ఆ కేసులన్నీ బదిలీ చేయండి

Wed,October 23, 2019 12:38 AM

-ఆధార్‌తో సోషల్ మీడియా ఖాతాల అనుసంధానంపై విచారణ జరుపుతాం
-2020 జనవరిలో సీజేఐ ముందుంచాలని రిజిస్ట్రీకి సూచించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్ అనుసంధానం విషయమై పలు హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను తమకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వీటిపై తామే విచారణ జరుపుతామన్న ద్విసభ్య ధర్మాసనం, బెంచ్ కేటాయింపు కోసం వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో వాటన్నింటిని సీజేఐ ముందుంచాలని రిజిస్ట్రీకి సూచించింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, తప్పుడు వార్తల ప్రచారాన్ని అరికట్టేందుకు ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌తో ఆధార్ నెంబర్ అనుసంధానానికి సంబంధించి మద్రాసు హైకోర్టులో రెండు, బాంబే, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో ఒకటి చొప్పన పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఫేస్‌బుక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లు ఒకే అంశానికి సంబంధించినవి కావడంతో వాటి విచారణపై స్టే విధించి అన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేసి విచారణ జరుపాలని ఫేస్‌బుక్ విన్నవించింది. అయితే హైకోర్టుల్లోని పిటిషన్ల విచారణపై స్టేకు నిరాకరించిన ధర్మాసనం, తుది తీర్పును మాత్రం వెలువరించవద్దని ఇటీవల ఆదేశిం చింది. మంగళవారం ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఆధార్ అనుసంధాన విధానం అన్నది వ్యక్తిగత గోప్యతను హరించేది కాదన్నారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు, సందేశాలను మార్పు చేసే మధ్యవర్తులను బాధ్యులుగా చేసే నిబంధనలపై 2020 జనవరిలోగా తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.మరోవైపు ప్రజల సామాజిక మాధ్యమాల ఖాతాలపై కేంద్రం నజర్ ఉండాలా? వద్దా? అన్నది సుప్రీంకోర్టు పరిశీలించనున్నది.

188
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles