభించారని తెలిపారు.

ఎన్జీఎంఏ కొత్త డైరెక్టర్ అనితా రూపావతారమ్ కళాకారుల సలహా కమిటీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మిగిలిన రెండు ప్రదర్శనలను రద్దు చేశారు. ఈ విషయాలను నేను ప్రస్తావించదల్చుకున్నా. ఈ ప్రదర్శనలను రద్దు చేసేందుకు ఎప్పుడు ఎలా నిర్ణయం తీసుకున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నా అని పాలేకర్ పేర్కొన్నారు. సీనియర్ కళాకారుల ఎగ్జిబిషన్ల నిర్వహణకు ఎన్జీఎంఏలోని నాలుగు అంతస్తులను, కొత్త ఎగ్జిబిషన్ల నిర్వహణకోసం డోమ్ (ఐదో అంతస్తు)ను ఉపయోగించనున్నట్టు కొత్త డైరెక్టర్ తనకు తెలిపారని, దీనిపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఎన్జీఎంఏ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం దిగ్భ్రాంతి కలిగించిందని ఆయన తెలిపారు. స్వయంగా ఎన్జీఎంఏ తనను ఆహ్వానించిందని, ఎన్జీఎంఏ గురించి దాని సొంత వేదికపై తాను మాట్లాడటం ఎలా అనుచితమవుతుందో అర్ధంకావడంలేదని ఆయన అన్నారు.

417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles