నిర్మల కాదు నిర్బల

Tue,December 3, 2019 02:55 AM

-మోదీ, అమిత్ షా, అద్వానీ చొరబాటుదారులు
-కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు
-క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పన్నుల సవరణ చట్టంపై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి బలహీనురాలిగా మారారంటూ విమర్శించారు. ఆమెను నిర్బల సీతారామన్ అని సంబోధించారు. దీంతో బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అధిర్ వ్యాఖ్యలకు ఆర్థిక మంత్రి ఘాటుగా సమాధానమిచ్చారు. నేను ఎప్పటికీ నిర్మలనే.. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రతి మహిళ ఓ సబలే అని వ్యాఖ్యానించారు. అధిర్ క్షమాపణలు చెప్పాలని ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించగా.. అధిర్ తిరస్కరించారు. మీకు ఇష్టమైతే తొలగించుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అధిర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలిగిస్తున్నట్టు స్పీకర్ చెప్పారు.

ఆ ముగ్గురే చొరబాటుదారులు

లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అధిర్ రంజన్ చౌదరి లేచి ప్రశ్న అడుగుతుండగా బీజేపీ సభ్యులు చొరబాటుదారులు అంటూ నినాదాలు చేశారు. దీనిపై అధిర్ స్పందిస్తూ.. అవును నేను చొరబాటుదారుడినే. ఓ చెదపురుగును కూడా. మోదీ, అమిత్ షా, అద్వానీ కూడా చొరబాటుదారులే అని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తాను దేశమంతటా ఎన్నార్సీకి వ్యతిరేకంగానే ఈ వ్యాఖ్యలు చేశానని అధిర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా బీజేపీ సభ్యులు నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓ సభలో అధిర్ మాట్లాడుతూ మోదీ, షా ఇండ్లు గుజరాత్‌లో ఉన్నాయి. వారు ఇప్పుడు ఢిల్లీలోకి చొరబడ్డారు అని వ్యాఖ్యానించారు.

309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles