15 రోజుల్లో ఆంక్షలు ఎత్తేస్తాం

Wed,September 4, 2019 01:25 AM

-కశ్మీర్‌లో సమాచార వ్యవస్థపై హోంమంత్రి అమిత్‌షా హామీ
-రాష్ర్టానికి చెందిన పంచాయతీ ప్రతినిధులతో భేటీ
-బీమా, భద్రత కల్పిస్తామని సర్పంచ్, వార్డు సభ్యులకు భరోసా

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో సమాచార వ్యవస్థపై ఉన్న ఆంక్షలను 15 రోజుల్లో ఎత్తివేస్తామని స్థానిక గ్రామపంచాయతీ ప్రతినిధులకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. లోయలోని గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యులందరికీ రూ.2 లక్షల చొప్పున బీమా సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. మంగళవారం కేంద్ర సహాయ మంత్రులు నిత్యానంద్‌రాయ్, జీకే రెడ్డి, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేందర్‌సింగ్, హోంమత్రిత్వశాఖ అధికారులతో కలిసి అమిత్‌షా.. జమ్ముకశ్మీర్‌లోని గ్రామ పంచాయతీల ప్రతినిధులు, యాపిల్ తోటల సాగుదారులు, పౌరులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు.

ఈ భేటీలో రాష్ట్ర సమస్యలు, సమాచార వ్యవస్థ, బీమా సదుపాయాల అంశాలను సర్పంచ్‌లు లేవనెత్తారు. తమ సమస్యలకు అమిత్‌షా సానుకూలంగా స్పందించారని కుప్వారాలోని లాంగేట్‌కు చెందిన సర్పంచ్ మీర్ జునైద్ చెప్పారు. పార్లమెంట్‌లో పేర్కొన్నట్టు ప్రాథమ్యాల ప్రకారం సమస్యలను పరిష్కరిస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారని తెలిపారు. మరోవైపు కశ్మీర్ మాజీ గవర్నర్ జగ్‌మోహన్‌తో అమిత్ షా భేటీ అయ్యారు. సంక్షేమ పథకాలు చివరివ్యక్తికీ చేరే అంశంపై చర్చించారు.

393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles