రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధంMon,July 17, 2017 02:13 AM

-బరిలో రామ్‌నాథ్‌కోవింద్, మీరాకుమార్
-ఓటేయనున్న 4,896 మంది ప్రజాప్రతినిధులు

న్యూఢిల్లీ, జూలై 16: రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం జరుగనున్న పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కును వినియోగించుకొని కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. దళిత వ్యక్తే ఈసారి భారత అత్యున్నత పీఠాన్ని అధిరోహించనున్నారు. అధికార ఎన్డీయే కూటమి తరఫున రామ్‌నాథ్ కోవింద్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మీరాకుమార్ ముఖాముఖి తలపడనున్నారు. మొత్తం 4,896 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 776 మంది ఎంపీలు (543-లోక్‌సభ, 233-రాజ్యసభ) కాగా, మిగతా 4,120 మంది ఎమ్మెల్యేలు. ఒక్కో అభ్యర్థికి పోలైన ఎలక్టోరల్ ఓట్ల విలువ ఆధారంగా విజేతను నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఎలక్టోరల్ ఓట్ల విలువ 10,98,903. ఎమ్మెల్సీలకు ఓటు హక్కు లేదు.

ఏమిటీ ఎలక్టోరల్ ఓట్లు...

ప్రజలు నేరుగా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రత్యక్ష పద్ధతిలో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకొంటారు. రాష్ట్రపతి ఎన్నిక మాత్రం పరోక్ష పద్ధతిలో సాగుతుంది. కాబట్టి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల అభిప్రాయాన్నే ప్రజల అభిప్రాయంగా పరిగణిస్తారు. 1971 జనాభా లెక్కల ప్రకారం రాష్ర్టాల జనాభా ఆధారంగా ఎమ్మెల్యేల ఎలక్టోరల్ ఓటు విలువను లెక్కిస్తారు. ఉదాహరణకు 1971 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా 4,36,01,708. ఇందులో తెలంగాణ జనాభా 1,57,02,122గా నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జనాభాను 119తో భాగించి.. వచ్చిన ఫలితాన్ని వెయ్యితో భాగించగా, ఒక్కో తెలంగాణ ఎమ్మెల్యే ఎలక్టోరల్ ఓటు విలువ 132గా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇలా దేశం మొత్తం ఉన్న మొత్తం ఎమ్మెల్యేల ఎలక్టోరల్ ఓట్ల విలువ 5,49,495. ఈ మొత్తాన్ని ఎంపీల (776) సంఖ్యతో భాగిస్తే వచ్చేదే ఎంపీ ఎలక్టోరల్ ఓటు విలువ. ఈ లెక్కన ఒక్కో ఎంపీ ఓటు విలువ 708గా నిర్ధారించారు. 50 శాతానికిపైగా ఓట్లు (5,49,542) సాధించిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు. అత్యధిక ఓటు విలువ(208)తో యూపీ మొదటి స్థానంలో ఉండగా, సిక్కిం (7) చివరిస్థానంలో నిలిచింది.
RamnathKovind

రామ్‌నాథ్ వైపే మొగ్గు

సోమవారం జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తం ఓట్లలో ఒక్క బీజేపీ వాటానే దాదాపు 40 శాతం. కాబట్టి ఆయన విజయం నల్లేరుపై నడకేనని అంచనా. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ద్వారా 5,37,683 ఓట్లు రామ్‌నాథ్ ఖాతాలో చేరనున్నాయి. విజయానికి మరో 12,000 ఓట్ల దూరంలో నిలువనున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్, వైసీపీ, బీజేడీ, ఏఐఏడీఎంకే పార్టీలు రామ్‌నాథ్‌కు మద్ధతు పలికిన నేపథ్యంలో ఆయన ఖాతాలో 62.7 శాతం ఓట్లు పడవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరాకుమార్‌కు 27.7 శాతం ఓట్లు పోలవవచ్చని అంచనా. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికలో మద్ధతు ఇచ్చే అంశంపై సమాజ్‌వాదీ పార్టీ రెండుగా చీలిపోయింది. పార్టీ తరఫున మీరాకుమార్‌కు మద్ధతు ఇస్తున్నట్టు అఖిలేశ్ యాదవ్ ప్రకటించినా, ఎన్నికల్లో ములాయం వర్గం రామ్‌నాథ్‌కే ఓటు వేస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీలో 24 మంది ఎంపీలు, 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

పెన్నులు నిషేధం..

ఓటింగ్ సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు పెన్నులు తీసుకురాకుండా నిషేధం విధించామని ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి ఆదివారం పేర్కొన్నారు. ప్రత్యేకంగా తయారు చేయించిన మార్కర్‌తోనే ఓటు వేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గత ఏడాది హర్యానాలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పెన్ను వాడటం వల్ల వివాదం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వాయిలెట్ ఇంక్ ఉన్న మార్కర్లు వాడాలని నిర్ణయించామన్నారు. ఓటింగ్ చాంబర్‌లోకి వెళ్లేముందు పోలింగ్ అధికారి ఓటర్ల వద్ద ఉన్న పెన్నులను తీసుకొని మార్కర్లు, బ్యాలెట్ పేపర్లు అందిస్తారని, ఓటువేసి వచ్చిన తర్వాత ఆ మార్కర్లను తిరిగి తీసుకుంటారని చెప్పారు. ఎంపీలకు ఆకుపచ్చరంగు, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లు ఇస్తామన్నారు. ఎన్నిక సందర్భంగా 32 పోలింగ్ స్టేషన్లు, 33 మంది పరిశీలకులను నియమించారు. రిటర్నింగ్ ఆఫీసర్‌గా లోక్‌సభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారు. ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. యూపీ సీఎం ఆదిత్యనాథ్, గోవా సీఎం మనోహర్ పారికర్ సహా మొత్తం 55 మంది ఎంపీలు అసెంబ్లీల్లో ఓటు వేయనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. నలుగురు ఎమ్మెల్యేలు పార్లమెంట్‌లో ఓటు వేయనున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలు సంకుచిత మతతత్వ విధానాలపై పోరు: సోనియా

రాష్ట్రపతి ఎన్నికలు సంకుచిత మనస్తత్వంతో కూడిన విభజనవాద, మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చెప్పారు. ఆదివారం ఢిల్లీలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్, ఉపరాష్ట్రపతి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీలతోపాటు విపక్ష పార్టీలనేతలతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సంకుచిత భావజాలాన్ని దేశంపై రుద్దేందుకు అనుమతించబోమని స్పష్టంచేశారు. అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా తప్పనిసరిగా కష్టపడి పోరాడాల్సిందేనన్నారు. సిద్ధాంతాల కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో అంతా అంతరాత్మ ప్రభోదానుసారం ఓటేయాలని సోనియా పిలుపునిచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని, కానీ దురదృష్టవశాత్తు ఈ పదవులు ముట్టడిలో ఉన్నాయని సోనియా ఆందోళన వ్యక్తంచేశారు.

331

More News

VIRAL NEWS