విధుల్లోకి అలోక్‌వర్మ


Thu,January 10, 2019 03:08 AM

alok-verma-should-continue-director-cbi

-సీబీఐ తాత్కాలిక అధిపతి నాగేశ్వరరావు
-చేపట్టిన బదిలీలు రద్దుచేసిన వర్మ

న్యూఢిల్లీ, జనవరి 9: సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ మళ్లీ విధుల్లో చేరారు. 77 రోజుల తర్వాత బుధవారం తన కార్యాలయానికి చేరుకున్న వర్మకు సీబీఐ తాత్కాలిక అధిపతి ఎం నాగేశ్వరరావు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అక్టోబర్ 23న కేంద్రం తనను బలవంతంగా సెలవులపై పంపిన తర్వాత సీబీఐలో నాగేశ్వరరావు చేపట్టిన బదిలీలను వర్మ రద్దు చేస్తూ వెనువెంటనే ఉత్తర్వులు జారీచేశారు. అక్టోబర్ 24, జనవరి 3 తేదీల్లో సీబీఐలో పలువురు అధికారులను నాగేశ్వరరావు బదిలీచేశారు. వీటన్నింటిని ఉపసంహరిస్తున్నట్లు వర్మ తన తాజా ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. రాత్రి పొద్దుపోయే వరకూ వర్మ తన కార్యాలయంలో తీరికలేకుండా గడిపారు. వర్మ పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనున్నది. మరోవైపు అలోక్‌వర్మ భవిష్యత్తును నిర్ణయించే అత్యున్నత స్థాయి కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ తప్పుకున్నారు. మరో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ పేరును ఆయన ప్రతిపాదించారు. ఈ అంశం న్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలోక్‌వర్మ వెంటనే విధుల్లో చేరాలని, ఆయన్ను నిరవధిక సెలవులపై పంపడం తగదని మంగళవారం తీర్పు చెప్పిన ధర్మాసనానికి చీఫ్ జస్టిస్ గొగొయ్ నేతృత్వం వహించారు.


ఈ నేపథ్యంలోనే ఆయన స్వచ్ఛందంగా కమిటీ నుంచి తప్పుకున్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ అలోక్‌వర్మ భవితవ్యంపై నిర్ణయం తీసుకోనున్నది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, చీఫ్ జస్టిస్ లేదా ఆయన నామినీ సభ్యులుగా ఉండే ఈ కమిటీ వారంలోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. దీంతో ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత ఖర్గే, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన కమిటీ అలోక్‌పై చర్యల విషయంలో బుధవారం రాత్రి ప్రధాని నివాసంలో ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే, భేటీలో ఏం చర్చించారనే విషయాలు బయటకు వెల్లడికాలేదు. త్వరలో కమిటీ మరోసారి సమావేశమై దీనిపై చర్చించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles