నిరసన జ్వాలలు

Wed,December 4, 2019 03:25 AM

- ‘దిశ’ హత్యోదంతంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు
- దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌

దిశ దారుణ హత్యోదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారమూ నిరసనలు కొనసాగాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. దిశ ఘటనపై కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ నిరసన వ్యక్తంచేశారు. లైంగిక దాడి కేసుల్లో బాధితురాలి వయసు ఎంతో.. అన్ని రోజుల్లోగా తీర్పును ప్రకటించాలని డిమాండ్‌చేశారు. దిశకు న్యాయం చేయాలని కోరుతూ చేంజ్.ఓఆర్‌జీ అనే వెబ్‌సైట్‌లో పిటిషన్లపై 15 లక్షల మంది సంతకాలు చేశారు.
Doctors
న్యూఢిల్లీ/కోల్‌కతా: హైదరాబాద్‌ శివారులో గత నెల 27న చోటుచేసుకున్న ‘దిశ’ దారుణ హత్యోదంతంపై ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారమూ నిరసనలు కొనసాగాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. దిశ ఘటనపై ఒక వైపు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండగా, మరోవైపు మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో మంగళవారం కూడా లైంగికదాడి ఘటనలు చోటుచేసుకున్నాయి.

15 లక్షల మంది సంతకాలు

దిశకు న్యాయం చేయాలని కోరుతూ చేంజ్‌.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో వివిధ పిటిషన్లపై గత నాలుగు రోజుల్లో 15 లక్షల మందికిపైగా సంతకాలు చేశారు. నవంబర్‌ 29న దాఖలైన పిటిషన్‌కు 24 గంటల్లోనే మూడు లక్షల మంది మద్దతు తెలిపినట్లు చేంజ్‌.ఓఆర్‌జీ తెలిపింది. నాలుగు రోజుల్లో 500 మంది పిటిషన్లు ప్రారంభించారని వివరించింది. ముంబైకి చెందిన పశు వైద్యురాలు శంతను ప్రారంభించిన పిటిషన్‌పై అత్యధికంగా 8 లక్షల మందికిపైగా సంతకాలు చేశారని పేర్కొంది.

శాశ్వతంగా జైల్లో పెట్టాలి: హేమా మాలిని

దిశ ఘటనపై బీజేపీ ఎంపీ హేమామాలిని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేపిస్టులను శాశ్వతంగా జైల్లోనే ఉంచాలన్నారు. ‘మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి రోజూ వింటూనే ఉన్నాం. దోషులను శాశ్వతంగా జైల్లో ఉంచాలన్నది నా అభిప్రాయం. ఒకసారి జైల్లో వేశాక, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయకూడదు’ అని వ్యాఖ్యానించారు.

క్షమాభిక్షకు ఆస్కారమివ్వకూడదు: హర్‌సిమ్రత్‌

దిశ ఘటనపై కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ నిరసన వ్యక్తంచేశారు. దోషికి ఒకసారి మరణశిక్ష విధించాక, క్షమాభిక్ష పిటిషన్‌ వేసేందుకు అవకాశం ఇవ్వకూడదన్నారు. త్వరితగతిన విచారణ పూర్తిచేసి, కఠిన శిక్షలు అమలుచేయాలని డిమాండ్‌చేశారు. ‘లైంగిక దాడి కేసుల్లో బాధితురాలి వయసు ఎంతుందో అన్ని రోజుల్లోగా తీర్పును ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఒకవేళ బాధితురాలి వయసు 20 ఏండ్లు ఉంటే, 20 రోజుల్లోగా విచారణ ముగించాలి’ అని కోరారు.
Doctors1

దోషులను ఉరితీస్తే.. లైంగికదాడులు తగ్గుతాయా?: అపర్ణాసేన్‌

దిశ హత్యాచార దోషులను ఉరితీయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకురాలు అపర్ణాసేన్‌ స్పందిస్తూ.. దోషులను ఉరితీస్తే అలాంటి నేరాలు తగ్గుతాయా అంటూ ప్రశ్నించారు. ‘దిశపై లైంగికదాడి, హత్యకు పాల్పడిన దోషులకు బహుశా ఉరిశిక్ష పడొచ్చు. ఇది అత్యంత భయానకమైన నేరం. అయితే తర్వాత ఏంటి? ఇకపై లైంగిక దాడులు జరుగవా?’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

ఉరి సరే!.. తలారి ఎక్కడ?

- నిర్భయ కేసులో నేరస్థులకు త్వరలో ఉరిశిక్ష అమలు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నేరస్థులకు ఉరిశిక్ష విధించే సమయం ఆసన్నమైంది. కోర్టు నుంచి ‘బ్లాక్‌ వారంట్‌' జారీ అయిన తర్వాత ఏదో ఒకరోజు ఉరిశిక్షను అమలుచేసేందుకు వీలుగా ఢిల్లీలోని తీహార్‌ జైలు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. నిందితుల్లో ఒకడైన వినయ్‌శర్మ పెట్టుకొన్న క్షమాభిక్ష పిటిషన్‌ ప్రస్తుతం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పరిశీలనలో ఉన్నది. మిగతావారు పెట్టుకొన్న క్షమాభిక్ష పిటిషన్లు ఏవీ ఆమోదానికి నోచుకోలేదు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే ఉరిశిక్ష అమలుచేసేందుకు కోర్టు ‘బ్లాక్‌ వారంట్‌' జారీ చేస్తుంది. మరో నెల రోజుల్లో మరణశిక్షను అమలుచేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఉరి తీసే తలారీ.. తీహార్‌ జైలులో లేకపోవడంతో అధికారులు దానిపై దృష్టి పెట్టారు. ఏ క్షణంలోనైనా ‘బ్లాక్‌ వారంట్‌' జారీ అవకాశాలు ఉన్నందున తలారీని తాత్కాలిక పద్ధతిలో నియమించడం లేదా ఇతర జైళ్ల నుంచి రప్పించడం గురించి యోచిస్తున్నారు. 2012 డిసెంబర్‌ 16వ తేదీన ఢిల్లీలోని వసంత్‌విహార్‌ ప్రాంతంలో కదులుతున్న బస్సులో పారామెడికల్‌ విద్యార్థిని నిర్భయపై ఆరుగురు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన నిర్భయ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి మనం రోజూ వింటూనే ఉన్నాం. దోషులను శాశ్వతంగా జైల్లో ఉంచాలి.
- హేమామాలిని

దోషులను ఉరితీస్తే ఇలాంటి నేరాలు గణనీయంగా తగ్గుతాయా? ఇకపై దేశంలో లైంగిక దాడుల రేటు తగ్గుతుందా?
- అపర్ణాసేన్

543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles